[1] తరువాత యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్‌ప్రజల రాజుగా ఉండకుండా సౌలును నేను తిరస్కరించాను. అతడి విషయం నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ దగ్గర ఉన్న కొమ్మును నూనెతో నింపుకో. నేను నిన్ను బేత్‌లెహేం పురవాసి యెష్షయి దగ్గరికి పంపుతున్నాను. అతడి కొడుకులలో ఒకణ్ణి రాజుగా ఎన్నుకొన్నాను.”
[2] అందుకు సమూయేలు “నేను ఎలా వెళ్ళగలను? ఈ విషయం సౌలు వింటే నన్ను చంపుతాడు” అన్నాడు. యెహోవా “నీవు ఒక పెయ్యదూడను తీసుకుపోయి నేను యెహోవాకు బలి చేయడానికి వచ్చానని చెప్పు.
[3] బలి అర్పించే చోటుకు యెష్షయిని ఆహ్వానించు. తరువాత నీవు చేయవలసినది నేను నీకు తెలియజేస్తాను. నేను నీకు ఎవరిని సూచిస్తానో అతణ్ణి నీవు అభిషేకించు” అని ఆదేశించాడు.
[4] యెహోవా చెప్పినట్టే సమూయేలు చేశాడు. అతడు బేత్‌లెహేంకు చేరగానే ఆ ఊరి పెద్దలు వణకుతూ, అతణ్ణి కలుసుకోవడానికి వచ్చి “మీరు ప్రశాంతంగా వస్తున్నారా?” అని అడిగారు.
[5] సమూయేలు “యెహోవాకు బలి అర్పించడానికి ప్రశాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొని నాతోకూడా బలికి రండి” అని జవాబిచ్చాడు. అప్పుడతడు యెష్షయినీ అతడి కొడుకులనూ పవిత్రం చేసి వారిని బలికి పిలిచాడు.
[6] వారందరూ అక్కడ చేరినప్పుడు సమూయేలుకు ఏలీయాబు కనిపించాడు. “నిజంగా యెహోవా అభిషేకించినవాడు ఇక్కడ ఆయన సమక్షంలో నిలబడి ఉన్నాడు” అనుకొన్నాడు.
[7] అయితే యెహోవా సమూయేలుతో “అతడి ఎత్తునూ ఆకారాన్నీ లక్ష్యపెట్టవద్దు. ఎందుకంటే నేను అతణ్ణి నిరాకరించాను. మనిషిలాగా యెహోవా చూడడు. మనుషులు బయటి ఆకారాన్ని చూస్తారు గాని యెహోవా అంతరంగాన్ని చూస్తాడు” అన్నాడు.
[8] యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ముందుకు వచ్చేలా చేశాడు. “యెహోవా ఇతణ్ణి కూడా ఎన్నుకోలేదు” అని సమూయేలు చెప్పాడు.
[9] తరువాత యెష్షయి షమ్మాను పిలిచాడు గాని సమూయేలు “యెహోవా ఇతణ్ణి కూడా ఎన్నుకోలేదు” అన్నాడు.
[10] యెష్షయి తన కొడుకులలో ఏడుగురిని సమూయేలు ముందుకు రప్పించాడు గాని సమూయేలు “యెహోవా వీళ్ళను ఎన్నుకోలేదు” అని చెప్పాడు.
[11] అప్పుడు సమూయేలు “నీ కొడుకులందరూ ఇక్కడున్నారా?” అని యెష్షయిని అడిగాడు. యెష్షయి “అందరికన్న చిన్నవాడున్నాడు. కానీ వాడు గొర్రెలు మేపుతున్నాడు” అని జవాబిచ్చాడు. అందుకు సమూయేలు “నీవు అతణ్ణి ఇక్కడికి పిలిపించి తెప్పించు. అతడు ఇక్కడికి వచ్చేవరకు మనం కూర్చోలేము” అన్నాడు.
[12] కనుక యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి రప్పించాడు. అతడి చాయ ఎరుపు, కళ్ళు ప్రకాశవంతం. అతడు అందమైనవాడు. యెహోవా “లేచి ఇతణ్ణి అభిషేకించు. నేను ఎన్నుకొన్నవాడు ఇతడే” అన్నాడు.
[13] సమూయేలు నూనెతో నిండిన కొమ్మును తీసి అతడి అన్నల సమక్షంలో అతణ్ణి అభిషేకం చేశాడు. ఆ రోజు నుంచి దేవుని ఆత్మ దావీదుమీద బలప్రభావాలతో ఉన్నాడు. తరువాత సమూయేలు రమాకు వెళ్ళిపోయాడు.
[14] అంతలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాడు. యెహోవా పంపించిన దురాత్మ వచ్చి అతణ్ణి భయపెట్టి వేధించసాగింది.
[15] సౌలు సేవకులు అతడితో “దేవుడు పంపించిన దురాత్మ మిమ్మల్ని భయపెట్టి వేధిస్తూ ఉంది గదా!
[16] మా యజమానులైన మీరు మీ ముందున్న పరిచారకులైన మాకు ఆదేశిస్తే తంతివాద్యం బాగా వాయించగలవాణ్ణి వెదకడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు పంపిన ఆ దురాత్మ మీమీదికి వచ్చినప్పుడెల్లా ఆ వ్యక్తి తంతివాద్యం వాయిస్తే మీరు బాగుపడతారు” అన్నారు.
[17] సౌలు “బాగా వాయించగలవాణ్ణి కనిపెట్టి నాదగ్గరికి తీసుకురండి” అని తన సేవకులతో చెప్పాడు.
[18] ఆ సేవకులలో ఒకడు “బేత్‌లెహేం గ్రామంవాడు యెష్షయి కొడుకులలో ఒకడు బాగా వాయంచగలడు. నేను చూశాను. అతడు ధైర్యశాలి, యుద్ధవీరుడు, చక్కగా మాట్లాడేవాడు, అందమైనవాడు. అంతేగాక యెహోవా అతడికి తోడై ఉన్నాడు” అన్నాడు.
[19] గనుక సౌలు యెష్షయి దగ్గరికి మనుషులను పంపి “గొర్రెలు మేపుతున్న నీ కొడుకు దావీదును నాదగ్గరికి పంపించు” అని చెప్పాడు.
[20] యెష్షయి రొట్టెలనూ ద్రాక్షరసంతో నిండిన తిత్తినీ మేకపిల్లనూ గాడిదపై పెట్టించి తన కొడుకు దావీదుతోకూడా వాటిని సౌలుదగ్గరికి పంపాడు.
[21] దావీదు సౌలుదగ్గరికి చేరి అతని సేవలో ప్రవేశించాడు. అతడు సౌలుకు చాలా నచ్చాడు. అతడు సౌలు ఆయుధాలు మోసేవాళ్ళలో ఒకడయ్యాడు.
[22] సౌలు “దావీదు అంటే నాకు చాలా ఇష్టం. అతణ్ణి నా సేవలో ఉండనియ్యి” అని యెష్షయికి కబురు పంపాడు.
[23] దేవుడు పంపిన ఆ దురాత్మ సౌలుమీదికి వచ్చినప్పుడెల్లా దావీదు తంతివాద్యం చేతపట్టుకొని వాయించేవాడు. అప్పుడు ఆ దురాత్మ అతణ్ణి విడిచిపోయేది, సౌలుకు కొంత నయమై ఉపశమనం కలిగేది.