Skip to content
Opens in a new window

[1] ఆసా స్థానంలో తన కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు. ఇస్రాయేల్‌వారు తన పైకి రాకుండా తన రాజ్యాన్ని బలంగా చేసుకొన్నాడు.

[2] కోటలూ గోడలూ ఉన్న యూదా పట్టణాలన్నిటిలోనూ అతడు సైనికుల దళాలను ఉంచాడు. యూదాలోనూ, అతని తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిం ప్రాంతం పట్టణాలలోనూ కావలి సైనికులను ఉంచాడు.

[3] మొదటి రోజుల్లో యెహోషాపాతు తన పూర్వీకుడైన దావీదు అనుసరించిన విధానాలను అనుసరించాడు గనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయల్‌దేవుణ్ణి అనుసరించినవాడు కాడు.

[4] అతడు ఇస్రాయేల్‌ప్రజ చేసినట్టు చేయక తన తండ్రియొక్క దేవుణ్ణి వెదికి అనుసరించి ఆయన ఆజ్ఞలు శిరసావహించాడు.

[5] అందుచేత యెహోవా అతని వశంలో రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. యూదాప్రజలంతా అతనికి కప్పం చెల్లిస్తూ ఉండేవారు గనుక అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి.

[6] యెహోవా విధానాలంటే అతనికి హృదయంలో చాలా ఉత్సాహం. అతడు ఎత్తయిన పూజాస్థలాలనూ అషేరాదేవి స్తంభాలనూ యూదా దేశంలో లేకుండా తొలగించాడు.

[7] తాను పరిపాలిస్తున్న మూడో సంవత్సరంలో యూదా పట్టణాలలో ఉపదేశం చేయడానికి అతడు నాయకులను పంపాడు. వారెవరంటే, బెన్‌హయీల్, ఓబద్యా, జెకర్యా, నెతనేల్, మీకా.

[8] వారితోపాటు కొంతమంది లేవీగోత్రికులనూ యాజులనూ పంపాడు. లేవీగోత్రికులెవరంటే, షెమయా, నెతనయా, జెబదయా, ఆశాహేల్, షేమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబ్‌అదోనియా. యాజులెవరంటే, ఎలీషామా, యెహోరాం.

[9] వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకొని యూదాలో అంతటా ఉపదేశం చేశారు. యూదా పట్టణాలన్నిటికీ సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.

[10] యూదా చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది గనుక అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు.

[11] ఫిలిష్తీయవాళ్ళలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవాళ్ళు. అరబీవాళ్ళు అతనికి మందలను తీసుకువచ్చారు. వాళ్ళు తెచ్చినవి ఏడువేల ఏడు వందల పొట్టేళ్ళు, ఏడువేల ఏడు వందల మేకపోతులు.

[12] యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలూ, సరుకులను కూడబెట్టే ఊళ్ళూ కట్టించాడు.

[13] యూదా ఊళ్ళలో అతనికి చాలా సంపద చేకూరింది. జెరుసలంలో అతనికి యుద్ధవీరులున్నారు.

[14] వారి పూర్వీకుల వంశాలప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: యూదా గోత్రంలో వేలమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి. అతడితో మూడు లక్షలమంది యుద్ధవీరులున్నారు.

[15] రెండోవాడు సేనాధిపతి అయిన యోహానాను. అతనితో రెండు లక్షల ఎనభైమంది ఉన్నారు.

[16] మూడోవాడు జిఖ్రీ కొడుకు అమసయా. అతడు యెహోవాకు తనను స్వచ్ఛందంగా సమర్పించుకొన్నాడు. అతనితో రెండు లక్షలమంది యుద్ధవీరులున్నారు.

[17] బెన్యామీను గోత్రంలో ఎలియాదా అనే యుద్ధ వీరుడుండేవాడు. అతనితో ధనుస్సులూ డాళ్ళూ ధరించిన రెండు లక్షలమంది ఉన్నారు.

[18] రెండోవాడు యెహోజాబాద్. అతనితో లక్ష ఎనభై వేలమంది యుద్ధ సన్నద్ధులున్నారు.

[19] వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు గాక, రాజు యూదాలో అంతటా కోటలూ గోడలూ ఉన్న పట్టణాలలో కొంతమందిని ఉంచాడు.

2 దినవృత్తాంతాలు — Chapters