Skip to content
Opens in a new window

[1] ఫిలిష్తీయవాళ్ళు దేవుని మందసం పట్టుకొన్న తరువాత దానిని ఎబెనెజరునుంచి అష్డోదుకు తీసుకుపోయారు.

[2] అక్కడ వాళ్ళు దానిని దాగోనుదేవుడి గుడిలోకి తీసుకుపోయి దాగోను విగ్రహం ప్రక్కన ఉంచారు.

[3] మరుసటి రోజు ప్రొద్దున అష్డోదుప్రజలు లేచి చూస్తే దాగోను యెహోవా మందసం ఎదుట నేల బోర్లపడి ఉంది. వాళ్ళు దాగోనును లేవనెత్తి దాని స్థలంలో మళ్ళీ ఉంచారు.

[4] వాళ్ళు ఆ మరుసటి రోజు ప్రొద్దున లేచి చూచినప్పుడు యెహోవా మందసం ఎదుట దాగోను బోర్లపడి ఉంది. దాగోను తల, రెండు చేతులు విరిగి ద్వారం గడపదగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలింది.

[5] ఈ కారణంచేత ఈ రోజువరకు దాగోను పూజారులూ అష్డోదులో దాగోను గుడిలోకి వచ్చేవాళ్ళూ ఎవరూ దాగోను గుడి గడపను త్రొక్కరు.

[6] యెహోవా అష్డోదు ప్రజలను తీవ్రంగా బాధించాడు. ఆ నగర ప్రజలను దాని పరిసరాలలో కాపురమున్న వాళ్ళను ఆపదకు గురిచేశాడు. వాళ్ళకు గడ్డల రోగం కలిగించాడు.

[7] జరిగినది చూచి అష్డోదువాళ్ళు “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మన దేవుడైన దాగోనుమీద, మనమీద బలంగా చెయ్యి ఎత్తాడు, గనుక ఆయన పెట్టె ఇంకా మన మధ్య ఉండకూడదు” అని చెప్పుకొన్నారు.

[8] అప్పుడు వాళ్ళు ఫిలిష్తీయప్రజల నాయకులందరినీ పిలిపించి “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని ఏం చేద్దామంటారు?” అని అడిగారు. అందుకు ఆ నాయకులు “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని గాత్‌కు తీసుకువెళ్ళండి” అన్నారు. అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజల దేవుని మందసాన్ని అక్కడికి తీసుకువెళ్ళారు.

[9] అయితే వాళ్ళు దానిని అక్కడికి తీసుకువెళ్ళిన తరువాత, యెహోవా ఆ పట్టణం మీద కూడా చెయ్యి బలంగా ఎత్తి గొప్ప భయాందోళన కలిగించాడు. ఆయన పిన్నలనూ పెద్దలనూ గడ్డల రోగంతో హింసించాడు.

[10] గనుక గాత్‌వాళ్ళు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపి వేశారు. మందసం ఎక్రోనులోకి రాగానే ఎక్రోను ప్రజలు “మనల్నీ మనవాళ్ళనూ చంపడానికి ఇస్రాయేల్ ప్రజల దేవుని మందసాన్ని మనమధ్యకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు.

[11] అప్పుడు ఎక్రోనుప్రజలు ఫిలిష్తీయ నాయకులందరినీ పిలిపించి “ఇస్రాయేల్‌వాళ్ళ దేవుని మందసాన్ని పంపివేయండి. అది మనల్నీ మనవాళ్ళనూ చంపకుండా దానిని దాని స్థలానికి వెళ్ళనివ్వండి” అన్నారు. దేవుడు ఆ నగరవాసులమీద చెయ్యి చాలా బలంగా ఎత్తినందుచేత మరణ భయం పట్టణమంతా ఆవరించింది.

[12] అది వరకు చావక మిగిలినవాళ్ళకు గడ్డల రోగం సోకింది. ఆ పురజనుల మొరలు మిన్ను ముట్టాయి.

1 సమూయేలు — Chapters