Skip to content
Opens in a new window

[1] సొలొమోను కంచు బలిపీఠం చేయించాడు. దాని పొడుగు ఇరవై మూరలు. వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.

[2] అతడు లోహంతో ఒక “సరస్సు”ను పోత పోయించాడు. ఆ అంచు నుంచి ఈ అంచువరకు దాని కొలత పది మూరలు. దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్ఫయి మూరలు.

[3] అంచుల క్రింద చుట్టూరా ఎద్దు ఆకారాలు ఉన్నాయి. అవి ఒక్కో మూరకు పదిచొప్పున ఉన్నాయి. అవి ఆ సరస్సును ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులు రెండు వరుసలుగా ఉన్నాయి. సరస్సుతో కూడా ఒకే పోతగా పోసినవి.

[4] ఆ సరస్సు పన్నెండు పోతపోసిన ఎద్దులమీద కూర్చుని ఉంది. ఎద్దుల వెనుక భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి. వాటి ముఖాలు మూడు ఉత్తరం వైపుకు, మూడు పడమటి వైపుకు, మూడు దక్షిణం వైపుకు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. సరస్సు ఆ ఎద్దులమీద కూర్చుని ఉంది.

[5] సరస్సు బెత్తెడు మందంగలది. దానిపై అంచు పాత్రపై అంచులాగా కలువపువ్వులాగా ఉంది. అది అరవై ఆరు కిలోలీటర్ల నీళ్ళు పట్టేది.

[6] కడగడానికి అతడు పది తొట్లు చేయించాడు. ఆలయం కుడి వైపున అయిదు, ఎడమ వైపున అయిదు ఉంచాడు. అవి హోమబలిగా అర్పించినవాటిని కడగడం కోసం యాజులు కడుగుకోవడానికి ఆ సరస్సు ఉంది.

[7] పది బంగారు సప్తదీపస్తంభాలను వాటిని చేయవలసిన విధానం ప్రకారం చేయించాడు, ఆలయంలో కుడి వైపున అయిదు, ఎడమ వైపున అయిదు ఉంచాడు.

[8] పది బల్లలను చేయించి ఆలయంలో కుడి వైపున అయిదు, ఎడమవైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు.

[9] “యాజుల ఆవరణాన్నీ”, పెద్ద ఆవరణాన్నీ చేయించాడు. ఆవరణ ద్వారాల తలుపులను చేయించి వాటికి కంచు తొడుగు చేయించాడు.

[10] సరస్సును ఆలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా ఉంచాడు.

[11] హూరాం పాత్రలను, పెద్ద పెద్ద గరిటెలను, గిన్నెలను కూడా చేశాడు. యెహోవా ఆలయం కోసం సొలొమోను చేయమన్న వస్తువులన్నీ హూరాం చేసి ఆ పని ముగించాడు.

[12] ఆ వస్తువులు ఇవి: రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి పీటలు, స్తంభాలమీద ఉన్న గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి ఆ రెండు కంచు వలలు,

[13] ఆ రెండు వలలకు నాలుగు వందల దానిమ్మపండ్లు – ఒక్కో వలకు రెండేసి వరుసలు,

[14] ఆ పీఠాలు, వాటిపై ఉన్న తొట్లు,

[15] సరస్సు, దాని క్రింద ఉన్న పన్నెండు ఎద్దులు,

[16] గంగాళాలు, పెద్దపెద్ద గరిటెలు, ముండ్ల కొంకులు, మొదలైన పాత్రలన్నీ. యెహోవా ఆలయానికి సొలొమోనురాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన కంచుతో హూరామబీ చేశాడు.

[17] వీటన్నిటినీ యొర్దాను మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టి నేలలో సొలొమోనురాజు పోత పోయించాడు.

[18] సొలొమోను చేయించిన కంచు వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ కంచు బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.

[19] దేవుని ఆలయానికి తక్కిన వస్తువులను కూడా సొలొమోను చేయించాడు; బంగారు ధూపవేదిక, సన్నిధి రొట్టెలున్న బల్లలు,

[20] యథావిధిగా గర్భగృహానికి ముందు వెలుగుతూ ఉండడానికి మేలిమి బంగారు సప్తదీపస్తంభాలు, వాటి దీపాలు,

[21] వాటి బంగారు పుష్పాలు, దీపాలు, పట్టకార్లు (అవి మేలిమి బంగారంతో చేసినవి),

[22] మేలిమి బంగారు కత్తెరలు, గిన్నెలు, గరిటెలు, ధూపార్తులు, ఆలయం బంగారు తలుపులు, అతి పవిత్ర స్థలానికీ ఆలయం విశాల భాగానికీ ఉన్న బంగారు తలుపులు.

2 దినవృత్తాంతాలు — Chapters