Skip to content
Opens in a new window

[1] రెహబాంను రాజుగా చేయడానికి ఇస్రాయేల్ ప్రజలంతా షెకెంకు వెళ్ళినందుచేత రెహబాం అక్కడికి వెళ్ళాడు.

[2] నెబాతు కొడుకైన యరొబాం సొలొమోను దగ్గర నుంచి ఈజిప్ట్‌కు పారిపోయి, అక్కడ నివసిస్తున్నాడు. రెహబాం రాజయిన సంగతి విన్నప్పుడు అతడు ఈజిప్ట్ నుంచి తిరిగి వచ్చాడు.

[3] ఇస్రాయేల్ వారు అతణ్ణి పిలవనంపించారు. అతడూ ఇస్రాయేల్ వారంతా రెహబాం దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మీ తండ్రి మామీద క్రూరమైన కాడి మోపాడు.

[4] మీ తండ్రి పెట్టిన కఠినమైన సేవను, మామీద ఉంచిన క్రూరమైన కాడిని తేలిక చేయండి. అప్పుడు మేము మీకు సేవ చేస్తాం.”

[5] రెహబాం “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అని వారితో చెప్పాడు. ప్రజలు వెళ్ళిపోయారు.

[6] తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతడి పరివారంలో ఉన్న పెద్దలతో రెహబాంరాజు ఆలోచన చేశాడు. “ఈ ప్రజలకు ఏం జవాబు ఇవ్వాలో మీ సలహా చెప్పండి” అని అడిగాడు.

[7] అందుకు వారు అన్నారు “మీరు ఈ ప్రజలమీద దయ చూపి వారిని సంతోషపరచి వారికి మృదువుగా జవాబు చెప్పితే వారు ఎప్పటికీ మీకు సేవకులుగా ఉంటారు.”

[8] కానీ పెద్దలు చెప్పిన ఆలోచనను రెహబాం పెడచెవిని పెట్టాడు. తనతోపాటు పెరిగి తన పరివారంలో ఉన్న యువకులను పిలిచి సమాలోచన జరిపాడు.

[9] “ఈ ప్రజ వారిమీద నా తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండని నాకు మనవి చేస్తున్నారు. వాళ్ళకు ఏమని జవాబు చెప్పాలి? మీ సలహా ఏమిటో చెప్పండి” అని వారితో చెప్పాడు.

[10] అతడితోపాటు పెరిగిన ఆ యువకులు చెప్పిన సలహా ఇది: “ఈ ప్రజ ‘మీ తండ్రి మామీద క్రూరమైన కాడి ఉంచాడు. మీరు దానిని తేలిక చేయండి’ అన్నారుగా. నీవు వారితో ఇలా చెప్పాలి – నా తండ్రి నడుంకంటే నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉంటుంది.

[11] నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా! నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”

[12] రెహబాంరాజు “మూడో రోజు నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పినట్టు యరొబాం, ప్రజలంతా మూడో రోజున అతడిదగ్గరికి వచ్చారు.

[13] పెద్దలు చెప్పిన మాట పెడచెవిని బెట్టి రాజు వారికి కటువుగా జవాబిచ్చాడు.

[14] ఆ యువకులు చెప్పిన సలహా ప్రకారం ఇలా అన్నాడు: “నా తండ్రి మీమీద క్రూరమైన కాడి ఉంచాడు. సరి గదా! నేను దానిని ఇంకా క్రూరంగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడుగా. నేను మిమ్మల్ని తేళ్ళతో దండిస్తాను.”

[15] రాజు ప్రజల మాట వినిపించుకోలేదు. దేవునిచేత అలా జరిగింది. యెహోవా షిలోహువాడైన అహీయా ద్వారా నెబాతు కొడుకైన యరొబాంతో పలికించిన మాట అలా నెరవేర్చాడు.

[16] తమ విన్నపం రాజు తిరస్కరించడం చూచి ఇస్రాయేల్ వారంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం! యెష్షయి కొడుకుతో ఇంకా భాగస్థులం కాము. ఇస్రాయేల్ ప్రజలారా! మీమీ నివాసాలకు వెళ్ళిపోండి! దావీదు వంశమా, నీ సంగతి నీవే చూచుకో!” అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా వారి వారి నివాసాలకు వెళ్ళారు.

[17] కాని, యూదాలో ఉన్న పట్టణాలలో నివసించే ఇస్రాయేల్‌వారు రెహబాం అధికారం క్రింద ఉండిపోయారు.

[18] తరువాత రెహబాంరాజు వెట్టి పనివాళ్ళమీద అధికారి అయిన అదోరాంను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి పంపాడు. వారు రాళ్ళు రువ్వి అదోరాంను చంపారు. గనుక, రెహబాంరాజు జెరుసలం పారిపోదామని తొందరగా రథమెక్కాడు.

[19] అప్పటినుంచి ఈనాటికీ దావీదు రాజవంశంమీద ఇస్రాయేల్ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు.

2 దినవృత్తాంతాలు — Chapters