Skip to content
Opens in a new window

[1] అహీతోపెల్ అబ్‌షాలోంతో ఇలా అన్నాడు: “మీకు ఇష్టమైతే నేను పన్నెండు వేలమంది సైనికులను ఎన్నుకొని, ఈ రాత్రి దావీదును తరమడానికి బయలు దేరుతాను.

[2] అతడు అలసిపోయి నీరసించిన స్థితిలో ఉన్నప్పుడే అతడి పైబడి అతణ్ణి భయపెడతాను. అప్పుడు అతడితో ఉన్నవాళ్ళంతా పారిపోతారు. నేను రాజును మాత్రమే హతమార్చి,

[3] ప్రజలందరినీ మీ దగ్గరికి తీసుకువస్తాను. మీరు వెదకే మనిషి తప్ప ప్రజలంతా తిరిగి వస్తారు. ప్రజలంతా క్షేమంగా ఉంటారు.”

[4] ఈ మాట అబ్‌షాలోంకు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరికీ నచ్చింది.

[5] అప్పుడు అబ్‌షాలోం “అర్కీవాడు హూషైను పిలువు. అతడు ఏం అంటాడో విందాం” అని చెప్పాడు.

[6] హూషై అబ్‌షాలోం దగ్గరికి వచ్చినప్పుడు, అహీతోపెల్ చెప్పిన సలహా అబ్‌షాలోం అతనికి తెలియజేసి, “అతడు చెప్పినట్టు మనం చేయాలా, వద్దా? నీ సలహా చెప్పు” అన్నాడు.

[7] హూషై అబ్‌షాలోంతో ఇలా అన్నాడు: “ఈ సారి అహీతోపెల్ చెప్పిన సలహా మంచిది కాదు.

[8] మీ తండ్రి అతడి మనుషులు యుద్ధవీరులని మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు అడవిలో పిల్లలు కోల్పోయిన ఎలుగుబంటిలాగా తీవ్రకోపంతో ఉంటారు. అంతేగాక మీ తండ్రి యుద్ధంలో అనుభవశాలి. ప్రజల దగ్గర రాత్రి గడపడు.

[9] ఇప్పుడు కూడా అతడు ఏదైనా గుహలో, లేదా వేరే స్థలంలో దాగి ఉంటాడు. యుద్ధారంభంలో మీ వాళ్ళలో కొంతమంది కూలుతారనుకోండి. దాని గురించి విన్నవాళ్ళు ‘అబ్‌షాలోం అనుచరులు ఓడిపోయారు’ అంటారు.

[10] అలాంటప్పుడు మీ మనుషులందరిలో ధైర్యం గలవాళ్ళు కూడా, సింహాల్లాగా భయంలేని వాళ్ళు కూడా, అధైర్యపడతారు. ఎందుకంటే మీ తండ్రి యుద్ధ వీరుడనీ అతడితో ఉన్నవాళ్ళు ధైర్యశాలురనీ ఇస్రాయేల్ ప్రజలందరికీ తెలుసు.

[11] అందుచేత నా సలహా ఏమిటంటే, మీరు, దాను పట్టణం నుంచి బేర్‌షెబావరకు ఇస్రాయేల్ వాళ్ళందరినీ – లెక్కకు సముద్రం ఇసుక రేణువులంత మందిని సమకూర్చాలి. మీరు స్వయంగా వాళ్ళతో కూడా యుద్ధానికి వెళ్ళాలి.

[12] అప్పుడు అతడు ఎక్కడ ఉన్నా, మనం అక్కడికి వెళ్ళి, నేలమీద మంచు పడేవిధంగా మనం అతడిపై బడతాం. అలా చేస్తే అతడితో ఉన్నవాళ్ళలో ఎవ్వడూ తప్పించుకోలేకపోతాడు.

[13] ఒకవేళ అతడు ఏదైనా పట్టణంలోకి వెనక్కుపోతే ఇస్రాయేల్‌వాళ్ళంతా ఆ పట్టణానికి త్రాళ్ళు తీసుకువచ్చి చిన్నరాయి కూడా అక్కడ కనబడకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు.”

[14] అబ్‌షాలోం, ఇస్రాయేల్‌వారంతా ఈ మాట విని, “అర్కీవాడు హూషై చెప్పిన సలహా అహీతోపెల్ చెప్పిన సలహాకంటే బాగుంది” అని చెప్పారు. ఎందుకంటే యెహోవా అబ్‌షాలోం మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెల్ చెప్పిన తెలివైన ఆలోచనను భంగం చేయడానికి సంకల్పించాడు.

[15] అప్పుడు హుషై వెళ్ళి, అబ్‌షాలోంకూ ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరికీ అహీతోపెల్ చెప్పిన సలహా, తాను చెప్పిన సలహా సాదోకుయాజికీ అబ్యాతారుయాజికీ తెలియజేశాడు.

[16] “వెంటనే మీరు దావీదుకు ఈ కబురు పంపండి – మీరు అరణ్యంలో ఉన్న నది రేవుల దగ్గర ఈ రాత్రి ఉండకూడదు. రాజైన మీరు, మీతో ఉన్నవారంతా నాశనం కాకుండా ఉండేలా నది తప్పనిసరిగా దాటిపోవాలి” అని హూషై చెప్పాడు.

[17] యోనాతాను, అహిమయసు ఏన్‌రోగేల్ దగ్గర ఉన్నారు. ఎవరికీ కనిపించకూడదని వారు నగరంలోకి రాలేకపోయారు, గనుక ఒక పనికత్తె వారిదగ్గరికి వెళ్ళి హూషై చెప్పిన సంగతి వారికి తెలియజేసింది. దావీదురాజు దగ్గరికి వెళ్ళి, ఆ సంగతి చెప్పడానికి వారు బయలుదేరారు.

[18] అయితే ఒక అబ్బాయి వారిని చూచి, అబ్‌షాలోంకు తెలియజేశాడు. కనుక వారిద్దరు త్వరపడి, బహూరీంలో ఒక మనిషి ఇంటికి వెళ్ళారు. ఇంటి ఆవరణంలో బావి ఉంది. వారు దానిలో దిగి దాగుకొన్నారు.

[19] ఆ మనిషి భార్య ముతక గుడ్డ తీసుకువచ్చి బావిపైన పరచి, గుడ్డ మీద గోధుమలు ఉంచింది. వారు దాగుకొన్న సంగతి ఎవరికీ తెలియదు.

[20] తరువాత అబ్‌షాలోం మనుషులు ఆ ఇంటి ఆమె దగ్గరికి వచ్చి “అహిమయసు, యోనాతానులు ఎక్కడున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె “వాళ్ళు ఆ నీటి కాలువ దాటిపోయారు” అని చెప్పింది. వాళ్ళు వెళ్ళి వెదికారు గాని, వారిని కనుక్కోలేక జెరుసలంకు తిరిగి వచ్చారు.

[21] ఆ మనుషులు వెళ్ళిన తరువాత యోనాతాను, అహిమయసు బావిలోనుంచి బయటికి వచ్చి దావీదురాజు దగ్గరికి వెళ్ళారు, అతనికి వ్యతిరేకంగా అహీతోపెల్ చెప్పిన సలహా తెలియజేసి “మీరు వెంటనే నది దాటిపోవాలి” అని అతనితో చెప్పారు.

[22] కనుక దావీదు అతనితో ఉన్నవారందరూ లేచి యొర్దాను దాటారు. ప్రొద్దు పొడిచేటప్పటికి నది దాటని వాడెవ్వడూ మిగలలేదు.

[23] అహీతోపెల్ తాను చెప్పిన సలహా అబ్‌షాలోం పాటించకపోవడం చూచి, గాడిదకు జీను వేసి ఎక్కి, స్వగ్రామంలో తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి విషయాలు చక్కపెట్టినతరువాత అతడు ఉరి పోసుకొని చనిపోయాడు. అతడివాళ్ళు అతడి తండ్రి సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు.

[24] దావీదు మహనయీంకు చేరుకొన్నాడు. అబ్‌షాలోం ఇస్రాయేల్ మనుషులంతా యొర్దాను దాటిపోయారు.

[25] అంతకు ముందు అబ్‌షాలోం యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు (అమాశా తండ్రి ఇస్రాయేల్‌వాడు ఇత్రా. యోవాబుయొక్క తల్లి సెరుయా సోదరి నాహాషు కూతురైన అబీగేల్‌ను ఇత్రా పెళ్ళి చేసుకొన్నాడు).

[26] అబ్‌షాలోం, ఇస్రాయేల్ వారంతా గిలాదు ప్రదేశంలో మకాం చేశారు.

[27] దావీదు మహనయీంకు చేరుకొన్నప్పుడు, అతని దగ్గరికి అమ్మోనువాళ్ళ రబ్బాపట్టణం వాడైన నాహాషు కొడుకు షోబీ, లోదెబార్ ఊరివాడైన అమ్మీయేల్ కొడుకు మాకీరు, రోగెలీం పురవాసీ గిలాదువాడూ అయిన బర్‌జిల్లయి వచ్చారు.

[28] వారు “ఎడారిలో ప్రజలు అలసిపోయి ఆకలి దప్పులతో ఉంటారు” అనుకొని పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేయించిన గింజలు, చిక్కుడు కాయలు, బఠానీ, పేలాలు,

[29] తేనె, పెరుగు, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదుకూ అతనితో ఉన్నవారికీ ఆహారంగా తీసుకువచ్చారు.

2 సమూయేలు — Chapters