[1] దేవుని ఆత్మ ఓబేదు కొడుకైన అజరయా పైకి దిగివచ్చాడు.
[2] అతడు ఆసాను కలుసుకోవడానికి వెళ్ళి అతనితో ఇలా చెప్పాడు: “ఆసా! యూదాప్రజలారా! బెన్యామీనుప్రజలారా! నేను చెప్పేది వినండి. మీరు యెహోవా పక్షం వహిస్తే ఆయన మీ పక్షం వహిస్తాడు. ఆయనను వెదికి అనుసరిస్తే ఆయన మీకు దొరుకుతాడు, ఆయనను మీరు వదిలి వేస్తే మిమ్మల్ని ఆయన వదలివేస్తాడు.
[3] సత్య దేవుడు గానీ, ఉపదేశించే యాజి గానీ, ధర్మశాస్త్రం గానీ లేకుండా ఇస్రాయేల్ ప్రజలు చాలా కాలం గడిపారు.
[4] బాధలలో వారు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవావైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికాడు.
[5] ఆ రోజుల్లో అన్ని దేశాల జనాలూ గొప్ప కలవరంలో ఉన్నారు. ఎవరైనా ప్రయాణం చేయడం క్షేమకరం కాదు.
[6] దేవుడు జనాలను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు గనుక ఒక దేశాన్ని మరో దేశం, ఒక నగరాన్ని మరో నగరం చితగ్గొట్టేవి.
[7] మీరు మాత్రం బలం పుంజుకోండి! నిరుత్సాహపడకండి! మీరు చేసే పనికి బహుమతి ఉంటుంది.”
[8] ఓబేదు కొడుకైన అజరయా ప్రవక్త దేవుని మూలంగా చెప్పిన మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకొన్నాడు. యూదాప్రదేశంలోనూ, బెన్యామీను ప్రదేశంలోనూ, ఎఫ్రాయిం కొండసీమలో తాను వశం చేసుకొన్న పట్టణాలలోనూ ఉన్న విగ్రహాలను, ఆ అసహ్యమైనవాటన్నిటినీ తీసివేశాడు. యెహోవా ఆలయం వసారా ఎదుట ఉన్న బలిపీఠాన్ని మరమ్మత్తు చేయించాడు.
[9] అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూచి చాలామంది ఇస్రాయేల్ రాజ్యాన్ని విడిచి అతని పక్షం చేరారు. ఆసా తనదగ్గరికి యూదా వారందరినీ బెన్యామీనువారందరినీ వారిమధ్య కాపుర మేర్చరచుకొన్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారినీ సమకూర్చాడు.
[10] ఆసా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరం మూడో నెల వారు జెరుసలంలో సమకూడారు.
[11] ఆ రోజు వారు యెహోవాకు ఏడు వందల ఎద్దులను, ఏడు వేల గొర్రెలను బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడీగా తీసుకు వచ్చిన వాటిలో ఉండేవి.
[12] వారు తమ పూర్వీకుల దేవుడు యెహోవాను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు.
[13] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెదకనివారికి స్త్రీలకు గానీ పురుషులకు గానీ పెద్దలకు గానీ పిన్నలకు గానీ మరణశిక్ష విధించాలని నిర్ణయించారు.
[14] వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ, బూరలూ పొట్టేళ్ళ కొమ్ములూ ఊదుతూ, యెహోవా సమక్షంలో శపథం చేశారు.
[15] ఈ విధంగా యూదావారంతా హృదయపూర్వకంగా శపథం చేశారు. గనుక శపథం విషయం అందరూ సంతోషించారు. వారు మనసారా యెహోవాను వెదికారు. ఆయన వారికి దొరికాడు, అన్ని దిశలా వారికి విశ్రాంతి ప్రసాదించాడు.
[16] ఆసారాజు అవ్వ మయకా అషేరాదేవికి ఒక అసహ్యమైన స్తంభాన్ని చేయించింది. అందుచేత అతడు ఆమెను రాజమాతగా ఉండకుండా తొలగించాడు. ఆ దేవి స్తంభాన్ని నరికివేసి కిద్రోను లోయలో తగులబెట్టాడు.
[17] ఇస్రాయేల్‌వారి మధ్య ఎత్తు పూజా స్థలాలను ఉండనిచ్చాడు గాని, ఆసాకు తాను బ్రతికినన్నాళ్ళూ యథార్థహృదయం ఉంది.
[18] యెహోవాకు తాను, తన తండ్రి ప్రతిష్ఠ చేసిన వెండి బంగారాలను, పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు.
[19] ఆసా పరిపాలనలో ముప్ఫయి అయిదో సంవత్సరం వరకు యుద్ధాలు లేవు.