[1] తరువాత దావీదు ఇస్రాయేల్‌వారిలో ముప్ఫయి వేలమంది శూరులను సమకూర్చాడు, యూదాప్రదేశంలో ఉన్న బయలాకు బయలుదేరాడు.
[2] అక్కడ దేవుని ఒడంబడికపెట్టె ఉంది. కెరూబుల మధ్య ఆసీనుడుగా ఉన్న సేనలప్రభువు యెహోవా అనే పేరు పెట్టబడ్డ ఆ మందసాన్ని అక్కడనుంచి తీసుకురావాలని దావీదు, అతని మనుషులందరూ వెళ్ళారు.
[3] వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుంచి బయలుదేరారు. దేవుని మందసం ఉన్న ఆ క్రొత్త బండిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుంచి తీసుకువస్తూ ఉన్నప్పుడు
[4] అబీనాదాబు కొడుకులు ఉజ్జా, అహియో దానిని తోలుతూ ఉన్నారు. అహియో దాని ముందర నడుస్తున్నాడు.
[5] దావీదు, ఇస్రాయేల్‌వారంతా దేవదారు మ్రానుతో తయారైన వేరువేరు తంతి వాద్యాలను, కంజరీలను, మృదంగాలను తాళాలను వాయిస్తూ యెహోవా సన్నిధానంలో సంబరపడుతూ ఉన్నారు.
[6] నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎద్దులకు కాలు జారింది. వెంటనే ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకొన్నాడు.
[7] ఆ అక్రమ కార్యానికి యెహోవా ఉజ్జామీద తీవ్రంగా కోపగించుకొన్నాడు. అక్కడే దేవుడు అతణ్ణి మొత్తాడు. అతడు దేవుని మందసందగ్గర పడి చనిపోయాడు.
[8] యెహోవా ఉజ్జాను నాశనం చేసినందుకు దావీదు పరితపించి ఆ స్థలానికి “పెరెజ్ ఉజ్జా” అని పేరు పెట్టాడు. ఈ రోజువరకు దానికి అదే పేరు.
[9] ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి “యెహోవా పెట్టె నా దగ్గరికి ఏ విధంగా వస్తుంది?” అనుకొన్నాడు.
[10] అప్పుడు యెహోవా పెట్టెను దావీదు నగరానికి తనతో కూడా తీసుకువెళ్ళ కూడదని నిశ్చయించుకొన్నాడు. దానికి బదులుగా అతడు దారిప్రక్కన గాత్‌వాడైన ఓబేద్‌ఎదోం ఇంటికి దానిని తీసుకుపోయాడు.
[11] యెహోవా పెట్టె మూడు నెలలు గాత్‌వాడు ఓబేద్‌ఎదోం ఇంటిలో ఉండిపోయింది. యెహోవా ఆశీస్సులు అతడిమీదకీ, అతడి ఇంటివారందరి మీదకీ వచ్చాయి.
[12] “దేవుని మందసం ఉండడంవల్ల యెహోవా ఆశీస్సులు ఓబేద్‌ఎదోం ఇంటివాళ్ళమీద, అతడికి చెందిన దానినంతటి మీద వచ్చాయి” అని ఎవరో దావీదుకు తెలియజేశారు. అందుచేత దావీదు వెళ్ళి దేవుని మందసాన్ని ఓబేద్‌ఎదోం ఇంటిలో నుంచి దావీదు నగరానికి సంతోషంతో తీసుకు వచ్చాడు.
[13] యెహోవా పెట్టెను మోస్తూఉండేవారు ఆరేసి అడుగులు వేసిన తరువాత దావీదు ఒక ఎద్దునూ ఒక క్రొవ్విన దూడనూ బలిగా అర్పించాడు.
[14] నారతో నేసిన ఏఫోదును తొడుగుకొని బలంకొద్ది యెహోవా సన్నిధానంలో నాట్యం చేస్తూ ఉన్నాడు.
[15] ఈ విధంగా దావీదు, ఇస్రాయేల్‌వారంతా ఆనంద ధ్వనులతో, బాకానాదాలతో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
[16] యెహోవా మందసం దావీదు నగరంలోకి వస్తూ ఉంటే సౌలు కూతురు మీకాల్ కిటికీలోనుంచి చూస్తూ ఉంది. యెహోవా సన్నిధానంలో దావీదు గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఉండడం ఆమె చూచి అతణ్ణి ఏవగించుకొంది.
[17] వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దానికోసం దావీదు వేసిన గుడారంలో దాని స్థలంలో ఉంచారు. అప్పుడు దావీదు హోమ బలులు శాంతిబలులు యెహోవా సన్నిధానంలో అర్పించాడు.
[18] హోమబలులు శాంతిబలులు అర్పించిన తరువాత సేనలప్రభువు యెహోవా పేర దావీదు ప్రజలను దీవించాడు.
[19] అప్పుడతడు ఇస్రాయేల్‌ప్రజల సమూహంలో ప్రతి పురుషుడికీ ప్రతి స్త్రీకీ ఒక రొట్టెనూ అంజూరుపండ్ల అడ ఒకదానినీ ఎండిన ద్రాక్షపండ్ల అడ ఒకదానినీ ఇచ్చాడు. ప్రజలంతా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు.
[20] తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి చేరుకొన్నప్పుడు సౌలు కూతురు మీకాల్ అతణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరి వచ్చి ఇలా అంది: “ఇస్రాయేల్ ప్రజల రాజు ఇవ్వేళ ఎంత ఘనంగా ప్రవర్తించాడు! మీ సేవకులు పనికత్తెలు చూస్తూ ఉంటే నీచుడిలాగా మీ బట్టలు విప్పివేశారు!”
[21] దావీదు మీకాల్‌తో అన్నాడు “నేను యెహోవా సన్నిధానంలో నాట్యం చేశాను. ఆయన నీ తండ్రినీ అతడి సంతానాన్నీ విసర్జించి తన ఇస్రాయేల్‌ప్రజలమీద పరిపాలకుడుగా నన్ను ఎన్నుకొని నియమించాడు. నేను యెహోవా సమక్షంలో సంబరపడతాను.
[22] అంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకారానికి గురి అయి నా దృష్టికి నేను అల్పుడినవుతాను. అయితే నీవు చెప్పిన పనికత్తెలు నన్ను గౌరవిస్తారు.”
[23] చనిపోయేంతవరకు సౌలు కూతురు మీకాల్‌కు పిల్లలు పుట్టలేదు.