[1] అబీయా కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి దావీదునగరంలో సమాధి చేశారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఆసా రోజుల్లో పది సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది.
[2] ఆసా యెహోవా దృష్టిలో సరిగా, న్యాయంగా ప్రవర్తించేవాడు.
[3] అతడు విదేశీయ బలిపీఠాలనూ ఎత్తయిన పూజాస్థలాలనూ తొలగించివేశాడు. విగ్రహాలను పగల గొట్టించాడు, అషేరాదేవి స్తంభాలను పడగొట్టించాడు.
[4] ఆసా వారి పూర్వీకుల దేవుడు యెహోవాను వెదికి అనుసరించాలని యూదాప్రజకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుని ధర్మశాస్త్రం, ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలని ఆదేశించాడు.
[5] యూదాలో ఏ పట్టణాలలో ఎత్తయిన పూజాస్థలాలూ ధూపవేదికలూ ఉన్నాయో ఆ పట్టణాలన్నిటినుంచి వాటిని తీసివేశాడు. అతని పరిపాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.
[6] దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలోకి కోటలూ గోడలూ ఉన్న పట్టణాలను కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ప్రసాదించినందుచేత ఆ సంవత్సరాలలో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.
[7] ఆసా యూదావారితో ఇలా అన్నాడు: “మనం యెహోవాను వెదకి అనుసరించాం, గనుక ఈ దేశం ఇంకా మన స్వాధీనంలో ఉంది. ఆయనను వెదకి అనుసరించాం గనుక ఆయన మనకు అన్ని వైపులా నెమ్మది కలిగించాడు. గనుక, మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టు గోడలను, గోపురాలను, ద్వారం తలుపులను, అడ్డగడియలను అమర్చుదాం.” అలాగే వారు పట్టణాలను కట్టి వర్ధిల్లారు.
[8] ఆసాకు యూదావారిలో మూడు లక్షలమంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్ళూ ఈటెలూ ఉన్నాయి. అతనికి బెన్యామీను వారిలో రెండు లక్షల ఎనభై వేలమంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్ళూ ధనుస్సులూ ఉన్నాయి. వీరంతా యుద్ధ వీరులు.
[9] తరువాత కూషువాడైన జెరహు వేలాది వేల సైన్యంతో, మూడు వందల రథాలతో వారిపై దండెత్తి వచ్చాడు. అతడు మారేషా పట్టణం వరకు చేరాడు.
[10] ఆసా అతడికి ఎదురుగా వెళ్ళాడు. వారు మారేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
[11] అప్పుడు ఆసా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి నీవు తప్ప ఇంకెవరూ లేరు. యెహోవా, మా దేవా, మేము నీమీద నమ్మకం ఉంచుతున్నాం. నీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం. గనుక సహాయం చెయ్యి. యెహోవా, నీవే మా దేవుడివి. మానవమాత్రులను నీపై విజయం సాధించనియ్యకు.”
[12] ఆసా ఎదుటా యూదావారి ఎదుటా యెహోవా కూషువాళ్ళును మొత్తాడు. వాళ్ళు పారిపొయ్యారు.
[13] ఆసా, అతనితో ఉన్నవారు వాళ్ళను గెరారువరకు తరిమారు. కూషువాళ్ళలో చాలా మంది కూలారు, గనుక వాళ్ళు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేకపోయారు. యెహోవా ఎదుటా ఆయన సైన్యం ఎదుటా వాళ్ళు చితికిపొయ్యారు. యూదావారు చాలా కొల్లసొమ్ము పట్టుకుపోయారు.
[14] గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది గనుక యూదావారు వాటన్నిటినీ ఓడగొట్టి దోచుకొని, చాలా కొల్లసొమ్ము తీసుకొన్నారు.
[15] పశువులున్న దొడ్లపై బడి చాలా మందలను, ఒంటెలను వశం చేసుకొన్నారు. అప్పుడు వారు జెరుసలంకు తిరిగి వెళ్ళారు.