Skip to content
Opens in a new window

[1] యెహోషాపాతు కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. ప్రజలు అతణ్ణి దావీదునగరంలో సమాధి చేశారు. అతని స్థానంలో అతని కొడుకు యెహోరాం రాజయ్యాడు.

[2] వీరు యెహోరాం తోబుట్టువులు, యెహోషాపాతు కొడుకులు: అజరయా, యెహీయేల్, జెకర్యా, అజరయాహు, మికాయేల్, షెపటయా. వీరంతా ఇస్రాయేల్ రాజైన యెహోషాపాతు కొడుకులు.

[3] వారి తండ్రి వారికి అనేక బహుమతులు– వెండి, బంగారం, విలువైన వస్తువులు – ఇచ్చాడు. యూదాలో కోటలూ గోడలూ ఉన్న పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే తనకు మొదట పుట్టినవాడు యెహోరాం, గనుక అతడికి రాజ్యం ఇచ్చాడు.

[4] యెహోరాం తన తండ్రి రాజ్యంమీద తన పరిపాలనను సుస్థిరం చేసుకొన్నాక అతడు తన సోదరులందరినీ, ఇస్రాయేల్ అధికారులలో కొందరినీ కత్తిపాలు చేశాడు.

[5] యెహోరాం రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఎనిమిది ఏళ్ళు పరిపాలించాడు.

[6] అతడు అహాబు కూతురును పెండ్లి చేసుకొన్నాడు, గనుక అహాబు రాజవంశంవాళ్ళలాగే ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలను అనుసరించి నడిచాడు. అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

[7] అయినా యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా దావీదు వంశాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. అంతేగాక, అతనికోసం, అతని సంతానంకోసం వెలుగు ఎప్పుడూ ఉండేలా చేస్తానని యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు.

[8] యెహోరాం కాలంలో ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకించారు. వారు స్వయంగా రాజును తమమీద నియమించుకొన్నారు.

[9] అప్పుడు యెహోరాం తన రథాలన్నీ తీసుకొని తన అధిపతులతో కూడా అక్కడికి వెళ్ళాడు. రాత్రిలో లేచి, తననూ తన రథాధిపతులనూ చుట్టుముట్టిన ఎదోంవాళ్ళను హతం చేశాడు.

[10] అయినా ఈనాటికీ ఎదోంవాళ్ళు యూదా పరిపాలనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ సమయంలో లిబనా పట్టణస్తులు కూడా తిరగబడ్డారు. యెహోరాం తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందుచేత ఇలా జరిగింది.

[11] అదీ గాక, అతడు యూదా కొండలపై ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. జెరుసలం కాపురస్తులను వ్యభిచారుల్లాగా ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు.

[12] అప్పుడు యెహోరాంకు ఏలీయా ప్రవక్తనుంచి ఈ లేఖ వచ్చింది: “మీ పూర్వీకుడైన దావీదు యొక్క దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నీ తండ్రి యెహోషాపాతు జీవిత విధానాలనూ యూదా రాజు ఆసా జీవిత విధానాలనూ అనుసరించలేదు.

[13] ఇస్రాయేల్ రాజుల జీవిత విధానాలనే అనుసరించావు. అహాబు వంశంవాళ్ళలాగే, యూదానూ, జెరుసలం నివాసులనూ వ్యభిచారుల్లాగా ప్రవర్తించేలా చేశావు. నీ తండ్రి సంతానాన్ని – నీ సొంత తమ్ముళ్ళను హత్య చేశావు. వాళ్ళు నీకంటే మంచివారు.

[14] ఇదిగో నీ ప్రజలను, నీ కొడుకులను, భార్యలను నీకున్నదాన్నంతటినీ గొప్ప విపత్తుతో యెహోవా మొత్తుతాడు.

[15] నిన్ను కూడా పేగులలో ఘోరమైన జబ్బుతో మొత్తుతాడు. నీ పేగులు బయటికి వచ్చేదాకా రోజు రోజుకు ఆ జబ్బు నిన్ను బాధిస్తూ ఉంటుంది.”

[16] యెహోరాంమీదికి ఫిలిష్తీయవాళ్ళనూ, కూషువాళ్ళకు దగ్గరిలో ఉన్న అరబ్బులనూ యెహోవా పురికొలిపాడు.

[17] వాళ్ళు యూదాపైకి దండెత్తి వచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటినీ, అతడి కొడుకులనూ భార్యలనూ తీసుకుపొయ్యారు. అతడి కొడుకులందరిలోకి చిన్నవాడైన యెహోయాహాజు ఒక్కడే మిగిలాడు.

[18] ఇదంతా జరిగాక యెహోవా యెహోరాంను పేగులలో నయం కాని జబ్బుతో మొత్తాడు.

[19] దినదినం జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళతరువాత ఆ జబ్బువల్ల అతడి పేగులు బయటికి వచ్చాయి. మహా బాధతో అతడు చచ్చిపోయాడు. అతడి ప్రజలు అతడి పూర్వీకులకోసం చేసినట్టు అతడి ఘనతకోసం అగ్ని రగులబెట్టలేదు.

[20] యెహోరాం రాజయినప్పుడు అతడి వయస్సు ముప్ఫయి రెండు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. అప్పుడు చనిపోయాడు. అతడి మృతికి ఎవరూ విచారపడలేదు. అతణ్ణి దావీదునగరంలో పాతిపెట్టారు గాని రాజుల సమాధులలో కాదు.

2 దినవృత్తాంతాలు — Chapters