[1] దావీదు, అతని మనుషులు మూడో రోజున సిక్లగు చేరుకొన్నారు. ఇంతలో అమాలేకువాళ్ళు దోపిడికోసం దక్షిణ ప్రాంతంమీద, సిక్లగు మీద దాడి చేశారు. వాళ్ళు సిక్లగును ఓడించి
[2] పెద్దలనూ పిన్నలనూ స్త్రీలనూ అందులో ఉన్న వారందరినీ చెరపట్టుకొని దానిని తగలబెట్టారు, ఎవరినీ చంపక వారిని తీసుకొని తమ దారిన వెళ్ళిపోయారు.
[3] దావీదు, అతని మనుషులు సిక్లగు చేరినప్పుడు అది తగలబడి ఉండడం, తమ భార్యలూ కొడుకులూ కూతుళ్ళూ బందీలుగా పోయి ఉండడం చూశారు.
[4] కనుక దావీదు, అతని మనుషులు ఇంకా ఏడవడానికి బలం లేనంతవరకు గట్టిగా ఏడ్చారు.
[5] దావీదు ఇద్దరు భార్యలను– యెజ్రెల్ పురవాసి అహీనోయమ్నూ కర్మెల్ గ్రామంవాడైన నాబాల్ భార్య అబీగేల్‌నూ– కూడా చెరపట్టుకుపోవడం జరిగింది.
[6] తమ కొడుకుల విషయం, కూతుళ్ళ విషయం అందరూ కుమిలిపోతూ, “రాళ్ళు రువ్వి దావీదును చంపుదామ”ని చెప్పుకొన్నారు. దావీదు చాలా దుఃఖించాడు గాని అతడు తన దేవుడు యెహోవా మూలంగా ధైర్యం తెచ్చుకొన్నాడు.
[7] అహీమెలెక్ కొడుకైన అబ్యాతారును పిలిచి దావీదు “ఏఫోదు తీసుకురా” అన్నాడు. అతడు దానిని తీసుకు వచ్చినప్పుడు,
[8] దావీదు “నేను ఈ దోపిడీదారుల గుంపును తరుమాలా? దానిని కలుసుకోగలనా?” అని సంప్రదించాడు. యెహోవా, “వాళ్ళను తరుము. నీవు వారిని కలుసుకొని తప్పక నీవారందరినీ దక్కించుకొంటావు” అన్నాడు.
[9] అందుచేత దావీదు, అతనితో ఉన్న ఆరు వందలమంది తరలి వెళ్ళారు. వారు బెసోరు వాగు ఒడ్డుకు చేరినప్పుడు వారిలో కొంతమంది వెనుక ఉండిపోయారు.
[10] ఎందుకంటే, రెండు వందలమంది వాగు దాటలేనంతగా అలసిపోయారు. దావీదు మిగతా నాలుగు వందలమంది అమాలేకువాళ్ళను వెంటాడుతూ వెళ్ళారు.
[11] వారు వెళ్తూ ఉంటే పొలంలో ఈజిప్ట్ దేశస్థుడొకడు కనిపించాడు. వారు అతణ్ణి దావీదు దగ్గరికి తీసుకువచ్చారు. అతడికి భోజనం పెట్టి దాహమిచ్చారు.
[12] అంజూరు పండ్ల బిళ్ళలో ఉన్న ముక్కనూ రెండు ఎండిన ద్రాక్ష పండ్ల అడలనూ కూడా అతడికిచ్చారు. అతడు మూడు రాత్రింబగళ్ళు ఏమీ తినలేదు, నీళ్ళు త్రాగలేదు. అతడు తిన్న తరువాత బలం పుంజుకొన్నాడు.
[13] దావీదు అతణ్ణి చూచి “నీవు ఏ దేశానికి చెందిన వాడివి? ఎక్కడనుంచి వచ్చావు?” అని అడిగాడు. అతడు “నేను పుట్టుకతో ఈజిప్ట్‌దేశస్తుణ్ణి. అమాలేకువాడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను విడిచి వెళ్ళిపోయాడు.
[14] మేము కేరేతువాళ్ళ దక్షిణ దేశంమీద, యూదా ప్రదేశంమీద, కాలేబువాళ్ళకు చెందిన దక్షిణ ప్రాంతంమీద దాడి చేసి వాటిని దోచుకొన్నాం. సిక్లగును తగలబెట్టాం” అని జవాబిచ్చాడు.
[15] దావీదు “నీవు ఆ దోపిడీదారుల గుంపు దగ్గరికి నాకు త్రోవ చూపగలవా?” అని అడిగినప్పుడు అతడు “మీరు నన్ను చంపరనీ నా యజమానికి అప్పగించరనీ మీరు దేవుని పేర ఒట్టుపెట్టుకుంటే నేను మిమ్మల్ని ఆ గుంపు దగ్గరికి తీసుకుపోతాను” అని చెప్పాడు.
[16] అతడు దావీదును ఆ దోపిడీదారుల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆ స్థలమంతా చెదరి ఉండి తింటూ త్రాగుతూ ఉన్నారు. తాము ఫిలిష్తీయదేశంనుంచీ యూదా ప్రదేశంనుంచీ దోపిడీ కారణంగా సంబరపడుతూ ఉన్నారు.
[17] దావీదు ముని చీకటినుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు వాళ్ళను హతమార్చాడు. వాళ్ళలో నాలుగు వందలమంది యువకులు ఒంటెలపై ఎక్కి పారిపోయారు. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ తప్పించుకోలేక పోయారు.
[18] అమాలేకువాళ్ళు ఎత్తుకుపోయిన దానంతటినీ దావీదు మళ్ళీ స్వాధీనం చేసుకొన్నాడు. అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించాడు.
[19] ఆ దోపిడీలో ఏదీ పోలేదు. చిన్నవాటినీ పెద్దవాటినీ దోపిడీ అంతటినీ కొడుకులనూ కూతుళ్ళనూ అందరినీ దావీదు తిరిగి తనవెంట తీసుకువెళ్ళాడు.
[20] దావీదు గొర్రెలనూ పశుమందలనూ పట్టుకొన్నాడు. ప్రజలు తమ పశువులకు ముందు వాటిని తోలుకుపోయి “ఇవి దావీదు దోపిడీసొమ్ము” అని చెప్పారు.
[21] అలసటచేత దావీదును వెంబడించలేక, బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన రెండు వందలమంది దగ్గరికి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదునూ అతని మనుషులనూ కలుసు కోవడానికి కొద్ది దూరం నడిచారు. దావీదు వారిదగ్గరికి చేరి వారి యోగక్షేమాలు అడిగాడు.
[22] అయితే దావీదుతో వెళ్ళినవారిలో దుర్మార్గులూ నీచులంతా ఇలా అన్నారు: “వీళ్ళు మనతో కూడా రాలేదు గదా. కనుక మనకు మళ్ళీ వచ్చిన దోపిడీసోమ్ములో మనం వీళ్ళకేమీ ఇవ్వం. వాళ్ళు తమ భార్యలనూ పిల్లలనూ మాత్రం తీసుకుపోవచ్చు.”
[23] అందుకు దావీదు బదులు చెప్పాడు, “నా సోదరులారా, యెహోవా మనకిచ్చిన వాటితో మీరు ఆ విధంగా చేయ కూడదు. యెహోవా మనల్ని కాపాడాడు. మనపైబడ్డ ఆ గుంపును మన వశం చేశాడు.
[24] మీరు చెప్పినది ఎవరు అంగీకరిస్తారు? యుద్ధానికి వెళ్ళినవాడి భాగం ఎంతో, సామాను దగ్గర ఉండిపోయినవాడి భాగం అంతే. వారు సమానంగా పంచుకొంటారు.”
[25] ఆ రోజునుంచి దావీదు ఆ పద్ధతిని ఇస్రాయేల్ ప్రజలకు చట్టంగా నియమించాడు. ఆ నియమం ఈ రోజువరకు నిలిచి ఉంది.
[26] దావీదు సిక్లగుకు చేరుకొన్నప్పుడు తనకు మిత్రులుగా ఉన్న యూదా పెద్దలకు దోపిడీలో భాగం పంపాడు. “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకిస్తున్నాను” అని కబురంపాడు.
[27] అతడు ఈ పెద్దలకు పంపాడు. బేతేల్‌లో, దక్షిణ రామోతులో, యత్తీరులో,
[28] ఆరోయేర్‌లో, షిప్‌మోతులో, ఎష్తెమోనలో,
[29] రాకాల్‌లో యెరహ్మేల్‌వాళ్ళ ఊళ్ళలో, కేనువాళ్ళ ఊళ్ళలో,
[30] హోర్మాలో, బోర్ ఆషానులో, ఆతాకులో,
[31] హెబ్రోనులో, దావీదు అతని మనుషులు సంచరించిన ఇతర స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలు.