[1] ఒకసారి దావీదు ఇలా అడిగాడు: “యోనాతాను కోసం నేను దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలివున్నారా?”
[2] మునుపు సౌలు కుటుంబానికి సీబా అనేవాడు పరిచారకుడు. వారు అతణ్ణి దావీదు దగ్గరికి పిలవనంపించారు. అతణ్ణి చూచి రాజు “నీవు సీబావా?” అని అడిగాడు. అతడు “నీ దాసుణ్ణి” అని జవాబిచ్చాడు.
[3] రాజు “దేవుని మూలంగా నేను దయ చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలివున్నారా?” అని అడిగినప్పుడు సీబా “యోనాతాను కొడుకు ఒకడు ఉన్నాడు. అతడు కుంటికాళ్ళు గలవాడు” అని రాజుతో చెప్పాడు.
[4] “అతడు ఎక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా “అతడు లోదెబారులో అమ్మీయేల్ కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని సమాధానం చెప్పాడు.
[5] అప్పుడు దావీదురాజు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేల్ కొడుకు మాకీరు ఇంటినుంచి అతణ్ణి రప్పించాడు.
[6] సౌలు మనుమడూ యోనాతాను కొడుకూ అయిన మెఫీబోషెతు దావీదుదగ్గరికి వచ్చి ముఖం వంచి సాష్టాంగపడ్డాడు. దావీదు “మెఫీబోషెతు!” అన్నాడు. అతడు “చిత్తం. నీ దాసుణ్ణి” అని మారు పలికాడు.
[7] దావీదు అతడితో అన్నాడు: “నీవు భయపడవద్దు. నీ తండ్రి యోనాతాను కోసం నేను నీమీద దయ చూపితీరుతాను. నీ తాత సౌలు భూమి అంతా నీకు మళ్ళీ ఇప్పిస్తాను. నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు.”
[8] అందుకు మెఫీబోషెతు అభివందనం చేసి “నా పట్ల నీవు దయ చూపడానికి నీ దాసుడైన నేను ఎంతటివాణ్ణి? నేను చచ్చిన కుక్కలాంటివాణ్ణి” అని చెప్పాడు.
[9] అప్పుడు దావీదురాజు సౌలు పరిచారకుడైన సీబాను పిలువనంపించి ఇలా అన్నాడు: “సౌలుకూ అతని కుటుంబానికీ చెందిన సొత్తంతా నీ యజమాని మనుమడికి ఇప్పించాను.
[10] నీవు, నీ కొడుకులు, నీ పనివాళ్ళు అతడికోసం ఆ భూమిని సాగు చేయాలి. నీ యజమాని మనుమడి పోషణకోసం నీవు ఆ భూమి పంటలు తేవాలి. అయినా నీ యజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు.” (సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది పనివాళ్ళు ఉన్నారు.)
[11] సీబా “నా యజమాని అయిన రాజు తన దాసుడైన నాకు ఆజ్ఞాపించినట్టే అంతా చేస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటినుంచి మెఫీబోషెతు రాకుమారుల్లో ఒకడులాగా రాజు బల్లదగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
[12] మెఫీబోషెతుకు చిన్న కొడుకు ఉన్నాడు. అతడి పేరు మీకా, సీబా ఇంటిలో కాపురముంటున్న వాళ్ళంతా మెఫీబోషెతుకు సేవకులుగా ఉన్నారు.
[13] మెఫీబోషెతు జెరుసలంలో కాపురముంటూ, ఎప్పటికి రాజు బల్లదగ్గర భోజనం చేశాడు. అతడి కాళ్ళు రెండూ కుంటివి.