Skip to content
Opens in a new window

[1] ఆసా పరిపాలిస్తున్న ముప్ఫయి ఆరో సంవత్సరంలో ఇలా జరిగింది: ఇస్రాయేల్ రాజు బయెషా యూదాపై దండెత్తి వచ్చి ఆసా దగ్గరికి ఎవరూ వెళ్ళకుండా, అతని దగ్గరనుంచి ఎవరూ రాకుండా చేయడానికి రమా పట్టణం మళ్ళీ కట్టించాడు.

[2] ఆ కాలంలో సిరియాకు బెన్‌హదదు రాజుగా ఉండి దమస్కులో నివసించేవాడు. ఆసా యెహోవా ఆలయంలో, రాజభవనంలో ఉన్న ఖజానాలలోని వెండి బంగారాల్ని తీసి, దానిని బెన్‌హదదుకు పంపాడు.

[3] అతనికి ఇలా కబురంపాడు: “మీ తండ్రికీ నా తండ్రికీ ఒప్పందం ఉంది. అలాగే మనం ఒప్పందం చేసుకుందాం. మీకు వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇస్రాయేల్ రాజు బయెషా నా దేశంనుంచి వెళ్ళిపోయేలా అతడితో మీకు ఉన్న ఒడంబడికను తెగతెంపులు చేయండి.”

[4] ఆసా చేసిన మనవి బెన్‌హదదు అంగీకరించాడు, తన సేనాధిపతులను ఇస్రాయేల్ పట్టణాలపైకి పంపాడు. వాళ్ళు వచ్చి, ఈయోను, దాను, అబెల్‌మయీం పట్టణాలనూ నఫ్తాలిలో సరుకులు కూడబెట్టే పట్టణాలన్నిటినీ పట్టుకొన్నారు.

[5] బయెషా ఈ వార్త విని రమాను కట్టించడం ఆపి తన పని నిలిపివేశాడు.

[6] అప్పుడు ఆసారాజు యూదా మనుషులందరినీ సమకూర్చాడు. వారు కూడివచ్చి రమా కట్టించడంలో బయెషా ఉపయోగించిన రాళ్ళు, కలప ఎత్తుకుపోయారు. వాటిని ఆసా గెబ, మిస్పాలను మళ్ళీ కట్టించడానికి ఉపయోగించాడు.

[7] ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరికి వచ్చి అతనితో అన్నాడు “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక, అరాందేశం రాజుపై ఆధారపడ్డావు. అందుచేతే అరాం రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకొంది.

[8] కూషువాళ్ళూ లూబీయావాళ్ళూ మహా సైన్యంగా చాలా రథాలతో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందుచేత ఆయన వారిని నీ వశం చేశాడు.

[9] తనపట్ల యథార్థ హృదయం ఉన్న వ్యక్తికి బలంతో సహాయం చేయడానికి యెహోవా కనుదృష్టి భూమిమీద అంతటా అటూ ఇటూ గాలిస్తూ ఉంది. ఈ విషయంలో నీవు తెలివి తక్కువగా ప్రవర్తించావు. ఇకనుంచి నీకు ఎప్పుడూ యుద్ధాలే.”

[10] ఆసాకు ఆ దీర్ఘదర్శిమీద కోపం వచ్చింది. అతనిమీద మండిపడి ఖైదులో వేయించాడు. ఆ సమయంలో ప్రజలలో కొందరిపై ఆసా దౌర్జన్యం చేశాడు కూడా.

[11] ఆసాను గురించిన విషయాలు – మొదటిదాని నుంచి చివరిదాని వరకు – యూదా, ఇస్రాయేల్‌ల రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[12] ఆసా పరిపాలిస్తున్న ముప్ఫయి తొమ్మిదో సంవత్సరంలో అతనికి పాదాలలో జబ్బు పుట్టింది. దానివల్ల అతడు చాలా బాధపడ్డా, దానిగురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులనే వెదికాడు.

[13] తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా కన్ను మూసి తన పూర్వీకుల దగ్గరికి చేరాడు.

[14] తన కోసం అతడు దావీదు నగరంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, వేరు వేరు రకాల పరిమళాలతో కప్పి ఉన్న పాడెమీద అతణ్ణి ఉంచి, అతని ఘనతకోసం గొప్ప అగ్ని రగులబెట్టారు.

2 దినవృత్తాంతాలు — Chapters