Skip to content
Opens in a new window

[1] కాలక్రమేణ దావీదు ఫిలిష్తీయవాళ్ళను ఓడించి లొంగదీశాడు. వాళ్ళ వశంలోనుంచి మెతెగమ్మాను పట్టుకొన్నాడు.

[2] అంతేకాక, దావీదు మోయాబువాళ్ళను కూడా ఓడించాడు, పట్టినవాళ్ళను నేలపొడుగున పడుకొనేలా చేసి తాడుతో కొలత తీసుకొని రెండు తాడుల పొడుగున ఉన్న వాళ్ళను చావుకు గురి చేశాడు, ఒక్క తాడు పొడుగున ఉన్న వాళ్ళను బ్రతకనిచ్చాడు. మోయాబువాళ్ళు దావీదుకు లొంగిపోయి కప్పం చెల్లించే వాళ్ళయ్యారు.

[3] రెహోబు కొడుకూ సోబా దేశం రాజూ హదదెజరు యూఫ్రటీసు నది దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరినప్పుడు దావీదు అతడి పైబడ్డాడు.

[4] దావీదు అతడిదగ్గరనుంచి వెయ్యిన్ని ఏడు వందలమంది రౌతులనూ ఇరవై వేలమంది పదాతులను పట్టుకొన్నాడు. రథాల గుర్రాలలో ఒక వందను ఉంచుకొని మిగతావాటికి చీలమండ నరాలను తెగవేయించాడు.

[5] దమస్కులో ఉన్న సిరియనులు సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.

[6] దమస్కుకు చెందిన సిరియా రాజ్యంలో దావీదు తన సైనికుల శిబిరాలను ఉంచాడు. సిరియనులు దావీదుకు లొంగిపోయి కప్పం చెల్లించేవాళ్ళయ్యారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి విజయం ప్రసాదించాడు.

[7] హదదెజెరు అధిపతులకు ఉన్న బంగారు డాళ్ళను దావీదు పట్టుకొని జెరుసలంకు తీసుకువచ్చాడు.

[8] హదదెజెరు వశంలో ఉన్న బెతెహు, బేరోతై అనే పట్టణాలలో దావీదురాజు చాలా కంచు పట్టుకొన్నాడు.

[9] దావీదు హదదెజెరు సైన్యాన్నంతా ఓడించిన సంగతి హమాతు నగరం రాజు తోయికి వినబడింది.

[10] అంతకు ముందు హదదెజెరు తోయితో యుద్ధాలు చేసేవాడు, గనుక దావీదు యుద్ధంలో హదదెజెరును ఓడించాడని విని తోయి తన కొడుకు యోరాంను కుశల ప్రశ్నలను అడగడానికీ దావీదుతో కూడా సంతోషించడానికీ దావీదుదగ్గరికి పంపాడు. యోరాం వెండి బంగారు కంచు వస్తువులను కానుకలుగా తెచ్చాడు.

[11] దావీదురాజు వాటిని యెహోవాకు అంకితం చేశాడు.

[12] అదివరకు అతడు లొంగదీసిన సిరియనులు, మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ దేశాలవారి దగ్గరనుంచీ అమాలేకు జాతివాళ్ళ దగ్గరనుంచీ పట్టుకొన్న వెండి బంగారాలను కూడా యెహోవాకు అంకితం చేశాడు. రెహోబు కొడుకూ సోబారాజూ అయిన హదదెజెరు దగ్గరనుంచి పట్టుకొన్న దోపిడీసొమ్మును కూడా దావీదు యెహోవాకు ప్రతిష్ఠించాడు.

[13] దావీదు ఉప్పు లోయలో పద్ధెనిమిది వేలమంది సిరియను సైనికులను హతమార్చి తిరిగి వచ్చిన తరువాత అతని పేరు ప్రసిద్ధమైంది.

[14] అతడు ఎదోం దేశంలో కూడా సైనికుల శిబిరాలను ఉంచాడు. ఎదోంవాళ్ళంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు వాళ్ళ దేశమంతటా సైనికుల శిబిరాలను ఉంచాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి విజయమిచ్చాడు.

[15] దావీదు ఇస్రాయేల్ ప్రజలందరిమీదా పరిపాలించాడు. తన ప్రజలందరిపట్లా ధర్మాన్నీ న్యాయాన్నీ జరిగించాడు.

[16] సెరూయా కొడుకు యోవాబు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. అహీలుద్ కొడుకు యెహోషాపాతు దస్తావేజులమీద అధికారి.

[17] అహీటూబు కొడుకు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు యాజులు. శెరాయా కార్యదర్శి.

[18] యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీవారికీ పెలేతీవారికీ అధిపతి. దావీదు కొడుకులు ప్రముఖులు.

2 సమూయేలు — Chapters