Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించడానికి జెరుసలంలో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇస్రాయేల్ ప్రజలకూ యూదా ప్రజలకూ అందరికీ కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు.

[2] ఆ పండుగ దాని నియామక కాలంలో జరపలేకపోయారు. ఎందుకంటే, అప్పుడు తమను తాము పవిత్రం చేసుకొన్న యాజులు చాలినంతమంది లేరు, ప్రజలంతా జెరుసలంలో సమకూడలేదు.

[3] గనుక రెండో నెలలో పస్కాపండుగ చేద్దామని రాజు, అతని అధికారులు, జెరుసలంలో ఉన్న సమాజమంతా నిర్ణయించారు.

[4] ఆ విషయం రాజుకూ, సమాజం వారందరికీ అంగీకారం.

[5] చాలా కాలం నుంచి లేఖనం ప్రకారం ప్రజలు ఆ పండుగ ఆచరించలేదు. గనుక వారు బేర్‌షెబానుంచి దానువరకు ఇస్రాయేల్‌దేశం అంతటా ప్రకటన చేసి ప్రజలను ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి జెరుసలంకు ఆహ్వానించాలని నిర్ణయానికి వచ్చారు.

[6] రాజు, అతని అధికారులు వ్రాసిన లేఖలతో వార్తాహరులు రాజాజ్ఞప్రకారం యూదా, ఇస్రాయేల్ ప్రాంతాలంతటా వెళ్ళారు. ఆ లేఖలలో ఇలా వ్రాసి ఉంది: “ఇస్రాయేల్ ప్రజలారా, మీరు అష్షూరు రాజు చేతిలోనుంచి తప్పించుకొని మిగిలారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీవైపుకు తిరిగేలా మీరు ఆయనవైపు తిరగండి.

[7] మీ పూర్వీకులు, మీ సోదరులు వారి పూర్వీకుల దేవుడు యెహోవామీద ద్రోహం చేశారు. అందుచేత ఆయన వారిని నాశనానికి గురి చేశాడు. అది మీకు కనిపించిన విషయమే. మీరు వారిలాంటివారు కాకండి.

[8] మీ పూర్వీకులలాగా తలబిరుసుగా ప్రవర్తించకండి. యెహోవాకు విధేయులు కండి. ఆయన ఎప్పటికీ పవిత్రం చేసిన పవిత్రాలయానికి రండి. మీ దేవుడు యెహోవా తీవ్ర కోపం మీమీదనుంచి మళ్ళేట్టు ఆయనను సేవించండి.

[9] ఒకవేళ మీరు యెహోవావైపు తిరిగితే, మీ సోదరులను, సంతానాన్ని బందీలుగా తీసుకుపోయినవాళ్ళు వారిమీద జాలి చూపుతారు; వారు ఈ దేశానికి తిరిగి రాగలుగుతారు. మీ దేవుడు యెహోవా దయగలవాడు, కరుణామయుడు గనుక మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపు నుంచి తన ముఖం త్రిప్పుకోడు.”

[10] వార్తాహరులు ఎఫ్రాయింలో, మనష్షేలో, పట్టణం తరువాత పట్టణం జెబూలూను ప్రదేశం వరకు వెళ్ళారు. అయితే ఆ ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.

[11] కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాలలో కొంతమంది వినయభావం కలిగి జెరుసలం వచ్చారు.

[12] యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించినవాటిని నెరవేర్చేలా యెహోవా హస్తం యూదావారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించాడన్నమాట.

[13] రెండో నెలలో పొంగని రొట్టెల పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా జెరుసలంలో సమకూడారు.

[14] జెరుసలంలో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలను తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు.

[15] రెండో నెల పద్నాలుగో రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజులు, లేవీగోత్రికులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకొని, యెహోవా ఆలయానికి హోమబలులు తెచ్చారు.

[16] దేవుని మనిషి అయిన మోషేయొక్క ఉపదేశం ప్రకారం వారిని నియమించిన స్థలంలో యథావిధిగా వారు నిలబడ్డారు. లేవీగోత్రికులు యాజుల చేతికి బలిరక్తం అందించినప్పుడు దానిని వారు చల్లారు.

[17] ఆ గుంపులో తమను శుద్ధం చేసుకోనివారు చాలామంది ఉన్నారు. అశుద్ధంగా ఉండి, తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరికోసం లేవీగోత్రికులు వాటిని వధించవలసివచ్చింది.

[18] ఎఫ్రాయిం, మనష్షే, ఇశ్శాకారు, జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చినవారిలో చాలామంది తమను శుద్ధి చేసుకోలేదు. అయినా లేఖనాల విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారికోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దయామయుడు.

[19] పవిత్రాలయం నియమాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమిస్తాడు గాక!”

[20] యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజను బాగు చేశాడు.

[21] జెరుసలంలో హాజరైన ఇస్రాయేల్‌వారు మహానందంతో పొంగని రొట్టెల పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతి రోజూ లేవీగోత్రికులు, యాజులు యెహోవాకు పాటలు పాడారు, యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.

[22] యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీగోత్రికులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, శాంతి బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు.

[23] యూదా రాజైన హిజ్కియా సమకూడినవారికి వెయ్యి ఎద్దులను, ఏడు వేల గొర్రెలను ఇచ్చాడు. అధికారులు వెయ్యి ఎద్దులను, పదివేల గొర్రెలను ఇచ్చారు. యాజులు చాలామంది తమను పవిత్రం చేసుకొన్నారు.

[24] గనుక మరో ఏడు రోజులు పండుగ జరపాలని సమకూడినవారంతా నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇంకా ఏడు రోజులు సంతోషంతో పండుగ జరుపుకొన్నారు.

[25] సమకూడిన యూదావారంతా, యాజులు, లేవీగోత్రికులు ఇస్రాయేల్ నుంచి వచ్చి సమకూడినవారంతా, మునుపు యూదాకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్న ఇస్రాయేల్ వారంతా సంతోషించారు.

[26] జెరుసలంలో ఎంతో సంతోషం ఉంది. ఇస్రాయేల్ రాజైన దావీదు కొడుకు సొలొమోను కాలంనుంచి అంతవరకు జెరుసలంలో ఇలాంటిది జరగలేదు.

[27] యాజులు, లేవీగోత్రికులు నిలిచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన యెహోవా పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నాడు.

2 దినవృత్తాంతాలు — Chapters