Skip to content
Opens in a new window

[1] సౌలు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ముప్ఫయి సంవత్సరాలు. అతడు ఇస్రాయేల్ ప్రజలను రెండు సంవత్సరాలు పరిపాలించిన తరువాత,

[2] ఇస్రాయేల్‌ప్రజలలో మూడు వేలమందిని ఎన్నుకొన్నాడు. వారిలో రెండువేలమంది మిక్మషులో, బేతేల్ కొండలో తన దగ్గర ఉన్నారు, వెయ్యిమంది బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియాలో యోనాతానుదగ్గర ఉన్నారు. మిగతావారిని అతడు వారి ఇండ్లకు పంపివేశాడు.

[3] యోనాతాను గెబాలో ఉండే ఫిలిష్తీయ సైనికుల గుంపుపైబడి దానిని ఓడించాడు. దాన్నిగురించి ఫిలిష్తీయవాళ్ళు విన్నారు. అప్పుడు సౌలు దేశమంతటా బూర ఊది “హీబ్రూ వారు వినాలి!” అని ప్రకటన చేయించాడు.

[4] సౌలు ఫిలిష్తీయ సైనికుల గుంపుపైబడి దానిని ఓడించాడనీ అందుచేత ఫిలిష్తీయవాళ్ళకు ఇస్రాయేల్‌ప్రజలు అసహ్యులయ్యారనీ ఇస్రాయేల్‌ప్రజలందరికీ వినబడింది. వారు గిల్గాల్‌లో సౌలు దగ్గర సమకూడారు.

[5] ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయవాళ్ళు ముప్ఫయివేల రథాలనూ ఆరువేల రౌతులనూ సముద్రతీరాన ఇసుక రేణువులంతగా సైనికులనూ సమకూర్చారు. వాళ్ళు వచ్చి బేత్‌ఆవెనుకు తూర్పు దిక్కున మిక్మషులో మకాం చేశారు.

[6] ఇస్రాయేల్‌వారు తాము ఆపదలో, ఇరుకులో చిక్కుకోవడం చూచి గుహలలో, దట్టమైన పొదలలో, బండల సందులలో, పాతరలలో, గుంటలలో దాగుకొన్నారు.

[7] ఈ హీబ్రూవారిలో కొందరు యొర్దాను దాటి గాదు, గిలాదు ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అయితే సౌలు గిల్గాల్‌లోనే ఉండిపోయాడు. అతని దగ్గర ఉన్నవారంతా భయంతో వణకుతూ ఉన్నారు.

[8] సమూయేలు ఆదేశించినట్టు సౌలు ఏడు రోజులు ఆగాడు. కానీ సమూయేలు గిల్గాల్‌కు రాలేదు. ప్రజలు సౌలుదగ్గరనుంచి చెదరిపోసాగారు.

[9] కనుక సౌలు “హోమ బలినీ శాంతిబలులనూ నాదగ్గరికి తీసుకురండి” అన్నాడు. తానే హోమబలిని అర్పించాడు.

[10] హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు వచ్చాడు. సౌలు అతణ్ణి కలుసుకొని పలకరించడానికి బయటికి వెళ్ళాడు.

[11] సమూయేలు “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు ఇలా జవాబిచ్చాడు: “ప్రజలు నా దగ్గరనుంచి చెదరిపోసాగారు. నియామకమైన సమయానికి మీరు రాలేదు. ఫిలిష్తీయవాళ్ళు మిక్మషులో సమకూడారు.

[12] నేను యెహోవా అనుగ్రహాన్ని వెదకేముందే ఫిలిష్తీయవాళ్ళు గిల్గాల్‌కు వచ్చి నాపై పడతారనుకొన్నాను. అందుచేతే హోమబలి అర్పించడానికి నన్ను నేనే బలవంతం చేసుకొన్నాను.”

[13] సమూయేలు ఈ విధంగా బదులు చెప్పాడు: “నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. నీ దేవుడు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు పాటించలేదు. నీవు పాటించి ఉంటే ఆయన ఇస్రాయేల్‌ప్రజలమీద నీ రాజ్యాన్ని ఎప్పటికీ స్థిరపరచేవాడు.

[14] కానీ నీ రాజ్యం నిలవదు. యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు పాటించలేదు, గనుక యెహోవా తన హృదయానికి అనుగుణమైన మనిషిని ఎన్నుకొని తన ప్రజలకు నాయకుడుగా నియమించాడు.”

[15] అప్పుడు సమూయేలు గిల్గాల్‌ను విడిచి బెన్యామీను ప్రదేశంలో ఉన్న గిబియాకు వెళ్ళాడు. సౌలు తనదగ్గర ఉన్న వారిని లెక్కపెట్టాడు. వారు సుమారు ఆరు వందలమంది.

[16] సౌలు, అతని కొడుకు యోనాతాను, వారి దగ్గర ఉన్న మనుషులు బెన్యామీను ప్రదేశంలో గెబాలో ఉన్నారు. ఫిలిష్తీయవాళ్ళు మిక్మషులో మకాం వేసి ఉండిపోయారు.

[17] ఫిలిష్తీయవాళ్ళ శిబిరంనుంచి దోపిడీదారులు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షుయాల్ ప్రాంతంలో ఒఫ్రా వైపుకు వెళ్ళింది.

[18] మరో గుంపు బేత్‌హోరోనువైపుకు వెళ్ళింది. ఇంకో గుంపు ఎడారిదగ్గర ఉండే జెబోయిం లోయ దగ్గర ఉండే సరిహద్దువైపుకు వెళ్ళింది.

[19] ఆ రోజుల్లో ఇస్రాయేల్‌దేశమంతటా కుమ్మరి వాడొక్కడు కూడా లేడు. “కమ్మరివాళ్ళు ఉంటే హీబ్రూవాళ్ళు కత్తులూ ఈటెలూ చేయించుకోక మానరు” అని ఫిలిష్తీయవాళ్ళు చెప్పుకొని కమ్మరివాళ్ళు లేకుండా చేశారు.

[20] కనుక తమ నాగటి కర్రలనూ పారలనూ గొడ్డళ్ళనూ కొడవళ్ళనూ పదును చేయించుకోవడానికి ఇస్రాయేల్‌లో ప్రతి ఒక్కరూ ఫిలిష్తీయ వాళ్ళదగ్గరికి వెళ్ళవలసి వచ్చేది.

[21] (నాగటి కర్రలనూ పారలనూ పదును పెట్టడానికి కూలి ఒక పెద్ద వెండి నాణెం. కొంకులనూ గొడ్డళ్ళనూ పదును పెట్టడానికి, మునికోళ్ళనూ సరిచేయడానికి కూలి ఒక చిన్న వెండి నాణెం.)

[22] అందుచేత యుద్ధం జరిగిన రోజున సౌలు, యోనాతానుల దగ్గర ఉన్నవారిలో ఎవరి చేతిలో కూడా కత్తి గానీ, ఈటె గానీ లేదు. సౌలుకూ అతని కొడుకు యోనాతానుకూ మాత్రమే అవి ఉన్నాయి.

[23] అప్పుడు ఫిలిష్తీయ సైనికులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.

1 సమూయేలు — Chapters