Skip to content
Opens in a new window

[1] సమూయేలు ముసలివాడయిన తరువాత తన కొడుకులను ఇస్రాయేల్ మీద నాయకులుగా నియమించాడు.

[2] అతని పెద్ద కొడుకు పేరు యోవేల్. రెండోవాడి పేరు అబీయా. వారు బేర్‌షెబాలో తీర్పు తీర్చేవాళ్ళు.

[3] సమూయేలు కొడుకులు అతని బ్రతుకుతీరును అనుసరించ లేదు. వాళ్ళు అక్రమలాభంకోసం త్రోవతప్పి లంచాలు తీసుకొంటూ, న్యాయాన్ని తారుమారు చేస్తూ ఉండేవాళ్ళు.

[4] అందుచేత ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా సమకూడి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు:

[5] “మీరు ముసలివారు, మీ కొడుకులు మీ బ్రతుకుతీరును అనుసరించడం లేదు. అన్ని దేశాలలో ఉన్నట్టే ఇప్పుడు మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజును నియమించండి.”

[6] వారు “మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజును నియమించు” అన్నమాటలు సమూయేలుకు నచ్చలేదు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు.

[7] అందుకు యెహోవా అతనికి ఇలా జవాబిచ్చాడు: “ప్రజావాణి విని వారు చెప్పినట్లెల్లా జరిగించు. వారు తిరస్కరించినది నిన్ను కాదు. వారిని పరిపాలించకుండా నన్నే తిరస్కరించారు.

[8] నేను వారిని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన రోజునుంచి ఈరోజువరకు వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు. వారు నాపట్ల జరిగిస్తూ వచ్చినట్టే ఇప్పుడు నీ పట్ల జరిగిస్తున్నారు.

[9] వారి మాట అంగీకరించు. అయితే వారిని పరిపాలించబోయే రాజు విధానాలను గురించి వారిని గట్టిగా హెచ్చరించు.”

[10] యెహోవా పలికిన మాటలన్నీ రాజు కావాలని తనకు మనవి చేసిన ప్రజలకు సమూయేలు తెలియజేశాడు.

[11] అతడు ఇలా అన్నాడు: “మిమ్ములను పరిపాలించబోయే రాజు విధానాలు ఈవిధంగా ఉంటాయి: అతడు మీ కొడుకులను పట్టుకొని తన రథాలను నడిపేలా, తన గుర్రాలను కాపాడేలా చేస్తాడు. వారు అతని రథాలముందు పరుగెత్తవలసి వస్తుంది.

[12] కొందరిని తన సైన్యంలో వేయిమందికి యాభైమందికి అధిపతులుగా నియమిస్తాడు. కొందరిని తన పొలాలను దున్నడానికీ పంటకోయడానికీ యుద్ధాయుధాలనూ తన రథాల సామాన్నూ తయారు చేయడానికీ నియమిస్తాడు.

[13] మీ కూతుళ్ళను తనకు పరిమళద్రవ్యాలు చేయడానికీ వంటలు చేయడానికీ నియమిస్తాడు.

[14] మీ పొలాలలో, ద్రాక్షతోటలలో, ఆలీవ్‌వనాలలో అన్నిటిలో మంచివాటిని పట్టుకొని తన సేవకులకు ఇస్తాడు.

[15] మీ ధాన్యంలో, ద్రాక్షపండ్లలో పదో భాగం తీసుకొని తన పరివారానికీ సేవకులకూ ఇస్తాడు.

[16] మీ పనివాళ్ళనూ పనికత్తెలనూ మేలిరకం పశువులనూ గాడిదలనూ తీసుకొని తన పని చేయించుకొంటాడు.

[17] మీ మందలలో పదో భాగం తీసుకుంటాడు. మీరే అతనికి దాసులవుతారు.

[18] మీరు కావాలని కోరుకున్న రాజును గురించి అప్పుడు మొరపెట్టు కొంటారు గానీ యెహోవా మీ మొర ఆలకించడు.”

[19] ప్రజలు సమూయేలు మాట చెవిని పెట్టలేదు. వారు “అలా కాదు. ఇతర దేశాలలాగే మాకు రాజు కావాలి.

[20] అతడు మాకు న్యాయం తీరుస్తాడు. యుద్ధాలలో మా ముందు నడుస్తూ మాకు నాయకత్వం వహించి పోరాడుతాడు” అన్నారు.

[21] వారు చెప్పినదంతా విని సమూయేలు యెహోవాకు చెప్పాడు.

[22] అందుకు యెహోవా సమూయేలుకు “వారి మాట విని వారికి ఒక రాజును నియమించు” అని ఆదేశించాడు. అప్పుడు సమూయేలు “మీరంతా మీ ఊళ్ళకు వెళ్ళండి” అని ఇస్రాయేల్ మనుషులకు చెప్పాడు.

1 సమూయేలు — Chapters