[1] తరువాత అమ్మోనువాళ్ళ రాజు చనిపోయాడు. అతడి స్థానంలో అతడి కొడుకు హానూను రాజయ్యాడు.
[2] దావీదు “హానూను తండ్రి నాహాషు నా మీద దయ చూపాడు. నేను హానూను మీద దయ చూపుతాను” అనుకొన్నాడు. గనుక అతడి తండ్రి మృతి విషయం అతణ్ణి ఓదార్చడానికి దావీదు తన పరివారంలో కొంతమందిని పంపాడు. దావీదు సేవకులు అమ్మోనువాళ్ళ దేశానికి చేరినప్పుడు
[3] వాళ్ళ నాయకులు తమ యజమాని హానూనుతో ఇలా చెప్పారు: “నిన్ను ఓదార్చడానికి దావీదు మనుషులను పంపినది నీ తండ్రిని గౌరవించడానికే అనుకొంటున్నావా? ఈ నగరాన్ని నాశనం చేయాలని తనికీ చేయడానికీ అతడు వాళ్ళను గూఢచారులుగా పంపాడు, గదా!”
[4] అందుచేత హానూను దావీదు సేవకులను పట్టుకొని సగం గడ్డం గొరిగించి వారు తొడుగుకొన్న బట్టలను నడిమికి తుంటివరకు కత్తిరించి వారిని పంపివేశాడు.
[5] ఈ సంగతి దావీదుకు వినబడింది. ఆ మనుషులు చాలా సిగ్గుపాలయ్యారు, గనుక దావీదు వారి దగ్గరికి వెళ్ళడానికి కొంతమందిని ఈ సందేశంతో పంపాడు: “మీ గడ్డములు పెరిగేవరకు యెరికో దగ్గర ఆగి ఆ తరువాత తిరిగి రండి.”
[6] దావీదుకు తాము అసహ్యమయ్యామని అమ్మోనువాళ్ళు గ్రహించి రాయబారులను పంపి బేత్ రెహోబులో, సోబాలో ఉన్న సిరియా సైనికులను ఇరవై వేలమందిని జీతానికి పిలిపించు కొన్నారు. మయకా రాజు దగ్గరనుంచి వెయ్యిమందిని, టోబులో నుంచి పన్నెండు వేలమందిని కూడా జీతానికి పిలిపించు కొన్నారు.
[7] దావీదు ఈ సంగతి విని యోవాబునూ యుద్ధ వీరులందరినీ అమ్మోను దేశానికి పంపాడు.
[8] అమ్మోనువాళ్ళు తమ నగరంలో నుంచి బయటికి వచ్చి సింహద్వారానికి ఎదురుగానే యుద్ధ పంక్తులు తీర్చారు. సోబానుంచీ రెహోబు నుంచీ వచ్చిన సిరియనులు, మయకావాళ్ళు, టోబువాళ్ళు వేరుగా పొలాలలో ఉన్నారు.
[9] తనకు వెనకా ముందూ సైన్యవ్యూహాలు ఉండడం చూచి యోవాబు ఇస్రాయేల్ సైనికులందరిలో బలాఢ్యులను ఎన్నుకొని సిరియనులకు ఎదురుగా సైన్యవ్యూహమేర్పరచాడు.
[10] మిగిలిన వారిని తన తోబుట్టువు అబీషై అధికారంక్రింద ఉంచి అమ్మోనువాళ్ళకు ఎదురుగా సైన్యవ్యూహమేర్పరచాడు.
[11] యోవాబు “సిరియనుల బలం నాకు మించితే నీవు నా సాయానికి రావాలి. అమ్మోనువాళ్ళ బలం నాకు మించితే నేను నీ సాయానికి వస్తాను.
[12] ధైర్యంగా ఉండు. మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంతో పోరాడుదాం. తన దృష్టిలో ఏది మంచిదో యెహోవా అది చేస్తాడు గాక” అని అబీషైతో అన్నాడు.
[13] అప్పుడు యోవాబు అతడితో ఉన్నవారు సిరియనులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళారు. అతడి ఎదుటనుంచి వాళ్ళు పారిపోయారు.
[14] సిరియనులు పారిపోవడం చూచి అమ్మోనువాళ్ళు అబీషై ఎదుటనుంచి పారిపోయి పట్టణంలో చొరబడ్డారు. యోవాబు అమ్మోనువాళ్ళతో పోరాడడం మాని జెరుసలంకు తిరిగి వచ్చాడు.
[15] తాము ఇస్రాయేల్‌వారిచేత ఓడిపోయామని గ్రహించి సిరియనులు మళ్ళీ సమకూడారు.
[16] హదదెజరు యూఫ్రటీసు నది అవతల ఉన్న సిరియనులను పిలవనంపించాడు. వాళ్ళు హేలాంకు వెళ్ళారు. హదదెజెరు సైన్యానికి అధిపతిగా ఉన్న షోబక్ వాళ్ళకు నాయకుడుగా ఉన్నాడు.
[17] దావీదు ఈ సంగతి విని ఇస్రాయేల్ సైన్యమంతటినీ సమకూర్చి యొర్దాను దాటి హేలాంకు వెళ్ళాడు. దావీదును ఎదుర్కోవడానికి సిరియనులు సైన్యవ్యూహం ఏర్పర్చుకొని అతనితో యుద్ధం చేశారు.
[18] అయితే వాళ్ళు ఇస్రాయేల్‌వారి ముందునుంచి పారిపోయారు. దావీదు వాళ్ళలో ఏడు వందలమంది రథసారథులనూ నలభై వేలమంది సైనికులనూ హతం చేశాడు. వాళ్ళ సైన్యాధిపతి షోబక్ దావీదుచేత హతమై అక్కడ మృతి చెందాడు.
[19] హదదెజెరుకు పాలెవాళ్ళుగా ఉన్న రాజులందరూ తాము ఇస్రాయేల్‌వారి చేత ఓడిపోయామని గ్రహించి ఇస్రాయేల్ వారితో సమాధానపడి వారికి లొంగిపోయారు. అప్పటినుంచి సిరియనులు అమ్మోనువాళ్ళకు సహాయం చేయడానికి భయపడ్డారు.