Skip to content
Opens in a new window

[1] నలుదిక్కుల ఉన్న శత్రువుల మీద యెహోవా విజయం ఇచ్చి రాజుకు నెమ్మది కలిగించాడు. రాజు తన భవనంలో కాపురం చేశాడు.

[2] తరువాత రాజు నాతాను ప్రవక్తతో “ఇదిగో, నేను దేవదారు మ్రానుతో కట్టిన భవనంలో కాపురముంటున్నాను. గానీ దేవుని మందసం డేరాలో ఉంది” అన్నాడు.

[3] అందుకు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, గనుక నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు” అని రాజుతో చెప్పాడు.

[4] అయితే ఆ రాత్రి యెహోవానుంచి నాతానుకు ఈ వాక్కు వచ్చింది:

[5] “నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నాకు నివాసంగా ఒక మందిరాన్ని కట్టిస్తావా?

[6] ఈజిప్ట్‌నుంచి నేను ఇస్రాయేల్‌ప్రజలను తీసుకువచ్చిన రోజునుంచి ఈ రోజువరకు మందిరంలో నివసించలేదు. గుడారాన్ని నా నివాసంగా చేసి ప్రయాణాలు చేశాను.

[7] ఇస్రాయేల్ ప్రజలందరితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్న తావులలో, నా ప్రజకు కాపరులుగా ఉండమని నేను ఆజ్ఞాపించిన నాయకులలో ఎవరినైనా చూచి ‘నా కోసం దేవదారు మ్రానులతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు?’ అని అడిగానా?

[8] “ఇప్పుడు నీవు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పాలి: సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా ప్రజ ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉండాలని గొర్రెలను మేపే నిన్ను పచ్చిక మైదానాలనుంచి రప్పించాను.

[9] నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట లేకుండా నాశనం చేశాను. ఇప్పుడు నీ పేరును లోకంలో ఉన్న మహా ఘనుల పేర్లలాగా చేస్తాను.

[10] నా ఇస్రాయేల్‌ప్రజలకోసం ఒక స్థలం ఏర్పరచి అందులో వారిని నాటుతాను. వారు ఇంకా కదలకుండా తమ స్వస్థలంలోనే ఉంటారు.

[11] మునుపు జరిగినట్టు – నా ఇస్రాయేల్‌ప్రజల మీద నేను నాయకులను నియమించిన కాలంనుంచి జరిగినట్టు – ఇకమీదట దుర్మార్గులు బాధించరు. నీ శత్రువులందరిమీదా నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలిగిస్తాను. అంతేకాక, యెహోవా నీకు రాజవంశాన్ని స్థాపిస్తాడని యెహోవా తానే నీతో చెపుతున్నాడు.

[12] నీ కాలమైపోయి నీవు నీ పూర్వీకులదగ్గర విశ్రమించేటప్పుడు నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని సుస్థిరం చేస్తాను.

[13] అతడే నా పేరుకు మందిరం కట్టిస్తాడు. నేను అతడి రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను.

[14] నేను అతడికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను మనుషుల దండంతో, మనుషుల దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.

[15] నీ ముందు నేను తొలగించిన సౌలుకు నా అనుగ్రహం నేను దూరం చేసినట్టు అతనికి దూరం చేయను.

[16] నా ఎదుట నీ రాజవంశం, నీ రాజ్యం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”

[17] దైవ దర్శనంలో వచ్చిన ఈ మాటలన్నీ నాతాను దావీదుకు తెలియజేశాడు.

[18] అప్పుడు దావీదురాజు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధానంలో కూర్చుని ఇలా ప్రార్థన చేశాడు: ప్రభువైన దేవా! ఇంతటి పైస్థితికి నీవు నన్ను తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది?

[19] ప్రభువైన దేవా! ఇది నీ దృష్టిలో స్వల్ప విషయం. నీవు నీ సేవకుడైన నా వంశం భవిష్యత్తును గురించి తెలియజేశావు. ప్రభువైన దేవా! నీవు మనిషిపట్ల ఇలా వ్యవహరించడం మామూలు విషయమా?

[20] దావీదు నీతో ఇంకేం చెప్పగలడు? నీ దాసుడైన నేను నీకు తెలుసు కదా.

[21] ప్రభువైన దేవా! నీ వాక్కుకోసం నీ చిత్తానుసారంగా ఈ గొప్ప క్రియ చేశావు, నీ దాసుడైన నాకు దానిని తెలియజేశావు.

[22] యెహోవాదేవా! నీవు అత్యంత మహత్తుగలవాడివి! మా చెవులు విన్నదంతా నిజం. నీవంటివాడెవ్వడూ లేడు. నీవు తప్ప మరే దేవుడూ లేడు.

[23] లోకం అంతట్లో నీ ఇస్రాయేల్‌ప్రజలాంటి జనం ఏదీ లేదు గదా. నీవు నీ ప్రజను ఈజిప్ట్‌దేశంనుంచీ ఇతర జనాల వశంనుంచీ దేవుళ్ళ దగ్గరనుంచీ విడిపించావు. నీ కోసం ఈ ప్రజను విమోచించడానికీ పేరు ప్రతిష్ఠలు సంపాదించు కోవడానికీ నీ దేశంకోసం నీ ప్రజల ఎదుట మహా భయంకర క్రియలు చేయడానికీ నీవు బయలుదేరావు.

[24] నీ ఇస్రాయేల్ ప్రజను ఎల్లకాలం నీ సొంత ప్రజగా ఉండేలా చేశావు. యెహోవా, నీవే వారికి దేవుడివయ్యావు.

[25] “యెహోవాదేవా! నీ దాసుడైన నా విషయం, నా వంశం విషయం నీవు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరమయ్యేలా చెయ్యి.

[26] నీ పేరుకు శాశ్వతంగా ఘనత చేకూరేలా నీవు చెప్పినట్టు చెయ్యి. అప్పుడు మనుషులు ‘సేనలప్రభువు యెహోవా ఇస్రాయేల్‌ప్రజల దేవుడు’ అంటారు. నీ దాసుడైన దావీదు వంశం నీ ఎదుట సుస్థిరమవుతుంది.

[27] ఇస్రాయేల్ ప్రజల దేవా! సేనలప్రభువు యెహోవా! నా కోసం రాజవంశాన్ని స్థాపిస్తావని నీవు నీ దాసుడైన నాకు తెలియజేశావు. కనుక నీ సన్నిధానంలో ఇలా ప్రార్థన చేయడానికి నీ దాసుడైన నాకు ధైర్యం కలిగింది.

[28] ప్రభువైన దేవా! నీవే దేవుడివి. నీ దాసుడైన నాకు ఈ మంచి వాగ్దానం చేశావు. నీ మాటలు నమ్మకమైనవి.

[29] దయచేసి నీ దాసుడైన నా వంశం ఎల్లకాలం నీ సన్నిధానంలో నిలిచి ఉండేలా దానిని దీవించు. ప్రభువైన దేవా! నీవు మాట ఇచ్చావు. నీ దీవెనతో నా వంశం ఎల్లకాలం ధన్యం అవుతుంది.”

2 సమూయేలు — Chapters