[1] ఫిలిష్తీయదేశంవాళ్ళు యూదాప్రదేశంలో శోకోలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోకూ అజేకాకూ మధ్య ఉన్న ఏపెస్‌దమ్మీం దగ్గర వాళ్ళు మకాం చేశారు.
[2] సౌలు, ఇస్రాయేల్‌వారు సమకూడి ఏలా లోయలో మకాం వేసి ఫిలిష్తీయవాళ్ళను ఎదిరించడానికి సైన్యవ్యూహం ఏర్పరచారు.
[3] ఒకవైపు ఉండే కొండమీద ఫిలిష్తీయవాళ్ళు, మరోవైపు ఉండే కొండమీద ఇస్రాయేల్‌వారు ఉన్నారు. వారిమధ్య ఒక లోయ ఉంది.
[4] అప్పుడు ఫిలిష్తీయవాళ్ళ శిబిరంలోనుంచి ఒక వీరుడు ముందుకు వచ్చాడు. అతడు గాత్ పట్టణస్థుడైన గొల్యాతు. అతడి ఎత్తు ఆరు మూరల ఒక బెత్త.
[5] అతడు కంచు శిరస్త్రాణం. యుద్ధకవచం ధరించాడు. ఆ కంచు కవచం బరువు యాభై ఏడు కిలోగ్రాములు.
[6] అతడి కాళ్ళకు కూడా కంచు కవచం ఉంది. అతడి భుజాలమధ్య కంచు బల్లెం వ్రేలాడుతూ ఉంది.
[7] అతడి ఈటెకర్ర చేనేతపనివాడి అడ్డకర్రంత మందం గలది. ఆ కర్రకు ఉన్న ఇనుపకొన బరువు ఏడు కిలోగ్రాములు. ఒక సైనికుడు అతడి డాలును మోస్తూ అతడి ముందు నడుస్తున్నాడు.
[8] గొల్యాతు నిలిచి ఇస్రాయేల్ సైనికులతో ఇలా అరిచాడు: “మీరు బారులు తీరి యుద్ధానికి ఎందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయవాణ్ణి. మీరు సౌలు దాసులు గదా! మీ తరఫున ఒక మనిషిని ఎన్నిక చేసి నాదగ్గరికి పంపండి, చూద్దాం.
[9] అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేము మీకు సేవకుల మవుతాం. నేను అతణ్ణి జయించి చంపితే మీరు మాకు సేవకులై పరిచర్య చేయాలి.”
[10] ఆ ఫిలిష్తీయవాడు ఇంకా అన్నాడు: “ఈ రోజు నేను ఇస్రాయేల్ సైన్యాలను సవాలు చేస్తున్నాను. నాతో పోరాడడానికి ఒక మనిషిని పంపండి.”
[11] సౌలు, ఇస్రాయేల్‌వారంతా ఫిలిష్తీయవాడి మాటలు విన్నప్పుడు హడలిపోయి చాలా భయపడ్డారు.
[12] దావీదు ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయి యూదాలోని బేత్‌లెహేం పురవాసి. అతడికి ఎనిమిదిమంది కొడుకులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు.
[13] యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతో కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన ఆ ముగ్గురిలో పెద్దవాడి పేరు ఏలీయాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా.
[14] దావీదు కనిష్ఠుడు. పెద్దవాళ్ళు ముగ్గురు సౌలుతో కూడా వెళ్ళారు.
[15] గానీ దావీదు సౌలుదగ్గరనుంచి బేత్లెహేంలో ఉన్న తన తండ్రి గొర్రెలను మేపడానికి తరచుగా పోతూ, తిరిగి సౌలుదగ్గరికి వస్తూ ఉండేవాడు.
[16] ఫిలిష్తీయవాడు గొల్యాతు నలభై రోజులు ప్రతి ఉదయమూ సాయంత్రమూ ముందుకు వచ్చి లోయలో నిలబడేవాడు.
[17] యెష్షయి తన కొడుకు దావీదుతో ఇలా చెప్పాడు: “నీ అన్నలకోసం తూమెడు వేయించిన గోధుమలూ ఈ పది రొట్టెలూ తీసుకొని యుద్ధశిబిరానికి వారిదగ్గరికి త్వరగా వెళ్ళు.
[18] ఈ పది జున్నుముక్కలను వారి సహస్రాధిపతికి పట్టుకు వెళ్ళు. నీ అన్నల యోగక్షేమాలు తెలుసుకొని వారి దగ్గరనుంచి ఆనవాలొకటి తీసుకురా.
[19] వారు, సౌలు, ఇస్రాయేల్ వారంతా ఏలా లోయలో ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.”
[20] దావీదు ఉదయమే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులు తీసుకొని యెష్షయి ఆదేశించినట్టు ప్రయాణమై వెళ్ళాడు. అతడు యుధ్ధ శిబిరాన్ని చేరే సమయానికి సైన్యాలు బారులు తీరి యుద్ధనినాదాలు చేస్తూ, యుద్ధరంగం వైపు సాగుతూ ఉన్నాయి.
[21] ఇస్రాయేల్‌వారూ ఫిలిష్తీయవాళ్ళూ తమ సైన్యాలను ఎదురెదురుగా యుద్ధానికి వ్యూహాలేర్పరచారు.
[22] దావీదు తెచ్చిన వస్తువులను సామాను భద్రపరచేవాడి దగ్గర ఉంచి సైన్యవ్యూహంలోకి పరుగెత్తిపోయి తన అన్నలను కుశలప్రశ్నలు అడిగాడు.
[23] అతడు వారితో మాట్లాడుతూ ఉంటే, గాత్ పట్టణస్థుడైన ఆ ఫిలిష్తీయ వీరుడైన గొల్యాతు ఫిలిష్తీయ సైన్యంలో నుంచి వచ్చాడు, మునుపు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పాడు. అతడు చెప్పినది దావీదు విన్నాడు.
[24] గొల్యాతును చూచి ఇస్రాయేల్‌వారంతా అధికంగా భయపడి వాడి ఎదుటనుంచి పారిపోయారు.
[25] ఇస్రాయేల్‌వారిలో కొందరు “ముందుకు వచ్చిన ఆ మనిషిని చూశారా? అతడు ఇస్రాయేల్‌వారిని ధిక్కరించడానికి వస్తూ ఉన్నాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా సొమ్ము బహుకరించి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తాడు. అతడి తండ్రి ఇంటివాళ్ళను ఇస్రాయేల్ బాధ్యతలనుంచి మినహాయిస్తాడు” అని చెప్పుకొన్నారు.
[26] దావీదు తనదగ్గర నిలుచున్న వారిని చూచి “జీవంగల దేవుని సైన్యాలను ధిక్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయవాడు ఎంతటివాడు? ఎవరైనా వాణ్ణి చంపి ఇస్రాయేల్ ప్రజలనుంచి ఈ నిందను తొలగిస్తే ఏం బహుమతి లభిస్తుంది?” అని అడిగాడు.
[27] గొల్యాతును చంపినవాడికి ఏం జరుగుతుందో వారు అతడికి చెప్పారు.
[28] దావీదు వారితో మాట్లాడడం అతడి పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదుపై కోపగించుకొని, “నీవు ఇక్కడికెందుకు వచ్చావు? నీ గర్వం, నీ హృదయంలోని చెడ్డతనం నాకు తెలుసు. యుద్ధాన్ని చూడడానికే నీవు వచ్చావు” అన్నాడు.
[29] అందుకు దావీదు “ఇప్పుడు నేనేం చేశాను? ఒక ప్రశ్న మాత్రం అడిగాను. అంతే గదా” అన్నాడు.
[30] దావీదు అతడి వైపునుంచి మరో వైపుకు తిరిగి, మరోసారి ఆ ప్రశ్న వేశాడు. వారు మళ్ళీ ఆ విధంగానే జవాబిచ్చాడు.
[31] దావీదు చెప్పిన మాటలు విని ఎవరో సౌలుకు తెలియజేశాడు. సౌలు దావీదును పిలిపించాడు.
[32] సౌలుతో దావీదు “ఈ ఫిలిష్తీయవాడి విషయం ఎవరికీ ధైర్యం చెడిపోనక్కరలేదు. మీ సేవకుడైన నేను వెళ్ళి వాడితో పోరాడుతాను” అన్నాడు.
[33] సౌలు “ఈ ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కొని వాడితో పోరాడడానికి నీకు శక్తి చాలదు. నీవు అబ్బాయివి. వాడు చిన్నప్పటినుంచి సైనికుడుగా ఉన్నాడు” అని దావీదుతో చెప్పాడు.
[34] అందుకు దావీదు సౌలుతో “మీ సేవకుడైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉండేవాణ్ణి. సింహమైనా ఎలుగుబంటియైనా మందలోనుంచి గొర్రెపిల్లను ఎత్తుకుపోతూ ఉంటే,
[35] నేను దాని వెంట పడి కొట్టి దాని నోటనుంచి గొర్రెను విడిపించేవాణ్ణి. అది నాపై పడితే నేను దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపేవాణ్ణి.
[36] ఈ నీ సేవకుడు సింహాన్ని ఎలుగుబంటినీ చంపాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయవాడు జీవంగల దేవుని సైన్యాలను ధిక్కరిస్తూ ఉన్నాడు, గనుక ఆ సింహం, ఎలుగుబంటిలో ఒకదానిలాగా చస్తాడు.
[37] యెహోవా నన్ను సింహం బారినుంచీ ఎలుగుబంటి బారినుంచీ రక్షించాడు. ఈ ఫిలిష్తీయవాడి చేతినుంచి కూడా నన్ను రక్షిస్తాడు” అన్నాడు. అందుకు సౌలు “నీవు వెళ్ళు. యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక!” అని దావీదుతో అన్నాడు.
[38] అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను – కంచు కుళ్ళాయి, కవచం – దావీదుకు తొడిగించాడు.
[39] దావీదు ఆ వస్త్రాలమీద ఖడ్గం కట్టుకొని అటు ఇటు నడవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అతడు వాటిని అలవాటు చేసుకోలేదు. అప్పుడు దావీదు “వీటితో నేను వెళ్ళలేను. ఇవి నాకు ఏమీ అలవాటు లేదు” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.
[40] అప్పుడతడు తన చేతి కర్ర పట్టుకొని వాగులోనుంచి అయిదు నున్నని రాళ్ళను ఏరుకొని తనదగ్గర ఉన్న చిక్కంలో వాటిని ఉంచుకొన్నాడు. తన వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయవాడి దరిదాపులకు వెళ్ళాడు.
[41] డాలు మోసేవాడు తన ముందు నడుస్తూ ఉంటే ఆ ఫిలిష్తీయవాడు ముందుకు సాగి దావీదుకు దగ్గరగా వచ్చాడు.
[42] అతడు దావీదును బాగా చూశాడు గాని దావీదు అందమైన ఎర్రటి అబ్బాయి అని చిన్న చూపు చూశాడు.
[43] ఆ ఫిలిష్తీయవాడు దావీదుతో “నీవు కర్ర పట్టుకొని నాదగ్గరికి వస్తున్నావేం? నేను కుక్కననుకొన్నావా?” అని చెప్పి తన దేవుళ్ళ పేర దావీదును శపించాడు.
[44] ఆ ఫిలిష్తీయవాడు దావీదుతో “నాదగ్గరికి రా! నీ శవాన్ని గాలిలో ఎగిరే పక్షులకూ భూమృగాలకూ వేస్తాను” అన్నాడు.
[45] అందుకు దావీదు ఆ ఫిలిష్తీయవాణ్ణి చూచి ఇలా అన్నాడు: “నీవు కత్తి, ఈటె, బల్లెం ధరించుకొని నామీదికి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన సేనల ప్రభువు యెహోవా పేర నేను నీ మీదికి వస్తున్నాను. ఆయన ఇస్రాయేల్ సైన్యాల దేవుడు.
[46] ఈ రోజు యెహోవా నిన్ను నాశనం చేస్తాడు. నేను నిన్ను హతమార్చి నీ తలను నరికివేస్తాను. ఇస్రాయేల్ ప్రజలలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకొనేలా నేను ఈ రోజు ఫిలిష్తీయ సైనికుల శవాలను గాలిలో ఎగిరే పక్షులకూ భూజంతువులకూ వేస్తాను.
[47] యెహోవా కత్తితో, ఈటెతో రక్షించేవాడు కాడని ఇక్కడ సమకూడినవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే. ఆయన మిమ్మల్ని మా వశం చేస్తాడు.”
[48] దావీదును ఎదుర్కోవడానికి ఫిలిష్తీయవాడు ముందుకు సాగి ఇంకా దగ్గరగా వచ్చాడు. దావీదు ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కోవడానికి వాడి సైన్యం బారులవైపు త్వరగా పరుగెత్తాడు,
[49] తన చిక్కంలో చెయ్యి పెట్టి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఫిలిష్తీయవాడి నొసట కొట్టాడు. ఆ రాయి వాడి నొసటిలోకి దూసుకుపోయింది. వాడు నేలపై బోర్లా పడ్డాడు.
[50] ఈ విధంగా దావీదు వడిసెలతో రాతితో ఆ ఫిలిష్తీయవాడి మీద విజయం సాధించాడు. చేతిలో ఖడ్గం లేకుండానే వాణ్ణి కొట్టి చంపాడు.
[51] అప్పుడు దావీదు పరుగెత్తి వెళ్ళి ఫిలిష్తీయవాడి పైన నిలబడి వాడి ఖడ్గం వరనుంచి లాగాడు; వాణ్ణి చంపిన తరువాత వాడి తలను ఖడ్గంతో నరికివేశాడు. ఫిలిష్తీయవాళ్ళు తమ వీరుడు చావడం చూచి పారి పోయారు.
[52] అప్పుడు ఇస్రాయేల్‌వారూ యూదావారూ జయజయ ధ్వనులతో బయలుదేరి లోయ ప్రవేశంవరకు, ఎక్రోను ద్వారాలవరకు వాళ్ళను తరిమారు. ఫిలిష్తీయవాళ్ళు హతమై షరాయిం త్రోవ పొడుగున గాత్, ఎక్రోను వరకు కూలిపోతూ ఉన్నారు.
[53] ఇస్రాయేల్‌వారు ఫిలిష్తీయవాళ్ళను తరమడం మాని తిరిగి వచ్చి వాళ్ళ శిబిరాన్ని దోచుకొన్నారు.
[54] దావీదు ఆ ఫిలిష్తీయవాడి తలను జెరుసలంకు తీసుకు వచ్చాడు. ఫిలిష్తీయవాడి ఆయుధాలను తన డేరాలో ఉంచుకొన్నాడు.
[55] దావీదు ఫిలిష్తీయవాణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు సౌలు చూచి తన సైన్యాధిపతి అబ్నేర్‌ను పిలిచి “అబ్నేర్, ఈ యువకుడు ఎవరి కొడుకు?” అని అడిగాడు. అబ్నేర్ “రాజా, నీ ప్రాణంమీద ఒట్టు పెట్టి చెపుతున్నాను, నాకు తెలియదు” అన్నాడు.
[56] అందుకు రాజు “ఈ అబ్బాయి ఎవరి కొడుకో విచారణ చేసి తెలుసుకో” అన్నాడు.
[57] దావీదు ఫిలిష్తీయవాణ్ణి చంపి తిరిగి వచ్చిన వెంటనే ఫిలిష్తీయవాడి తల అతని చేతిలో ఇంకా ఉండగానే అబ్నేర్ అతణ్ణి సౌలుదగ్గరికి తీసుకువచ్చాడు.
[58] సౌలు అతణ్ణి చూచి “యువకుడా, నీవు ఎవరి కొడుకువు?” అని అడిగాడు. అందుకు దావీదు “బేత్‌లెహేంలో ఉన్న మీ సేవకుడైన యెష్షయి కొడుకును నేను” అని జవాబిచ్చాడు.