[1] ఇవి దావీదు రచించిన చివరి మాటలు. ఇది యెష్షయి కొడుకైన దావీదు పలికిన దేవోక్తి. యాకోబుయొక్క దేవుడు అభిషేకించి హెచ్చించినవాడూ ఇస్రాయేల్ ప్రజల ప్రియ గాయకుడూ ఇలా పలికాడు:
[2] “యెహోవా ఆత్మ నా ద్వారా పలికాడు. ఆయన వాక్కు నా నోట ఉంది.
[3] ఇస్రాయేల్ ప్రజల దేవుడు మాట్లాడాడు. ఇస్రాయేల్‌కు ఉన్న ఆధారశిల నాతో ఇలా అన్నాడు: ‘దేవుడంటే భయభక్తులు కలిగి మనుషులను న్యాయంతో పరిపాలించేవాడు
[4] ప్రొద్దు పొడిచేటప్పుడు కనిపించే ఉదయ కాంతిలాగా ఉంటాడు. వాన పడి మబ్బులు పోయిన తరువాత, భూమిలోనుంచి అంకురించిన లేతగడ్డిని తళుకుమనేలా చేసే ఉదయ ప్రకాశంలాగా ఉంటాడు.’
[5] దేవుని దృష్టిలో నా రాజవంశం అలాగే ఉంది గదా. ఆయన నాతో శాశ్వతమైన ఒడంబడిక చేశాడు. ఆ ఒడంబడిక సర్వ సమగ్రమైనది, సుస్థిరమైనది. ఆయన మూలంగానే నాకు రక్షణ చేకూరుతుంది. ఆయన నా విషయమంతా సఫలమయ్యేలా చేస్తాడు.
[6] అయితే దుర్మార్గులు పారవేయబడ్డ ముండ్లలాగా ఉన్నారు. ఎవరూ చేతపట్టుకోలేని ముండ్లలాగా ఉన్నారు.
[7] ఇనుప పనిముట్టు, ఈటెకోలతో గాని లేకుండా ఎవరూ ముండ్లను ముట్టరు. వాటన్నిటినీ ఉన్నచోటనే పూర్తిగా కాల్చడం జరుగుతుంది.”
[8] దావీదు వీరుల పేర్లు ఇవి: తక్‌మోని వంశంవాడైన యోషేబ్‌బెషెతు ముగ్గురు ముఖ్య వీరులలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో ఎనిమిది వందలమందిని తన ఈటెతో చంపాడు.
[9] అతడి తరువాత అహోవ వంశంవాడైన దోదో కొడుకు ఎలియాజరు. అతడు ముగ్గురు ముఖ్య వీరులలో ఒకడుగా ఉండి, ఒకప్పుడు ఫిలిష్తీయవాళ్ళు యుద్ధానికి సమకూడి వస్తే అతడు దావీదుతో ఉన్నాడు. వాళ్ళను ధిక్కరించిన తరువాత ఇస్రాయేల్‌వారు వెనక్కు తీశారు.
[10] కానీ ఎలియాజరు నిలబడి చెయ్యి తిమ్మిరెక్కి కత్తికి అంటుకొనిపోయేదాకా ఫిలిష్తీయవాళ్ళను హతం చేస్తూ వచ్చాడు. ఆ రోజు యెహోవా ఇస్రాయేల్‌కు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దోపిడీసొమ్ము పట్టుకోవడానికి మాత్రం వారు ఎలియాజరు వెనుక వచ్చారు.
[11] ఎలియాజరు తరువాత హరారు గ్రామంవాడైన ఆగే కొడుకు షమ్మా ఉన్నాడు. ఒకసారి ఫిలిష్తీయవాళ్ళు అలచందల పొలంలో సైనికులు గుంపుగా సమకూడినప్పుడు ఇస్రాయేల్‌వారు వాళ్ళ ఎదుట నిలబడలేక పారిపోయారు.
[12] అయితే షమ్మా పొలం మధ్యలో నిలుచుండి ఫిలిష్తీయవాళ్ళను దానిలో లేకుండా వెళ్ళగొట్టి హతం చేశాడు. యెహోవా ఇస్రాయేల్‌కు గొప్ప విజయాన్ని సాధించాడు.
[13] ఒకసారి కోతకాలంలో ఫిలిష్తీయవాళ్ళ సైనికుల గుంపు రెఫాయిం లోయలో దిగారు. దావీదు అదుల్లాం గుహలో ఉన్నాడు. ముప్ఫయిమంది ముఖ్య వీరులలో ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చారు.
[14] తన భద్రమైన స్థలంలో దావీదు ఉన్నప్పుడు ఫిలిష్తీయవాళ్ళ సైనికుల శిబిరం బేత్‌లెహేంలో ఉంది.
[15] దావీదు నీళ్ళకోసం తహతహలాడుతూ, “బేత్‌లెహేం ద్వారందగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుంటుంది!” అన్నాడు.
[16] అప్పుడు ఆ ముగ్గురు వీరులు ఫిలిష్తీయవాళ్ళ బారులగుండా చొరబడి బేత్‌లెహేం ద్వారం దగ్గర ఉన్న బావినీళ్ళు చేది దావీదుదగ్గరికి తీసుకువచ్చారు. అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి యెహోవా సన్నిధానంలో పారబోశాడు.
[17] “యెహోవా! ఈ నీళ్ళు త్రాగడం నాకు దూరమవుతుంది గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఈ నీళ్ళు వారి రక్తంతో సమానం” అని ప్రార్థన చేశాడు. ఆ ముగ్గురు వీరులు చేసిన క్రియలు ఇలాంటివే.
[18] సెరూయా కొడుకూ యోవాబు తమ్ముడూ అయిన అబీషై ముప్ఫయిమంది వీరులలో ముఖ్యుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడు వందలమందిని హతమార్చాడు. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు.
[19] అతడు ఆ ముప్ఫయిమందిలో ఘనత కెక్కినవాడు. అతడు వారికి అధిపతి అయ్యాడు గాని ఆ మొదటి ముగ్గురికి సాటి కాలేదు.
[20] కబ్సేల్ ఊరివాడూ యెహోయాదా కొడుకూ అయిన బెనాయా కూడా పరాక్రమశాలి. అతడు సాహసక్రియలు చేసేవాడు. అతడు మోయాబువాళ్ళలో ఇద్దరు మహా శూరులను హతమార్చాడు. మరో సారి చలిమంచు కురుస్తూ ఉన్న రోజున ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.
[21] మరొకప్పుడు అతడు బ్రహ్మాండమైన ఈజిప్ట్‌వాణ్ణి చంపాడు. ఆ ఈజిప్ట్‌వాడి చేతిలో ఈటె ఉన్నా, బెనాయా దుడ్డుకర్ర చేతపట్టుకొని వాడిమీదకి పోయాడు. ఈజిప్ట్‌వాడి చేతిలో ఉన్న ఈటెను ఊడలాగి దానితోనే వాణ్ణి చంపాడు.
[22] యెహోయాదా కొడుకు బెనాయా చేసిన క్రియలు అలాంటివే. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు.
[23] ఆ ముప్ఫయిమందిలో ఘనతకెక్కాడు. కానీ మొదటి ముగ్గురికి సాటి కాలేదు. దావీదు అతణ్ణి తన దేహ రక్షక భటుల మీద అధిపతిగా నియమించాడు.
[24] ఆ ముప్ఫయిమందిలో వీరు ఉన్నారు: యోవాబు తోబుట్టువు అశాహేల్; బేత్‌లెహేం పురవాసి దోదో కొడుకు ఎల్‌హానాను;
[25] హరోదువాడు షమ్మా; హరోదువాడు ఎలీకా;
[26] పత్తీవాడు హేలెసు; తెకోవగ్రామంవాడైన ఇక్కేష్ కొడుకు ఈరా;
[27] అనాతోతు పురవాసి అబీయెజెరు; హుషా గ్రామంవాడు మోబున్నయి;
[28] అహోవ వంశంవాడు సల్మోను;
[29] నెటోపాతు గ్రామంవాడైన బయానా కొడుకు హేలెబు; బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియా ఊరివాడైన రీబై కొడుకు ఇత్తయి;
[30] పిరాతోను గ్రామంవాడు బెనాయా; గాయుషు వాగుల ప్రదేశంవాడు హిద్దయి;
[31] అర్బా ఊరివాడు అబీయల్బోను; బర్‌హుం గ్రామంవాడు అజ్‌మావెతు;
[32] షాల్బోను గ్రామంవాడు ఎల్యాబా; యాషేను కొడుకులలో యోనాతాను;
[33] హరారు గ్రామంవాడు షమ్మా; హరారు గ్రామంవాడైన షారారు కొడుకు అహీయాం;
[34] మాయకా వాడైన అహసబయి కొడుకు ఎలీపేలెట్; గిలో గ్రామంవాడైన అహీతోపెల్ కొడుకు ఏలీయాం:
[35] కర్మెల్ ఊరివాడు హెస్త్రె; అర్బీ గ్రామంవాడు పారై;
[36] సోబా గ్రామంవాడైన నాతాను కొడుకు ఇగాల్; గాదు వంశంవాడు బానీ;
[37] అమ్మోను జాతివాడు జెలెకు; బేరోతు ఊరివాడు నహురయి (అతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలను మోసేవాడు);
[38] ఇత్రీ వంశంవాడు ఈరా; ఇత్రీ వంశంవాడు గారేబ్;
[39] హిత్తి జాతివాడు ఊరియా. ఆ వీరుల సంఖ్య మొత్తం ముప్ఫయి ఏడుమంది.