Skip to content
Opens in a new window

[1] సమూయేలు నూనెతో నిండిన సీసాను చేతపట్టుకొని సౌలు తలపై పోసి అతణ్ణి ముద్దుపెట్టుకొని ఇలా అన్నాడు: “యెహోవా తన సొత్తుగా ఉన్న ప్రజలమీద నిన్ను నాయకుడుగా అభిషేకించి నియమించాడు.

[2] ఈవేళ నీవు నాదగ్గరనుంచి వెళ్ళిపోయిన తరువాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు నీతో ఈ విధంగా చెపుతారు: మీరు వెదకడానికి వెళ్ళిన గాడిదలు దొరికాయి. ఇప్పుడు మీ తండ్రి, గాడిదలను మరచి మీ విషయం కంగారుపడుతున్నాడు. నా కొడుకు విషయం ఏం చేయాలి? అని అడుగుతున్నాడు.

[3] తరువాత నీవు అక్కడనుంచి తాబోరు మైదానంలో ఉన్న పెద్ద చెట్టుదగ్గరికి చేరుకొంటావు. అక్కడ బేతేల్‌కు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న ముగ్గురు మనుషులు మీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలనూ, ఒకడు మూడు రొట్టెలనూ, మరొకడు ద్రాక్షరసం తిత్తినీ మోసుకువస్తారు.

[4] వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వారి చేతుల నుంచి వాటిని తీసుకో.

[5] తరువాత ‘దేవుని కొండ’ చేరుకొంటావు. అక్కడ ఫిలిష్తీయ సైనికుల గుంపు ఉంది. నీవు ఆ ఊరిదగ్గరికి వెళ్ళగానే ఎత్తయిన పూజాస్థలం నుంచి దిగివస్తూ ఉన్న ప్రవక్తల గుంపు నీకు కనిపిస్తుంది. వారికంటే ముందు కొందరు కంజరీలూ పిల్లన గ్రోవులూ వేరు వేరు తంతి వాద్యాలూ వాయిస్తూ వస్తూ ఉంటారు. ఆ ప్రవక్తలు పరవశులై ప్రకటిస్తూ ఉంటారు.

[6] అప్పుడు యెహోవా ఆత్మ నిన్ను బలీయంగా ఆవరిస్తాడు. నీవూ వారితో కలిసి పారవశ్యంతో ప్రకటిస్తావు. నీవు వేరొక వ్యక్తిలాగా మారిపోతావు.

[7] ఈ సూచనలు నీకు నెరవేరిన తరువాత సమయానికి తగ్గట్టు ప్రవర్తించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు.

[8] తరువాత నాకంటే ముందు నీవు గిల్గాల్‌కు వెళ్ళు. హోమబలులూ శాంతిబలులూ అర్పించడానికి నేను నీదగ్గరికి వస్తాను. నేను నీదగ్గరికి వచ్చి నీవు చేయవలసినది నీకు చెపుతాను. కానీ అంతకుముందు నీవు అక్కడ ఏడు రోజులవరకు ఉండి పోవాలి.”

[9] సౌలు సమూయేలు దగ్గరనుంచి బయలుదేరడానికి తిరగడంతోనే దేవుడు అతని హృదయాన్ని మార్చాడు. సమూయేలు చెప్పిన సూచకాలన్నీ ఆరోజే జరిగాయి.

[10] వారు ఆ కొండ చేరుకోగానే ప్రవక్తల గుంపు సౌలుకు ఎదురైంది. దేవుని ఆత్మ అతణ్ణి బలీయంగా ఆవరించాడు. అతడు ప్రవక్తలతో కలిసి పరవశుడై ప్రకటన చేశాడు.

[11] అతడు అలా ప్రవక్తలతో కలిసి ప్రకటించడం చూచి మునుపు అతణ్ణి ఎరిగినవారంతా, “కీషు కొడుక్కు ఏం జరిగింది? సౌలు కూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అని ఒకరిని ఒకరు అడిగారు.

[12] అక్కడివాడొకడు “వాళ్ళ తండ్రి ఎవరు?” అని అడిగాడు. అందుకు “సౌలు కూడా ప్రవక్తలలో ఒకడయ్యాడు!” అనే సామెత వెలిసింది.

[13] సౌలు అలా ప్రకటించడం మానుకొన్న తరువాత ఎత్తయిన ఆరాధన స్థలానికి వెళ్ళాడు.

[14] సౌలు పినతండ్రి సౌలునూ అతని పనివాణ్ణీ చూచి “మీరు ఎక్కడికి వెళ్ళారు?” అని అడిగాడు. అందుకు సౌలు “గాడిదలను వెదకడానికి వెళ్ళాం. అవి ఎక్కడా కనిపించకపోయేసరికి సమూయేలు దగ్గరకి వెళ్ళాం” అని బదులు చెప్పాడు.

[15] అతడి పినతండ్రి “సమూయేలు నీతో చెప్పిన విషయాన్ని నాకు చెప్పు” అన్నాడు.

[16] సౌలు “గాడిదలు దొరికేశాయి అని అతడు చెప్పాడు” అన్నాడు. కానీ సమూయేలు రాజ్యపరిపాలన విషయం చెప్పినది పినతండ్రికి సౌలు తెలియజేయలేదు.

[17] తరువాత సమూయేలు మిస్పాకూ యెహోవా సన్నిధానంలోకీ ఇస్రాయేల్ ప్రజలను పిలిపించి వారితో ఇలా అన్నాడు:

[18] “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాను. ఈజిప్ట్ వాళ్ళ వశంలో నుంచీ మిమ్ములను అణచివేసిన అన్ని రాజ్యాల వశంలోనుంచీ మిమ్ములను విడుదల చేశాను.

[19] అయితే అన్ని విపత్తులనుంచీ ఆపదలనుంచీ రక్షించే మీ దేవుణ్ణి మీరు ఈవేళ తిరస్కరించారు. ‘మాకు రాజును నియమించమ’ని ఆయనను కోరారు. కనుక మీరు గోత్రాలప్రకారం, కుటుంబాలప్రకారం యెహోవా సన్నిధానంలో నిలబడి ఉండండి.”

[20] సమూయేలు ఇస్రాయేల్ గోత్రాలన్నిటినీ దగ్గరగా రప్పించినప్పుడు బెన్యామీను గోత్రానికి చీటి వచ్చింది.

[21] బెన్యామీనుగోత్రాన్ని కుటుంబాల ప్రకారం దగ్గరగా రప్పించినప్పుడు మథ్రీ కుటుంబానికి చీటి వచ్చింది. తరువాత కీషు కొడుకు సౌలుకు చీటి వచ్చింది. వారు అతణ్ణి వెదికారు గాని అతడు కనిపించలేదు.

[22] కనుక వారు “ఆ మనిషి ఇక్కడికి ఇంకా వచ్చాడా లేదా?” అని యెహోవాను సంప్రదించారు. యెహోవా “ఇడుగో అతడు సామానులో దాగి ఉన్నాడు” అని జవాబిచ్చాడు.

[23] వారు పరుగెత్తివెళ్ళి అతణ్ణి అక్కడనుంచి తీసుకు వచ్చారు. అతడు ప్రజల మధ్య నిలబడితే భుజాలు మొదలు పైకి ఇతరులకంటే పొడుగాటి వాడుగా ఉన్నాడు.

[24] సమూయేలు ప్రజలందరితో “యెహోవా ఎన్నుకొన్న వ్యక్తిని చూశారా? ప్రజలందరిలో అతని లాంటివాడెవ్వడూ లేడు” అన్నాడు. ప్రజలంతా “రాజు చిరంజీవి అవుతాడు గాక!” అని కేకలు వేశారు.

[25] సమూయేలు రాజ్యపాలన నియమాలను ప్రజలకు వివరించాడు. అప్పుడతడు వాటిని చుట్టిన కాగితంమీద వ్రాసి దానిని యెహోవా ఆలయంలో ఉంచాడు. తరువాత సమూయేలు ప్రజలందరినీ వారి ఇండ్లకు పంపివేశాడు.

[26] సౌలు కూడ గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. అతనితోపాటు దేవునిచేత హృదయంలో కదలిక కలిగిన వీరులు కొందరు వెళ్ళారు.

[27] అయితే కొందరు పనికిమాలిన దుర్మార్గులు “అతగాడు మనల్ని ఎలా రక్షించగలడు?” అన్నారు. వాళ్ళు అతణ్ణి చిన్నచూపు చూస్తూ, అతనికి కానుకలు తీసుకురాకుండా ఉన్నారు. సౌలు మౌనం వహించాడు.

1 సమూయేలు — Chapters