Skip to content
Opens in a new window

[1] ఫిలిష్తీయవాళ్ళు కెయిలా గ్రామం మీద దాడిచేసి కళ్ళాలలో ధాన్యాన్ని దోచుకుంటున్నారనే వార్త దావీదుకు వచ్చింది.

[2] దావీదు “నేను వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పైబడనా?” అని యెహోవాను అడిగాడు. యెహోవా “నీవు వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళ పైబడి కెయిలాను రక్షించు” అని దావీదుకు జవాబిచ్చాడు.

[3] అయితే దావీదుతో ఉన్నవారు “ఇక్కడ యూదా ప్రదేశంలోనే మాకు భయంగా ఉంది. ఫిలిష్తీయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి కెయిలాకు పోతే ఇంకెంత భయం కలుగుతుందో!” అని చెప్పారు.

[4] దావీదు యెహోవాను మళ్ళీ అడిగాడు. “నీవు కెయిలాకు వెళ్ళు. నేను ఫిలిష్తీయవాళ్ళను నీ వశం చేస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.

[5] అందుచేత దావీదు అతనితో ఉన్నవారు కెయిలాకు వెళ్ళి ఫిలిష్తీయవాళ్ళతో పోరాడి చాలామందిని హతమార్చి వాళ్ళ పశువులను దోచుకొన్నారు. ఈ విధంగా దావీదు కెయిలా పురవాసులను రక్షించాడు.

[6] అహీమెలెక్ కొడుకు అబ్యాతారు కెయిలాలో ఉన్న దావీదు దగ్గరికి పారిపోయినప్పుడు ఏఫోదు చేతపట్టుకువచ్చాడు.

[7] దావీదు కెయిలాకు వెళ్ళిన విషయం సౌలు విని “దావీదు ద్వారాలూ అడ్డగడలూ ఉన్న ఊరిలో చొచ్చి అందులో మూసివేయబడి ఉన్నాడు. దేవుడు అతణ్ణి నా చేతికి అప్పగించాడన్నమాట” అన్నాడు.

[8] సౌలు కెయిలాకు వెళ్ళి దావీదునూ అతడితో ఉన్నవారినీ ముట్టడించాలని అందరినీ యుద్ధానికి పిలిచాడు.

[9] తనకు సౌలు హాని చేయడానికి కుట్ర పన్నుతున్నాడని దావీదు తెలుసుకొని అబ్యాతారుతో “ఏఫోదును తీసుకురా” అన్నాడు.

[10] అప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! నా కారణంగా సౌలు కెయిలాకు వచ్చి ఈ ఊరిని నాశనం చేయదలస్తున్నాడని నీ సేవకుడైన నాకు ఖచ్చితంగా తెలిసింది.

[11] కెయిలా ప్రజలు నన్నూ నాతో ఉన్నవారినీ సౌలు చేతికి అప్పగిస్తారా? నీ సేవకుడైన నేను విన్నట్టు సౌలు నిజంగా వస్తాడా? యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! నీ సేవకుడైన నాకు తెలియజెయ్యి.” యెహోవా “అతడు రావాలని ఉన్నాడు” అని జవాబిచ్చాడు.

[12] “కెయిలా ప్రజలు నన్నూ నాతో ఉన్నవారినీ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు మళ్ళీ అడిగాడు. యెహోవా “వారు మిమ్ములను అప్పగించాలని ఉన్నారు” అని చెప్పాడు.

[13] కనుక దావీదూ అతనితో ఉన్న ఆ ఆరు వందలమంది మనుషులూ కెయిలాను విడిచి వారు వెళ్ళగలిగే చోటికి వెళ్ళారు. దావీదు కెయిలానుంచి తప్పించుకొన్న విషయం సౌలు విని అక్కడికి వెళ్ళలేదు.

[14] దావీదు ఎడారిలో భద్రమైన స్థలాలలో, జీఫు ఎడారి కొండప్రదేశంలో ఉండిపోయాడు. రోజురోజుకు సౌలు అతణ్ణి వెదకుతూ ఉన్నా, దేవుడు అతణ్ణి సౌలు చేతికి అప్పగించలేదు.

[15] తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని దావీదు తెలుసుకొన్నప్పుడు జీఫు ఎడారిలో హోరేషులో ఉన్నాడు.

[16] అప్పుడు సౌలు కొడుకు యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి దావీదును దేవునిలో బలపరచాడు.

[17] అతడు దావీదుతో అన్నాడు “భయంతో ఉండవద్దు. నా తండ్రి సౌలు నిన్ను పట్టుకోలేడు. నీవు ఇస్రాయేల్‌ప్రజలకు రాజవుతావు. నీ తరువాత హోదాలో నేనుంటాను. నా తండ్రి సౌలుకు కూడా ఈ విషయం తెలుసు.”

[18] వారిద్దరు యెహోవా సమక్షంలో ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు యోనాతాను ఇంటికి వెళ్ళిపోయాడు, దావీదు హోరేషులో ఉండిపోయాడు.

[19] తరువాత జీఫువారు సౌలు దగ్గరికి వెళ్ళి “దావీదు హోరేషుదగ్గర మా మధ్య దాగి ఉన్నాడు. అతడు యెషీమోను దక్షిణంగా ఉన్న హకీలా కొండలో భద్రమైన స్థలాలలో ఉన్నాడు.

[20] రాజా! నీకు ఎప్పుడు ఇష్టం ఉంటే అక్కడికి రా. మేము అతణ్ణి రాజు చేతికి అప్పగిస్తాం” అన్నారు.

[21] అందుకు సౌలు “మీరు నామీద జాలి చూపారు, గనుక యెహోవా మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాడు గాక!

[22] ఇప్పుడు మీరు వెళ్ళి అతడు ఉన్న స్థలం ఏదో, అతణ్ణి చూచిన వాళ్ళెవరో ఇంకా రూఢిగా తెలుసుకోండి. అతడు చాలా యుక్తితో వ్యవహరిస్తూ ఉన్నాడని నాకు తెలిసింది.

[23] అతడు దాక్కొనే స్థలాలను మీరు జాగ్రత్తతో కనిపెట్టి స్పష్టమైన విషయం తెలియజేయడానికి తప్పక నాదగ్గరికి తిరిగి రండి. అప్పుడు నేను మీతో వస్తాను. అతడు ఆ ప్రదేశంలో ఉంటే వేలకొలది మంది యూదావారిలో గాలించి అతణ్ణి పట్టుకొంటాను” అన్నాడు.

[24] వారు సౌలుకంటే ముందు బయలుదేరి జీఫుకు తిరిగి వెళ్ళారు. అప్పుడు దావీదు అతని మనుషులు మాయోను ఎడారిలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎండిన ప్రదేశంలో ఉంది.

[25] సౌలు అతడి మనుషులు తనను వెదకడానికి బయలుదేరిన మాట దావీదు విని మాయోను ఎడారిలో ఉన్న రాతి కొండకు వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అది విని సౌలు మాయోను ఎడారిలో దావీదు వెంటబడ్డాడు.

[26] కొండకు ఒకవైపు సౌలు, మరో వైపు దావీదు, అతని మనుషులు ఉన్నారు. సౌలు, అతడి మనుషులు దావీదునూ అతని మనుషులనూ పట్టుకోవడానికి చుట్టుముట్టబోతూ ఉంటే, దావీదు వాళ్ళ బారినుండి తప్పించు కోవడానికి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాడు.

[27] అప్పుడే ఒక మనిషి సౌలుకు వార్త చెప్పడానికి వచ్చాడు. అతడు “మీరు త్వరగా రావాలి. ఫిలిష్తీయవాళ్ళు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని తెలియజేశాడు.

[28] వెంటనే దావీదును వెంటాడడం ఆపివేసి సౌలు ఫిలిష్తీయవాళ్ళను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అందుచేత ఆ స్థలాన్ని “హమ్మలెకోతు బండ” అంటారు.

[29] తరువాత దావీదు అక్కడనుంచి వెళ్ళి ఏన్‌గెదీలో ఉన్న భద్రమైన స్థలాలలో ఉండిపోయాడు.

1 సమూయేలు — Chapters