Skip to content
Opens in a new window

[1] యెహోవా దావీదును సౌలు చేతిలోనుంచీ శత్రువులందరి చేతిలోనుంచీ విడిపించినప్పుడు దావీదు ఈ కీర్తన వాక్కులు యెహోవాకు పాడాడు:

[2] “యెహోవా నాకు ఆధారశిల, నా కోట, నా రక్షకుడు,

[3] నేను ఆశ్రయించిన నా ఆధారశిల, నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తయిన స్థలం, నా శరణం, నా విముక్తిదాత, నా దేవుడు. దౌర్జన్యపరుల బారినుండి నన్ను రక్షిస్తాడు.

[4] యెహోవా స్తుతికి యోగ్యుడు. ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. నా శత్రువుల బారినుంచి ఆయన నన్ను తప్పిస్తాడు.

[5] మరణం అలలు నన్ను చుట్టుకొన్నాయి. నాశన ప్రవాహాలు నాపైకి ముంచుకువచ్చాయి.

[6] మృత్యులోక పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. మరణం ఉరిలాగా నాకెదురైంది.

[7] నా కష్టాలలో యెహోవాకు ప్రార్థన చేశాను. సహాయంకోసం నా దేవునికి మొరపెట్టాను. నా కంఠధ్వని ఆయన తన ఆలయంలో విన్నాడు. నా ఆక్రందన ఆయన సన్నిధానంలోకి చేరింది, ఆయన చెవులకు వినబడింది.

[8] అప్పుడు భూకంపం వచ్చింది. భూమి అదిరింది. ఆకాశాల పునాదులు కదిలాయి. ఆయనకు కోపం రగులుకొంది, గనుకనే అవి వణికాయి.

[9] ఆయన ముక్కుపుటాలలో నుంచి పొగ లేచింది. ఆయన నోటనుంచి దహించే మంట వచ్చింది. దానివల్ల నిప్పుకణికెలు రగులుకొన్నాయి.

[10] ఆకాశాలు చీల్చి ఆయన దిగివచ్చాడు. కటిక చీకటి ఆయన పాదాల క్రింద ఉంది.

[11] కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు. గాలిరెక్కల మీద వేగంగా వచ్చాడు.

[12] ఆయన చీకటిని కప్పుకొన్నాడు. నీళ్ళున్న నల్లటి మేఘాలు గుడారంలాగా ఆయనను చుట్టుకొనేలా చేశాడు.

[13] ఆయన ప్రకాశమైన సన్నిధిలోనుంచి మెరుపులు మెరిశాయి.

[14] యెహోవా ఆకాశంలో గర్జించాడు. సర్వాతీతుడు తన స్వరం వినబడేలా చేశాడు.

[15] ఆయన తన బాణాలు విసిరాడు, శత్రువులను చెదరగొట్టాడు. మెరుపులు ప్రయోగించి వాళ్ళను ఓడించాడు.

[16] యెహోవా గద్దింపుకు, ఆయన ముక్కుపుటాలలోనుంచి వెలువడ్డ తీవ్రమైన గాలికి సముద్రాల అడుగులు కనబడ్డాయి, భూగోళం పునాదులు కనిపించాయి.

[17] పై నుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొన్నాడు. నన్ను లోతైన నీళ్ళలో నుంచి పైకి తీశాడు.

[18] బలిష్ఠుడైన శత్రువు బారినుంచి ఆయన నన్ను రక్షించాడు. నా శక్తికి మించిన నా పగవాళ్ళ వశం నుంచి నన్ను తప్పించాడు.

[19] విపత్తులో వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు గాని యెహోవా నాకు అండదండగా ఉన్నాడు.

[20] ఆయన నన్ను విశాల స్థలంలోకి చేర్చాడు. నేనంటే ఆయనకెంతో ఇష్టం, గనుక నన్ను విడిపించాడు.

[21] నా న్యాయప్రవర్తన ప్రకారం యెహోవా నాపట్ల వ్యవహరించాడు. నా పవిత్ర క్రియల ప్రకారం నాకు ప్రతిఫలం ప్రసాదించాడు.

[22] యెహోవా విధానాలను నేను అనుసరించాను. నేనేమీ నా దేవుణ్ణి విడిచిన భ్రష్టుణ్ణి కాదు.

[23] ఆయన న్యాయనిర్ణయాలను శిరసావహిస్తున్నాను. ఆయన విధించిన చట్టాలను నేను ఉల్లంఘించడం లేదు.

[24] ఆయనపట్ల నేను నిర్దోషిని. నా చెడుగుకు లొంగకుండా జాగ్రత్త వహించాను.

[25] నా న్యాయప్రవర్తన ప్రకారం, ఆయన దృష్టిలో నా పవిత్ర క్రియల ప్రకారం యెహోవా నన్ను సత్కరించాడు.

[26] దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు. యథార్థంగా ప్రవర్తించేవారికి నీవు యథార్థవంతుడివి.

[27] పవిత్రులకు నిన్ను నీవు పవిత్రుడుగా కనుపరచుకొంటావు. కానీ వక్రబుద్ధులను వక్రమార్గం పట్టిస్తావు.

[28] దీనస్థితిలో ఉన్న నీ భక్తులను రక్షిస్తావు. గర్విష్ఠులను అణగగొట్టడానికి నీవు వాళ్ళను చూస్తూ ఉన్నావు.

[29] యెహోవా! నీవు నాకు దీపంగా ఉన్నావు. యెహోవా నా చీకటిని కాంతిగా మార్చివేస్తాడు.

[30] నీ సహాయంతో నేను సైన్యం పైబడగలను, నా దేవుని తోడ్పాటుతో గోడమీదుగా దూకెయ్యగలను.

[31] దేవుని మార్గం లోపరహితం. యెహోవా వాక్కు పవిత్రమైనది. ఆయనను నమ్మి ఆశ్రయించినవారందరికీ ఆయన డాలులాంటివాడు.

[32] యెహోవా తప్ప దేవుడు మరింకెవరు? మన దేవుడు తప్ప ఆధారశిలలాంటివాడు ఇంకెవరున్నారు?

[33] నాకు బలాన్ని కట్టబెట్టి, నా జీవిత విధానాన్ని ఏ లోపమూ లేకుండా చేసేవాడు ఆయనే.

[34] నా కాళ్ళు జింకలాగా ఉండేలా చేసి, నా ఎత్తయిన స్థలాలమీద నన్ను నిలుపుతున్నాడు.

[35] యుద్ధంకోసం నా చేతులకు మంచి శిక్షణ ఇస్తున్నాడు. నా చేతులతో కంచు విల్లు ఎక్కు పెట్టగలను.

[36] నీ సంరక్షణ అనే డాలు నాకందించావు. నీ విధానం సాధువైనది. అది నన్ను ఉన్నత స్థితికి తెచ్చింది.

[37] నా పాదాలు మోపడానికి విశాల స్థలం ఇచ్చావు. నా కాలు జారలేదు.

[38] నా శత్రువులను వెంటాడి చితగ్గొట్టాను. వాళ్ళను నాశనం చేసేవరకు వెనక్కు తిరగలేదు.

[39] మళ్ళీ లేవకుండా వాళ్ళను పూర్తిగా చితగ్గొట్టివేశాను. వాళ్ళు నా పాదాలక్రింద కూలారు.

[40] యుద్ధంకోసం నీవు నాకు బలాన్ని కట్టబెట్టావు. నన్ను ఎదిరించినవాళ్ళను నాకు లొంగిపోయేలా చేశావు.

[41] నా శత్రువులు వెన్ను చూపి పారిపొయ్యేలా చేశావు.

[42] వాళ్ళు సహాయంకోసం అరిచారు గాని వాళ్ళకు రక్షకుడెవడూ లేడు. యెహోవాకు కూడా మొర్రపెట్టినా ఆయన వినలేదు.

[43] నేను వాళ్ళను నేల ధూళిలాగా నుగ్గునుగ్గు చేసి విడిచాను. వాళ్ళను వీధి కసువులాగా పారపోసి త్రొక్కివేశాను.

[44] ఈ జనం కలహాల్లో పడిపోకుండా నన్ను కాపాడావు. వేరు వేరు ప్రజలకు అధిపతిగా స్థిరపరచావు. ఇంతకుముందు నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.

[45] విదేశీయులు నాకు లొంగినట్టే నటిస్తున్నారు. నన్ను గురించి వినీ వినడంతోనే వాళ్ళు నాకు విధేయులవుతున్నారు.

[46] విదేశీయులకు గుండెలు జారుతాయి. వణకుతూ వాళ్ళ కోటలలోనుంచి బయటికి వస్తారు.

[47] యెహోవా సజీవుడు! నాకు ఆధారశిలగా ఉన్న ఈ దేవునికి స్తుతి! ఆధారశిలగా ఉన్న నా రక్షకుడైన దేవునికి మహిమ!

[48] నా పక్షంగా ఆయనే పగతీర్చేవాడు, ప్రజలను నా వశం చేసేవాడు,

[49] నా శత్రువుల బారినుంచి నన్ను విడిపించేవాడు, నా పైబడ్డవాళ్ళకు పైగా నన్ను ఉంచేవాడు, దౌర్జన్యపరుల చేతులలోనుంచి నన్ను తప్పించేవాడు.

[50] అందుచేత, యెహోవా! ఇతర ప్రజలమధ్య నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను.

[51] ఆయన నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయం చేకూరుస్తున్నాడు. ఆయన అభిషిక్తుడికి – దావీదుకు, అతడి సంతానానికి – శాశ్వతంగా అనుగ్రహం చూపుతాడు.”

2 సమూయేలు — Chapters