Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మేము మీకు సన్నిహిత బంధువులం.

[2] మునుపు సౌలు ఇంకా మమ్మల్ని పరిపాలిస్తున్నప్పుడు దండయాత్రలలో ఇస్రాయేల్ వారిని నడిపించినది మీరే. యెహోవా నా ఇస్రాయేల్ ప్రజలకు నీవు కాపరిగా ఉంటావు, వారి మీద పరిపాలకుడుగా ఉంటావు అని మీతో చెప్పాడు గదా.”

[3] ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరూ హెబ్రోనులో దావీదురాజు దగ్గరకు వచ్చిన తరువాత అక్కడ యెహోవా సన్నిధానంలో రాజు వారితో ఒడంబడిక చేశాడు. అప్పుడు వారు దావీదును ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించారు.

[4] దావీదు రాజైనప్పుడు అతని వయసు ముప్ఫయి సంవత్సరాలు. అతడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు.

[5] హెబ్రోనులో అతడు యూదావారిమీద ఏడు సంవత్సరాలు ఆరు నెలలు పరిపాలించాడు. జెరుసలంలో ఇస్రాయేల్, యూదాల ప్రజలందరిమీదా ముప్ఫయి మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

[6] యోబూసిజాతి వాళ్ళు జెరుసలంలో కాపురం ఉన్నప్పుడు వాళ్ళ పై పడడానికి దావీదు, అతని మనుషులు అక్కడికి వెళ్ళారు. యెబూసివాళ్ళు “దావీదు లోపలికి రాలేడు” అను కొని దావీదుతో “నీవు లోపలికి రాలేవు. ఇక్కడి గుడ్డివాళ్ళూ కుంటివాళ్ళూ కూడా నిన్ను తోలివేయగలరు” అన్నారు.

[7] అయినా దావీదు, కోట ఉన్న సీయోనును స్వాధీనం చేసుకొన్నాడు. అది దావీదు నగరం.

[8] ఆ రోజు దావీదు “దావీదుకు అసహ్యంగా ఉన్న ఆ ‘గుడ్డివాళ్ళ’ పై ‘కుంటివాళ్ళ’ పై పడి యెబూసివాళ్ళను ఎవరైనా ఓడించాలంటే నీటి కాలువగుండా పైకి వెళ్ళాలి” అన్నాడు. అందుచేత ‘గుడ్డివాళ్ళు’, ‘కుంటివాళ్ళు’ భవనంలో అడుగు పెట్టకూడదంటారు.

[9] దావీదు కోట ఉన్న ఆ స్థలంలో కాపురమేర్పరచుకొని దానికి ‘దావీదు నగరం’ అనే పేరు పెట్టాడు. కోటనుంచి లోపలికి, చుట్టూరా ఉన్న స్థలమంతటిలో నగరాన్ని కట్టించాడు.

[10] సేనలప్రభువు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, గనుక దావీదు గొప్ప అభివృద్ధి పొందుతూ వచ్చాడు.

[11] తూరు నగరం రాజైన హీరాం రాయబారులను దావీదు దగ్గరికి పంపాడు. వాళ్ళతోకూడా దేవదారు మ్రానులనూ వడ్రంగులనూ తాపీ పనివాళ్ళనూ పంపాడు. వాళ్ళు దావీదుకోసం భవనాన్ని కట్టారు.

[12] ఇస్రాయేల్ ప్రజలమీద యెహోవా తనను రాజుగా స్థిరపరచాడనీ దావీదు గ్రహించాడు.

[13] దావీదు హెబ్రోనునుంచి వచ్చిన తరువాత జెరుసలంలో ఇంకా కొంతమంది ఉంపుడుకత్తెలనూ భార్యలనూ చేసు కొన్నాడు. అతనికి ఇంకా కొంతమంది కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.

[14] జెరుసలంలో అతనికి జన్మించినవాళ్ళ పేర్లు ఇవి: షమ్మూవ, శోబాబు, నాతాను, సొలొమోను,

[15] ఇభారు, ఎలీషూవ, నెపెగు, యాఫీయ,

[16] ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు.

[17] ప్రజలు ఇస్రాయేల్ మీద దావీదును రాజుగా అభిషేకం చేశారని ఫిలిష్తీయవాళ్ళు విన్నప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి వాళ్ళంతా దండెత్తి వచ్చారు. అది విని దావీదు తన భద్రమైన స్థలానికి వెళ్ళాడు.

[18] ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయిం లోయలో వ్యాపించారు.

[19] దావీదు “నేను వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పై పడాలా? నీవు వాళ్ళను నా వశం చేస్తావా?” అని యెహోవాను ప్రార్థించాడు. అందుకు యెహోవా “వెళ్ళు. నేను వాళ్ళను నీ వశం చేసితీరుతాను” అని జవాబిచ్చాడు.

[20] అందుచేత దావీదు బయల్ పెరాజీంకు వెళ్ళి వాళ్ళను ఓడించాడు. అప్పుడు దావీదు “వరదలు కొట్టుకుపోయే విధంగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నాశనం చేశాడు” అని చెప్పాడు. కనుకనే ఆ స్థలాన్ని ‘బయల్ పెరాజీం’ అంటారు.

[21] అక్కడ ఫిలిష్తీయవాళ్ళు తమ విగ్రహాలను విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని తీసుకువెళ్ళారు.

[22] మరోసారి ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయిం లోయలో వ్యాపించారు.

[23] దావీదు యెహోవాను సంప్రదించినప్పుడు యెహోవా “నీవు తిన్నగా వెళ్ళవద్దు. చుట్టు తిరిగి వాళ్ళ వెనక్కు వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వాళ్ళ పైబడు.

[24] కంబళి చెట్ల కొనలలో అడుగుల చప్పుడు వినగానే త్వరగా ముందుకు సాగు. ఫిలిష్తీయ సైన్యాన్ని హతం చేయడానికి యెహోవా నీ ముందు బయలు దేరుతున్నాడన్నమాట” అని జవాబిచ్చాడు.

[25] యెహోవా ఆజ్ఞాపించినట్టే దావీదు చేసి గెబనుంచి గెజెరు వరకు ఫిలిష్తీయవాళ్ళను తరుముతూ హతం చేశాడు.

2 సమూయేలు — Chapters