Skip to content
Opens in a new window

[1] సౌలు వంశంవారికీ దావీదు వంశంవారికీ యుద్ధం చాలా కాలం జరిగింది. క్రమేణ దావీదు బలం ఎక్కువ అవుతూ ఉంది, సౌలు వంశంవారి బలం తక్కువ అవుతూ ఉంది,

[2] హెబ్రోనులో దావీదుకు కొడుకులు పుట్టారు. అతనికి మొదట పుట్టినవాడు యెజ్రేల్‌పట్టణస్తురాలు అహీనోయం కన్న అమ్నోను.

[3] రెండోవాడు కిల్యాబు. మునుపు కర్మెల్‌వాడైన నాబాల్‌కు భార్యగా ఉన్న అబీగేల్ అతణ్ణి కన్నది. మూడోవాడు అబ్‌షాలోం. గెషూరువాళ్ళ రాజైన తల్మయి కూతురు మయకా అతణ్ణి కన్నది.

[4] నాలుగోవాడు అదోనీయా. అతడి తల్లి హగ్గీతు. అయిదోవాడు షేఫట్య. అతడి తల్లి అబీటల్.

[5] ఆరోవాడు ఇత్రెయాం. అతడి తల్లి దావీదు భార్య ఎగ్లా. వీరు హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.

[6] సౌలు వంశీయులకూ దావీదు వంశీయులకూ యుద్ధం జరుగుతూ ఉన్నకాలంలో అబ్నేర్ సౌలు వంశీయులలో అధికారాన్ని అంతకంతకు చేకూర్చుకొంటూవచ్చాడు.

[7] మునుపు సౌలుకు ఉంపుడుకత్తె ఉంది. ఆమె అయా కూతురు రిస్పా. ఇష్‌బోషెతు అబ్నేర్‌ను ఇలా అడిగాడు: “నీవు నా తండ్రి ఉంపుడుకత్తెతో ఎందుకు పోయావు?”

[8] ఇష్‌బోషెతు మాటకు అబ్నేర్ చాలా కోపగించుకొని ఇలా చెప్పాడు: “నేను యూదావాళ్ళ పక్షం వహించిన కుక్కలాంటి వాడినా? నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. ఈ రోజువరకు నీ తండ్రి సౌలు కుటుంబంవాళ్ళ పట్ల, అతడి బంధువులపట్ల, మిత్రులపట్ల రాజభక్తితో వ్యవహరిస్తూ ఉన్నాను. అయినా ఇవ్వేళ ఆ స్త్రీ విషయం నామీద నేరం మోపుతున్నావు.

[9] సరి, యెహోవా దావీదుకు ప్రమాణం చేసినదానిని అతని పక్షాన నేనిప్పుడు నెరవేరుస్తాను.

[10] రాజ్యం సౌలు వంశంవాళ్ళ వశంలో లేకుండా చేస్తాను, దానునుంచి బేర్‌షెబావరకు ఇస్రాయేల్ వాళ్ళ మీదా యూదావాళ్ళ మీదా దావీదు రాజ్యాధికారాన్ని నేను సుస్థిరం చేస్తాను. నేనలా చేయకపోతే దేవుడు నాకు గొప్ప ఆపద కలిగిస్తాడు గాక!”

[11] ఇష్‌బోషెతు అబ్నేర్‌కు భయపడి ఇంకా ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు.

[12] అబ్నేర్ తన తరఫున దావీదుకు మనుషులచేత ఇలా కబురు పంపాడు: “ఈ దేశం ఎవరిది? మీరు నాతో ఒడంబడిక చేస్తే ఇస్రాయేల్‌వారందరినీ మీ వైపు త్రిప్పడానికి నేను మీకు సాయం చేస్తాను.”

[13] అందుకు దావీదు “మంచిది. నేను నీతో ఒడంబడిక చేస్తాను. అయితే నీవు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కూతురు మీకాల్‌ను నా దగ్గరికి తేవాలి. లేకపోతే నీవు నా ముఖాన్ని చూడవు” అని చెప్పాడు.

[14] అప్పుడు దావీదు సౌలు కొడుకైన ఇష్‌బోషెతు దగ్గరికి మనుషులను పంపి “నా భార్య మీకాల్‌ను నాకు అప్పగించు. ఆమెకోసం నూరుమంది ఫిలిష్తీయవాళ్ళ మర్మాంగచర్మం కొనలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొన్నాను” అని చెప్పాడు.

[15] ఇష్‌బోషెతు మనుషులను పంపి ఆమె భర్త, లాయీషు కొడుకైన పల్తీయేల్ దగ్గరనుంచి మీకాల్‌ను తెప్పించాడు.

[16] ఆమె భర్త బహురీం వరకు ఆమె వెనుక నడుస్తూ ఏడుస్తూ వచ్చాడు. అబ్నేర్ అతణ్ణి చూచి “తిరిగి వెళ్ళిపో” అన్నాడు. అతడు తిరిగి వెళ్ళిపోయాడు.

[17] అప్పుడు అబ్నేర్ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలతో మాట్లాడాడు. “మీకు దావీదు రాజు కావాలని కొంతకాలంనుంచి మీరు కోరుతూ ఉన్నారు.

[18] ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి! యెహోవా దావీదునుగురించి ఇలా చెప్పాడు గదా ‘నా సేవకుడు దావీదు ద్వారా నా ఇస్రాయేల్‌ప్రజలను ఫిలిష్తీయవాళ్ళ బారినుంచీ శత్రువులందరి బారినుంచీ నేను విడిపిస్తాను’” అని.

[19] అబ్నేర్ బెన్యామీనువారితో కూడా స్వయంగా మాట్లాడాడు. తరువాత అతడు హెబ్రోనుకు వెళ్ళి ఇస్రాయేల్ వారికీ, బెన్యామీను వంశంవారందరికీ ఉన్న కోరిక అంతా దావీదుకు తెలియజేశాడు.

[20] అబ్నేర్‌తో కూడా ఇరవైమంది మనుషులు వచ్చారు. వారంతా హెబ్రోనులో దావీదుదగ్గరికి చేరిన తరువాత దావీదు వారికి విందు చేయించాడు.

[21] అప్పుడు అబ్నేర్ “ఇస్రాయేల్‌ప్రజలంతా నా యజమాని అయిన రాజుతో ఒడంబడిక చేసేలా నేను వెళ్ళి వారిని సమకూరుస్తాను. సెలవివ్వండి”అని దావీదుతో చెప్పాడు. కనుక దావీదు అబ్నేర్‌ను పంపివేశాడు. అబ్నేర్ క్షేమంగా బయలు దేరాడు.

[22] ఈలోగా దావీదు మనుషులూ యోవాబూ ఏదో ఒక ప్రాంతం పైబడి చాలా దోపిడీసొమ్ముతో హెబ్రోను తిరిగి వచ్చారు. అబ్నేర్ ఇంకా హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. అప్పటికి దావీదు అతణ్ణి పంపివేశాడు, అతడు క్షేమంగా బయలుదేరాడు.

[23] యోవాబు, ఆ సైనికులంతా చేరుకొన్నప్పుడు నేర్ కొడుకు అబ్నేర్ రాజుదగ్గరికి వచ్చాడనీ రాజు అతణ్ణి పంపివేశాడనీ అబ్నేర్ క్షేమంగా బయలుదేరాడనీ యోవాబు తెలుసుకొన్నాడు.

[24] యోవాబు రాజుదగ్గరికి వెళ్ళి “నీవు చేసింది ఏమిటి? అబ్నేర్ నీదగ్గరికి వచ్చినప్పుడు నీవు అతణ్ణి ఎందుకు పంపివేశావు? అతడు వెళ్ళిపోయాడు!

[25] నేర్ కొడుకు అబ్నేర్ నీకు తెలుసు. అతడు వచ్చినది నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలను కనిపెట్టి నీవు చేసేదంతా తెలుసుకోవడానికే గదా” అని చెప్పాడు.

[26] దావీదు దగ్గరనుంచి వెళ్ళి యోవాబు అబ్నేర్‌ను తీసుకురావడానికి మనుషులను పంపాడు. వాళ్ళు వెళ్ళి సిర్రా అనే బావి దగ్గరనుంచి అతణ్ణి తీసుకువచ్చారు. ఈ సంగతి దావీదుకు ఏమీ తెలియదు.

[27] అబ్నేర్ తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు, యోవాబు అతనితో రహస్యంగా మాట్లాడవలసి ఉన్నట్టు అతణ్ణి ద్వారం మధ్యకు తీసుకుపోయాడు, తన తోబుట్టువు అశాహేల్ విషయం పగతీర్చుకోవడానికి అతడు అబ్నేర్‌ను కత్తితో కడుపులో పొడిచి చంపాడు.

[28] తరువాత ఈ విషయం విన్నప్పుడు దావీదు ఇలా చెప్పాడు: “నేర్ కొడుకు అబ్నేర్ హత్య విషయంలో యెహోవా ఎదుట నామీద గానీ నా రాజ్యంమీద గానీ నేరం ఎన్నడూ ఉండదు.

[29] ఈ దోష శిక్ష యోవాబు నెత్తిమీద, అతడి తండ్రి కుటుంబం వాళ్ళందరిమీదా పడుతుంది గాక! యోవాబు వంశంలో స్రావం గల వ్యక్తి గానీ చర్మవ్యాధి గలవాడు గానీ కర్ర పట్టుకొని నడిచేవాడు గానీ కత్తిపాలయ్యేవాడు గానీ ఆహారం లేనివ్యక్తి గానీ ఎప్పటికీ ఉండాలి.”

[30] గిబియోను యుద్ధంలో అబ్నేర్ తమ తోబుట్టువు అశాహేల్‌ను చంపినందుచేత యోవాబు, అతడి తోబుట్టువు అబీషై అతణ్ణి చంపారు.

[31] దావీదు యోవాబుకూ అతడితో ఉన్న వారందరికీ “మీరు వేసుకొన్న బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేర్ మృతదేహం ముందు నడుస్తూ రోదనం చేయండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. రాజు తానే పాడె వెంట నడిచాడు.

[32] వారు అబ్నేర్‌ను హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు. ప్రజలంతా కూడా ఏడ్చారు.

[33] రాజు అబ్నేర్‌కోసం ఇలా విలాపం చేశాడు: “అబ్నేర్ వట్టి మూర్ఖుడిలాగా చనిపోవడం యుక్తమా?

[34] నీ చేతులకు కట్లు లేవు. నీ కాళ్ళకు సంకెళ్ళు లేవు. అక్రమకారుల ముందు ఒకవ్యక్తి పడిన విధంగా నీవు పడ్డావు.” ప్రజలంతా అబ్నేర్‌ను గురించి మళ్ళీ ఏడ్చారు.

[35] అప్పుడు వారు దావీదు దగ్గరికి వచ్చి ఇంకా పగలు ఉండగా భోజనం చేయాలని అతణ్ణి వేడుకొన్నారు. అయితే దావీదు “ప్రొద్దు క్రుంకే ముందు నేను ఏమైనా తింటే దేవుడు నాకు పెద్ద ఆపద కలిగిస్తాడు గాక!” అని శపథం చేశాడు.

[36] ప్రజలంతా ఆ సంగతి ఆలోచనలోకి తెచ్చుకొన్నారు. అది వారిదృష్టిలో సరిగానే ఉంది. అసలు రాజు ప్రవర్తన అంతా ప్రజలందరికీ నచ్చింది.

[37] నేర్ కొడుకు అబ్నేర్ హత్యలో రాజు పాల్గొనలేదని ఆ రోజు ప్రజలందరికీ ఇస్రాయేల్ వారందరికీ తెలిసింది.

[38] దావీదు తన మనుషులతో ఇలా అన్నాడు: “ఈ రోజు ఇస్రాయేల్‌దేశంలో పడిపోయినది నాయకుడూ, మహనీయుడని మీకు తెలియదా?

[39] నేను అభిషేకం పొందిన రాజును అయినా ఈ రోజు బలహీనుడనైపోయాను. ఈ సెరూయా కొడుకులు నాకంటే బలవంతులు. వారు కఠినులు. అక్రమకారుడు చేసిన చెడుగు ప్రకారం అతడికి యెహోవా ప్రతీకారం చేస్తాడు గాక!”

2 సమూయేలు — Chapters