Skip to content
Opens in a new window

[1] ఏలీ సముఖంలో బాలుడు సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో యెహోవా తన వాక్కు మనుషులకు పంపించడం అరుదుగా జరిగేది. దర్శనం తరచుగా లభించేది కాదు.

[2] అప్పటికి ఏలీ కనుచూపు మందగించింది. అతడు సరిగా చూడలేనివాడు. ఒకరాత్రి ఏలీ తన స్థలంలో పడుకొని ఉంటే

[3] దేవుని దీపం ఇంకా ఆరిపోకముందే సమూయేలు యెహోవా నివాసంలో పవిత్రమైన ఒడంబడికపెట్టె ఉన్నచోట పడుకొన్నాడు.

[4] ఉన్నట్టుండి యెహోవా సమూయేలును పిలిచాడు.

[5] సమూయేలు “చిత్తం!” అని ఏలీ దగ్గరికి పరుగెత్తాడు. “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా!” అన్నాడు. అందుకు ఏలీ “నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో” అని చెప్పాడు. అతడు వెళ్ళి పడుకొన్నాడు.

[6] యెహోవా సమూయేలును మళ్ళీ పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా” అని చెప్పినప్పుడు, “కుమారా, నేను నిన్ను పిలువలేదు. వెళ్ళి పడుకో!” అని అతడు అన్నాడు.

[7] అప్పటికింకా సమూయేలు యెహోవాను తెలుసుకోలేదు. యెహోవా వాక్కు అతడికి అంతవరకు వెల్లడి కాలేదు.

[8] యెహోవా సమూయేలును మళ్ళీ మూడోసారి పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి “చిత్తం! మీరు నన్ను పిలిచారు గదా” అన్నాడు. అప్పుడు ఏలీ ఆ అబ్బాయిని పిలిచింది యెహోవా అని గ్రహించి,

[9] “నీవు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా! నీ పరిచారకుణ్ణి. నేను వింటున్నాను. మాట్లాడండి’ అని జవాబివ్వు” అన్నాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పడుకొన్నాడు.

[10] తరువాత యెహోవా వచ్చి దగ్గర నిలబడి ఉండి అంతకుముందు పిలిచినట్లు “సమూయేలు! సమూయేలు!” అని పిలిచాడు. సమూయేలు “నీ పరిచారకుణ్ణి. నేను వింటున్నాను. మాట్లాడండి” అన్నాడు.

[11] అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “నేను ఇస్రాయేల్‌లో ఒక కార్యం చేయబోతున్నాను. దాన్ని గురించి వినే ప్రతివాడి రెండు చెవులు గింగురుమంటాయి.

[12] ఏలీని గురించి నేను చెప్పినదంతా తొలినుంచి తుదివరకు ఆ రోజున జరిగిస్తాను.

[13] అతడి కుటుంబానికి శాశ్వతమైన శిక్ష విధిస్తానని అతడితో చెప్పాను. ఎందుకంటే, అతడి కుటుంబీకులు చేసిన పాపాలు అతడికి తెలుసు. అతడి కొడుకులు తమను శాపానికి పాత్రులుగా చేసుకొన్నారు గానీ వారిని అతడు ఆపలేదు.

[14] అందుచేత ఏలీ కుటుంబ దోషం బలిద్వారా గానీ నైవేద్యం ద్వారా గానీ ఎన్నటికీ కప్పివేయడం జరగదని నేను ఏలీ కుటుంబీకుల విషయం శపథం చేస్తున్నాను.”

[15] సమూయేలు ఉదయంవరకు పడుకొని ఉండి అప్పుడు లేచి యెహోవా నివాసం తలుపులు తీశాడు. సమూయేలు తనకు కలిగిన ఆ దర్శనాన్ని గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు.

[16] అయితే ఏలీ “కుమారా! సమూయేలూ!” అని పిలిస్తే “చిత్తం” అని సమూయేలు జవాబిచ్చాడు.

[17] అప్పుడు ఏలీ “యెహోవా నీతో ఏం చెప్పాడు? అది నాకు దాచవద్దు. ఆయన నీకు చెప్పిన విషయాలలో ఏదైనా నీవు దాచావా, దేవుడు నీకు అంతకంటే అధికంగా కీడు కలిగిస్తాడు గాక” అని సమూయేలుతో అన్నాడు.

[18] కనుక సమూయేలు దేనినీ దాచక విషయమంతా అతడికి చెప్పాడు. అందుకు ఏలీ “ఆయన యెహోవా. ఆయనకు మంచిదని అనిపించింది ఆయన చేస్తాడు గాక!” అన్నాడు.

[19] సమూయేలు పెద్దవాడవుతూ ఉన్నప్పుడు యెహోవా అతడికి తోడై ఉన్నాడు, అతడి మాటలలో ఏదీ తప్పిపోనివ్వలేదు.

[20] గనుక యెహోవా సమూయేలును ప్రవక్తగా స్థిరపరచాడని దాను పట్టణం మొదలు బేర్‌షెబా వరకు ఇస్రాయేల్ ప్రజలందరూ గుర్తించారు.

[21] షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. అక్కడ యెహోవా తన వాక్కుద్వారా సమూయేలుకు ప్రత్యక్షం అవుతూ ఉండడం జరిగింది. సమూయేలునుంచి సందేశాలు ఇస్రాయేల్ ప్రజలందరికీ బయలుదేరసాగాయి.

1 సమూయేలు — Chapters