Skip to content
Opens in a new window

[1] రెహబాం రాజ్యం సుస్థిరంగా, అతని స్థితి బలంగా అయిన తరువాత అతడూ, ఇస్రాయేల్ ప్రజలంతా యెహోవా ధర్మశాస్త్రం విడిచిపెట్టారు.

[2] వారు యెహోవామీద చేసిన ద్రోహం ఫలితంగా రెహబాంరాజు పరిపాలిస్తున్న అయిదో సంవత్సరంలో ఈజిప్ట్ రాజైన షీషక్ జెరుసలంపైకి వచ్చాడు.

[3] అతనితో కూడా పన్నెండు వందల రథాలూ, అరవై వేలమంది రౌతులూ, లెక్కలేనంతమంది లూబీయా దేశంవాళ్ళూ, సుక్కీవాళ్ళూ, కూషు దేశంవాళ్ళూ ఈజిప్ట్ నుంచి వచ్చారు.

[4] షీషక్ యూదాలో కోటలూ ప్రాకారాలూ ఉన్న పట్టణాలను పట్టుకొని, తరువాత జెరుసలం వరకు వచ్చాడు.

[5] అప్పుడు షీషక్‌కు భయపడి యూదా అధిపతులు రెహబాం జెరుసలంలో సమకూడి ఉంటే వారి దగ్గరికి షెమయా ప్రవక్త వచ్చాడు. అతడు వారితో చెప్పాడు “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. గనుక మిమ్ములను షీషక్ చేతిలో విడిచిపెట్టాను.”

[6] రాజూ ఇస్రాయేల్ అధికారులూ వినయంగా తలవంచుకొని “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకొన్నారు.

[7] వారు అలా తలవంచుకోవడం యెహోవా చూశాడు, గనుక యెహోవా నుంచి ఈ వాక్కు షెమయాకు వచ్చింది: “వారు వినయంగా తలవంచుకొన్నారు గదా. గనుక నేను వారిని నాశనం చేయను. త్వరలో వారిని రక్షిస్తాను. షీషక్ ద్వారా నా కోపాగ్ని జెరుసలంమీద కుమ్మరించను.

[8] కాని, వారు షీషక్‌కు లొంగిపోవలసి వస్తుంది. ఎందుకంటే, నాకు సేవ చేయడంలో, ఇతర దేశాల రాజులకు సేవ చేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి.”

[9] ఈజిప్ట్ రాజైన షీషక్ జెరుసలం పైకి వచ్చినప్పుడు, అతడు యెహోవా ఆలయంలో, రాజభవనంలో ఉన్న విలువైన వస్తువులన్నిటినీ దోచుకొన్నాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్ళను కూడా తీసుకుపోయాడు.

[10] రెహబాంరాజు ఆ డాళ్ళకు బదులు కంచు డాళ్ళు చేయించాడు. వాటిని రాజభవనం ద్వారాన్ని కాపలా కాసే రక్షకభటుల నాయకుడికి అప్పచెప్పాడు.

[11] యెహోవా ఆలయానికి రాజు వచ్చినప్పుడెల్లా అతడి వెంట భటులు ఆ డాళ్ళు మోసుకు పోయేవారు. తరువాత వాటిని తమ గదిలో ఉంచేవారు.

[12] రెహబాం వినయంగా తలవంచుకొన్నందుచేత, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుచేత యెహోవా అతణ్ణి పూర్తిగా నాశనం చేయక, అతడి మీదనుంచి తన కోపం మళ్ళించుకొన్నాడు.

[13] రెహబాంరాజు జెరుసలంలో సుస్థిరంగా ఉండి పరిపాలిస్తూ వచ్చాడు. రెహబాం పరిపాలనకు వచ్చినప్పుడు అతడి వయస్సు నలభై ఒకటి. అతడు జెరుసలంలో పదిహేడేళ్ళు పరిపాలించాడు. ఆ నగరం తన పేరు ఉంచుకోవడానికి ఇస్రాయేల్ గోత్రాల నివాస స్థలాలన్నిటి లోనుంచి యెహోవా ఎన్నుకొన్న నగరం. రెహబాం తల్లి పేరు నయమా. ఆమె అమ్మోను దేశస్థురాలు.

[14] రెహబాం యెహోవాను వెదకడం మీద మనసు నిలుపుకోలేదు, గనుక చెడుగా ప్రవర్తించేవాడు.

[15] రెహబాంను గురించిన విషయాలు మొదటినుంచి చివరి వరకు – షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలోనూ దీర్ఘదర్శి అయిన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలోనూ ఉన్నాయి. రెహబాంకు యరొబాంకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంది.

[16] రెహబాం కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికిచేరాడు. దావీదు నగరంలో అతణ్ణి తన పూర్వీకుల దగ్గర సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు అబీయా రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు — Chapters