[1] హిజ్కియా రాజయినప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు జెరుసలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. ఆమె జెకర్యా కూతురు.
[2] అతడు తన పూర్వీకుడు దావీదులాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు.
[3] అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా ఆలయం ద్వారాలను తెరిచాడు. వాటిని మరమ్మత్తు చేయించాడు.
[4] అప్పుడు అతడు యాజులను, లేవీగోత్రికులను పిలిపించి, వారిని ఆలయం తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చాడు.
[5] అతడు వారితో ఇలా చెప్పాడు: “లేవీగోత్రికులారా! నేను చెప్పేది వినండి. ఇప్పుడు మిమ్ములను మీరు పవిత్రం చేసుకొని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా ఆలయాన్ని పవిత్రం చేయండి. పవిత్ర స్థలంలోనుంచి అపవిత్రమైన ప్రతిదానినీ తీసివేయండి.
[6] మన తండ్రులు యెహోవామీద ద్రోహం చేశారు. మన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం త్రిప్పుకొని వారి వీపులు చూపారు.
[7] వసారా తలుపులు మూసివేశారు. దీపాలను ఆర్పివేశారు. ఇస్రాయేల్ ప్రజల దేవునికి పవిత్రాలయంలో ధూపం వేయకుండా, హోమబలులు చేయకుండా ఉన్నారు.
[8] అందుచేత యెహోవా కోపం యూదామీద, జెరుసలంమీద రవులుకొంది. ఆయన ఈ ప్రజలను బీతి భయాలకు, తిరస్కారానికి గురి చేశాడు. ఇది మీరు చూడగలుగుతున్నారు గదా.
[9] మన తండ్రులు ఖడ్గంతో కూలినదీ, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలుగా వెళ్ళినదీ అందుకే.
[10] ఇప్పుడు ఆయన కోపం మన మీదనుంచి మళ్ళేట్టు ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను.
[11] నా కుమారులారా! తనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలనీ, తన ఎదుట నిలబడి సేవ జరిగించాలనీ యెహోవా మిమ్ములను ఎన్నుకొన్నాడు. గనుక ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయకండి.”
[12] అప్పుడు ఈ లేవీగోత్రికులు పనికి సంసిద్ధులయ్యారు: కహాతు వంశంలో అమాశై కొడుకు మహతు, అజరయా కొడుకు యోవేల్; మెరారి వంశంలో అబదీ కొడుకు కీషు, యెహల్లేలేల్ కొడుకు అజరయా; గెర్షోను వంశంలో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదేను;
[13] ఎలీషాపాను సంతానంలో షిమ్రీ, యెహీయేల్; ఆసాపు సంతానంలో జెకర్యా, మత్తనయా;
[14] హేమాను సంతానంలో యెహీయేల్, షిమయా; యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేల్.
[15] వారు తమ సాటి గోత్రం వారిని సమకూర్చి తమను పవిత్రం చేసుకొన్నారు. అప్పుడు, యెహోవా మాట మేరకు రాజు ఆదేశించిన ప్రకారం, యెహోవా ఆలయం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్ళారు.
[16] యెహోవా గర్భగృహాన్ని శుద్ధి చేయడానికి యాజులే అక్కడికి వెళ్ళారు. యెహోవా ఆలయంలో కనిపించిన అశుద్ధమైన ప్రతిదానినీ వారు యెహోవా ఆలయంనుంచి ఆవరణంలోకి తెచ్చారు. లేవీగోత్రికులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకువెళ్ళి పారవేశారు.
[17] మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా వసారాల వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా ఆలయాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు.
[18] అప్పుడు వారు హిజ్కియారాజుదగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు: “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాం. హోమ బలిపీఠాన్ని, దాని సామానంతా, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామానంతా కూడా శుద్ధి చేశాం.
[19] ఆహాజురాజు తన పరిపాలనలో ద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటినీ కూడా సిద్ధం చేసి పవిత్రపరచాం. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.”
[20] మరుసటి రోజు ఉదయమే లేచి హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్ళాడు
[21] వారు రాజ్యంకోసం, పవిత్రాలయంకోసం, యూదావారి కోసం బలిగా ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను, ఏడు గొర్రెపిల్లలను, ఏడు మేకపోతులను తెచ్చారు. అది పాపాలకోసం బలి. అహరోను వంశంవారైన యాజులను “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించండి” అని రాజు ఆదేశించాడు.
[22] అప్పుడు వారు కోడెలను వధించారు. యాజులు వాటి రక్తం తీసుకొని బలిపీఠం మీద చల్లారు. తరువాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. తరువాత గొర్రెలను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు.
[23] పాపాలకోసం బలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుటికి, సమకూడినవారి ఎదుటికీ తెచ్చారు. వారు వాటిమీద చేతులుంచారు.
[24] అప్పుడు యాజులు వాటిని వధించి, ఇస్రాయేల్ ప్రజలందరి పాపాలను కప్పివేయడానికి పాపాల కోసమైన బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇస్రాయేల్ ప్రజలందరి విషయమూ హోమబలి, పాపాలకోసమైన బలి అర్పించాలని రాజు ఆదేశించాడు, గనుక వారు అలా చేశారు.
[25] మునుపు దావీదురాజు, అతని దీర్ఘదర్శి అయిన గాదు, ప్రవక్త అయిన నాతాను ఆదేశించే ప్రకారం హిజ్కియా లేవీగోత్రికులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాద్యాలతో యెహోవా ఆలయంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించాడు.
[26] దావీదు చేయించిన వాద్యాలను లేవీగోత్రికులు, బూరలను యాజులు చేతపట్టుకొని నిలబడ్డారు.
[27] బలిపీఠం మీద హోమబలులు అర్పించండని హిజ్కియా ఆదేశించాడు. హోమబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇస్రాయేల్ రాజైన దావీదు యొక్క వాద్యాలతో యెహోవాకు పాటలు పాడడం కూడా ఆరంభం అయింది.
[28] సమకూడినవారంతా ఆరాధిస్తూ ఉంటే, గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. హోమబలి ముగిసేవరకు ఇలా జరుగుతూ ఉంది.
[29] హోమబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధించారు.
[30] దావీదు, దీర్ఘదర్శి అయిన ఆసాపు వ్రాసిన కీర్తనలు ఎత్తి యెహోవాను స్తుతించాలని లేవీగోత్రికులకు హిజ్కియారాజు, అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతులు గానం చేశారు. తలలు వంచి ఆరాధించారు.
[31] అప్పుడు ప్రజలతో “యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకొన్నారు. దగ్గరికి రండి. యెహోవా ఆలయానికి బలులు, కృతజ్ఞత అర్పణలు తీసుకురండి” అన్నాడు హిజ్కియా. అలాగే సమకూడినవారు బలులు, కృతజ్ఞత అర్పణలు తెచ్చారు. ఇష్టం ఉన్నవారంతా హోమబలులు కూడా తెచ్చారు.
[32] సమకూడిన వారు తెచ్చిన హోమబలులు డెబ్భై ఎద్దులు, నూరు పొట్టేళ్ళు, రెండు వందల గొర్రెపిల్లలు. అవన్నీ యెహోవాకు హోమబలులు.
[33] అవిగాక, వారు ప్రతిష్ఠ చేసినవి ఆరు వందల ఎద్దులు, మూడువేల గొర్రెలు.
[34] యాజులు కొద్దిమందే ఉన్నారు గనుక హోమబలి పశువులన్నిటి చర్మం ఒలవలేకపోయారు. ఆ పని పూర్తి అయ్యేవరకూ, ఇతర యాజులు తమను తాము పవిత్రం చేసుకొనేవరకూ, వారి సొంత వంశీయులైన లేవీగోత్రికులు సహాయం చేశారు. యాజులకంటే లేవీగోత్రికులు తమను తాము పవిత్రం చేసుకోవడానికి యథార్థ హృదయం గలవారు.
[35] హోమబలులు, వాటితో అర్పించిన పానీయార్పణలు, శాంతి బలిపశువుల క్రొవ్వు సమృద్ధిగా ఉన్నాయి. ఆ విధంగా యెహోవా ఆలయంలో సేవ మళ్ళీ స్థాపించడం జరిగింది.
[36] దేవుడు ప్రజలకు జరిగించినదాని కారణంగా హిజ్కియా, ప్రజలంతా ఆనందించారు. ఎందుకంటే అదంతా త్వరగానే సంభవించింది.