Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌వారు ఫిలిష్తీయవాళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనెజరులో మకాం వేశారు. ఫిలిష్తీయ వాళ్ళు ఆఫెకులో మకాం వేశారు.

[2] ఇస్రాయేల్‌వారిని ఎదుర్కోవడానికి ఫిలిష్తీయవాళ్ళు సైన్య వ్యూహమేర్పరచారు. పోరాటం తీవ్రమవుతున్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఇస్రాయేల్‌వారు ఓడిపోయారు. వారిలో సుమారు నాలుగువేలమంది రణ రంగంలో హతమయ్యారు.

[3] సైనికులు శిబిరానికి తిరిగి చేరినప్పుడు ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు “ఈవేళ యెహోవా ఫిలిష్తీయవాళ్ళచేత మనల్ని ఎందుకు ఓడించాడు? షిలోహులో ఉన్న యెహోవా ఒడంబడిక పెట్టెను మనం తెప్పిద్దాం. అది మనమధ్య ఉంటే అది మనల్ని శత్రువుల బారినుంచి కాపాడుతుంది” అన్నారు.

[4] అందుచేత ప్రజలు షిలోహుకు కొందరిని పంపి అక్కడనుంచి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సేనల ప్రభువు యెహోవా ఒడంబడికపెట్టెను తెప్పించారు. ఏలీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీ, ఫీనెహాసు దేవుని ఒడంబడికపెట్టె దగ్గర ఉన్నారు.

[5] యెహోవా ఒడంబడికపెట్టె శిబిరంలోకి వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారంతా పెద్ద కేకలు వేశారు. ఆ కేకలకు భూమి కంపించింది.

[6] ఫిలిష్తీయవాళ్ళు ఆ కేకల ధ్వని విని “హీబ్రూవాళ్ళ శిబిరంలో ఈ పెద్ద కేకల ధ్వని ఏమిటి?” అని అడిగారు. యెహోవా ఒడంబడికపెట్టె వారి శిబిరంలోకి వచ్చిన సంగతి తెలుసుకొన్నప్పుడు ఫిలిష్తీయవాళ్ళకు భయం వేసింది.

[7] వాళ్ళు “వారి శిబిరంలోకి ఒక దేవుడు వచ్చాడు. అయ్యో, మనకు బాధ తప్పదు. ఇలాంటిది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు.

[8] అయ్యో, మనకు బాధ తప్పదు. బలీయమైన ఈ దేవుడి బారినుంచి మనల్ని ఎవరు కాపాడగలరు? ఎడారిలో ఈజిప్ట్‌ప్రజల మీదికి అన్ని రకాల విపత్తులను రప్పించినది ఈ దేవుడే గదా.

[9] ఫిలిష్తీయవాళ్ళలారా! ధైర్యం తెచ్చుకోండి! వాళ్ళు మీ వశం అయినట్టు మీరు ఈ హీబ్రూవాళ్ళ వశం కాకుండా ధీరులుగా పోరాడండి” అని చెప్పుకొన్నారు.

[10] గనుక ఫిలిష్తీయవాళ్ళు యుద్ధం చేశారు. ఇస్రాయేల్ వారు ఓడిపోయి ఒక్కొక్కరు తమ డేరాలకు పారిపోయారు. యుద్ధంలో పెద్ద వధ జరిగింది. ఇస్రాయేల్ సైన్యంలో ముప్ఫయివేలమంది కాల్బల సైనికులు కూలారు.

[11] అంతేగాక, ఫిలిష్తీయవాళ్ళు దేవుని మందసం పట్టుకొన్నారు. ఏలీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీ, ఫీనెహాసు చనిపోయారు.

[12] ఆరోజే బెన్యామీను గోత్రికుడొకడు రణరంగంనుంచి షిలోహుకు చినిగిన బట్టలతో, తలపై దుమ్ముతో పరుగెత్తుతూ వెళ్ళాడు.

[13] అతడు చేరుకొన్నప్పుడు ఏలీ దారిప్రక్కన కుర్చీమీద కూర్చుని ఉండి దారిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతని గుండె దడదడ కొట్టుకుంటూ ఉంది. ఆ వ్యక్తి పట్టణంలోకి వచ్చి ఆ వార్త చెప్పినప్పుడు అక్కడి ప్రజలంతా కేకలు పెట్టారు.

[14] ఆ కేకల ధ్వని విని ఏలీ “ఈ అలజడి ఏమిటి?” అని అడిగాడు.

[15] అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిది ఏళ్ళు. అతని చూపు మందగించినందుచేత అతని కండ్లు కానరాలేదు.

[16] ఆ వ్యక్తి తొందరగా ఏలీ దగ్గరికి వచ్చి, “యుద్ధంనుంచి నేను వచ్చాను. ఇవ్వేళే దానినుంచి పారిపోయి వచ్చాను” అని అతనికి తెలియజేశాడు. అందుకు ఏలీ “బాబూ, అక్కడ ఏం జరిగింది?” అని అడిగాడు.

[17] అందుకు వార్త తెచ్చినవాడు “ఫిలిష్తీయవాళ్ళ బారినుంచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు. వారిలో చాలామంది హతమయ్యారు. మీ ఇద్దరు కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు చనిపోయారు. అంతేగాక, దేవుని మందసం పట్టబడింది” అని జవాబిచ్చాడు.

[18] అతడు దేవుని మందసం విషయం చెప్పగానే గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీపై నుంచి ఏలీ వెనక్కు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు చాలా ముసలివాడు, లావుగా ఉన్నాడు. అతడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు.

[19] ఏలీ కోడలు, ఫీనెహాసు భార్య అప్పుడు గర్భవతిగా ఉంది. ఆమె ప్రసవించే రోజులు దగ్గరపడ్డాయి. దేవుని మందసం శత్రు హస్తగతమైందనీ తన మామ తన భర్త చనిపోయారనీ వార్త ఆమెకు వినబడగానే నొప్పులు పట్టు కొన్నాయి. ఆమె మోకాళ్ళపై పడి ప్రసవించింది.

[20] అప్పుడు ఆమె చనిపోతూ ఉండగా ఆమెకు పరిచర్య చేస్తున్న స్త్రీలు “భయపడవద్దు. నీకు కొడుకు కలిగాడు” అని ఆమెతో అన్నారు గాని ఆమె గమనించలేదు, జవాబియ్యలేదు.

[21] దేవుని మందసం శత్రుహస్తగతం కావడంవల్ల, తన మామ, భర్త మృతి చెందినందువల్ల ఆమె “ఇస్రాయేల్ నుంచి ప్రభావం పోయింది” అని చెప్పి ఆ పిల్లవాడికి ‘ఈకాబోద్’ అని పేరు పెట్టింది.

[22] “దేవుని మందసం పట్టుబడింది, గనుక ప్రభావం ఇస్రాయేల్ నుంచి పోయింది” అందామె.

1 సమూయేలు — Chapters