Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. అందుచేత వారిని యెహోవా ఏడేళ్ళు మిద్యానువాళ్ళ చేతికి అప్పగించాడు.

[2] మిద్యానువాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలమీద బలంగా పైచెయ్యి కావడంవల్ల ఇస్రాయేల్‌ప్రజ కొండల సందులలో గుహలలో తమకోసం భద్రమైన స్థావరాలను తయారు చేసుకొన్నారు.

[3] ఇస్రాయేల్ వారు విత్తనాలు చల్లుకొన్నప్పుడెల్లా మిద్యానువాళ్ళు అమాలేకు వాళ్ళు, ఇతర తూర్పుజనాలు దేశంమీదికి దండెత్తి వచ్చేవాళ్ళు.

[4] వారికి ఎదురుగా మకాం చేసి, వారి పొలాల పంటలను గాజావరకు పాడుచేసి, ఇస్రాయేల్‌ప్రజకు తినడానికి తిండి లేకుండా చేసేవాళ్ళు. దేశంలో ఒక్క గొర్రెను గానీ ఎద్దును గానీ గాడిదను గానీ వాళ్ళు ఉండనిచ్చేవాళ్ళు కాదు.

[5] వాళ్ళు తమ పశువులతో డేరాలతో లెక్కకు మిడతల గుంపులలాగా వచ్చిపడేవాళ్ళు. వాళ్ళు, వాళ్ళ ఒంటెలు ఇన్ని అని చెప్పడానికి వీలులేదు. దేశాన్ని పాడు చేయడానికే వాళ్ళు వచ్చేవాళ్ళు.

[6] మిద్యానువాళ్ళ మూలాన ఇస్రాయేల్‌ప్రజ హీనస్థితికి దిగజారిపోయారు, గనుక వారు యెహోవాకు మొరపెట్టారు.

[7] మిద్యానువాళ్ళ కారణంగా ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టుకొన్నప్పుడు,

[8] ఆయన వారి దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను మిమ్ములను ఈజిప్ట్‌నుంచి – ఆ దాస్యగృహం నుంచి – తీసుకువచ్చాను.

[9] ఈజిప్ట్‌వాళ్ళ చేతిలో నుంచి, మిమ్ములను బాధపెట్టేవాళ్ళందరి చేతిలోనుంచి, మిమ్ములను విడిపించాను. మీ ఎదుటనుంచి వాళ్ళను తరిమివేశాను. వాళ్ళ దేశం మీకు ఇచ్చాను.

[10] ‘నేనే మీ దేవుణ్ణి, యెహోవాను, మీరు అమోరీవాళ్ళ దేశంలో కాపురముంటున్నారు. వాళ్ళ దేవుళ్ళపట్ల భయభక్తులు చూపకండి’ అని నేను మీతో చెప్పాను. కాని, మీరు నా మాట పెడచెవిని పెట్టారు”.

[11] యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో ఉన్న సిందూర వృక్షం క్రింద కూచున్నాడు. ఆ చెట్టు అబీయెజ్రా వంశంవాడైన యోవాషుది. అతడి కొడుకు గిద్యోను. మిద్యానువాళ్ళకు కనబడకుండా గిద్యోను ద్రాక్షగానుగ చాటున గోధుమలు నూరుస్తూ ఉన్నాడు.

[12] యెహోవా దూత గిద్యోనుకు కనిపించి, “బలపరా క్రమాలు గలవాడా! యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.

[13] అందుకు గిద్యోను ఇలా జవాబిచ్చాడు: “స్వామీ! యెహోవా మాకు తోడుగా ఉంటే ఇలా మాకు జరిగేదేనా? యెహోవా మమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకురాలేదా? అంటూ మా పూర్వీకులు చెప్పిన ఆయన అద్భుతాలు ఎక్కడ? యెహోవా ఇప్పుడు మమ్మల్ని వదిలేసి మిద్యానువాళ్ళ చేతికి అప్పగించాడు.”

[14] అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “నీకు ఉన్న బలంతో వెళ్ళి, ఇస్రాయేల్‌ప్రజను మిద్యానువాళ్ళ చేతులలో నుంచి విడిపించు. నేను నిన్ను పంపుతున్నాను గదా!” అని చెప్పాడు.

[15] అప్పుడతడు ఆయనతో “స్వామీ! నేను ఇస్రాయేల్ ప్రజను ఎలా విడిపించేది? మనష్షే గోత్రంలోని అన్ని కుటుంబాలలో మాది బలహీనమైనది. మా కుటుంబంలో నేను చిన్నవాణ్ణి” అని చెప్పాడు.

[16] యెహోవా “నేను నీకు తోడుగా ఉంటాను. ఒంటరివాణ్ణి కొట్టినట్టు నీవు మిద్యానువాళ్ళను హతం చేస్తావు” అని అతనితో చెప్పాడు.

[17] అప్పుడతడు “నా మీద నీకిప్పుడు దయ గనుక ఉంటే నాతో మాట్లాడుతున్నది నీవే అని నాకొక సూచన చూపించు.

[18] నేను ఇప్పుడే నా అర్పణ తెచ్చి నీ ముందు పెట్టేవరకు నీవు ఇక్కడనుంచి వెళ్ళిపోకు” అని ఆయనను ప్రాధేయపడ్డాడు. “నీవు వెళ్ళి వచ్చేవరకు నేనుంటాను” అని ఆయన చెప్పాడు.

[19] గిద్యోను ఇంట్లోకి వెళ్ళి ఒక మేకపిల్లను వండాడు. పొంగజేసే పదార్థం వేయకుండా తూమెడు పిండితో రొట్టెలను సిద్ధం చేశాడు. వండిన మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి, దాని పులుసు ఒక కుండలో పోసి, సిందూరవృక్షం క్రింద ఉన్న ఆయనకు తెచ్చి ఇచ్చాడు.

[20] అప్పుడు దేవుని దూత “ఆ మాంసం, పొంగనిరొట్టెలు తీసుకువచ్చి, ఈ రాతిమీద పెట్టి, వాటిమీద పులుసు పోయి” అని అతనితో చెప్పాడు. అతడు అలాగే చేశాడు.

[21] అప్పుడు యెహోవా దూత మాంసాన్ని, పొంగని రొట్టెలను తన చేతికర్ర కొనతో ముట్టాడు. అప్పుడా రాయినుంచి మంట పైకి లేచి, మాంసాన్ని పొంగని రొట్టెలను కాల్చివేసింది. వెంటనే యెహోవా దూత అంతర్ధానమయ్యాడు.

[22] ఆయన యెహోవా దూత అని, “అయ్యో, యెహోవా ప్రభూ! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశానే!” అన్నాడు.

[23] కానీ, యెహోవా “నీకు విశ్రాంతి కలుగుతుంది! భయపడవద్దు! నీవు చావవు” అని అతనితో చెప్పాడు.

[24] అప్పుడక్కడ గిద్యోను యెహోవాకు బలిపీఠం కట్టి, ‘యెహోవా షాలోం’ అని దానికి పేరు పెట్టాడు. ఈనాటికీ అది అబీయెజ్రా వంశంవారి ఒఫ్రా దగ్గర ఉంది.

[25] ఆ రాత్రిలోనే యెహోవా అతనితో ఇలా అన్నాడు: “మీ నాన్నకున్న ఎద్దులలో రెండో దానిని అంటే, ఆ ఏడేళ్ళదానిని తీసుకో. మీ నాన్న బయల్‌దేవుడికి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టు. దాని ప్రక్కన ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివెయ్యి.

[26] అప్పుడు ఈ బండమీద క్రమబద్ధంగా నీ దేవుడు యెహోవాకు బలిపీఠం కట్టు. ఆ రెండో ఎద్దును తీసుకువచ్చి, హోమబలిగా అర్పించు. నీవు నరికివేసిన అషేరాదేవి స్తంభం కలపను కట్టెలుగా వాడుకో.”

[27] గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకువెళ్ళి, యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు. అతడు తన కుటుంబం వారికీ ఆ ఊరివాళ్ళకూ భయపడి, రాత్రి వేళ అలా చేశాడు గాని పగలు కాదు.

[28] ప్రొద్దున ఊరివాళ్ళు లేచేసరికి బయల్‌దేవుడి బలిపీఠం ముక్కలైవుంది! దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభం నరికివేసివుంది! క్రొత్తగా కట్టిన బలిపీఠం ఒకటి ఉంది! దానిమీద ఆ రెండో ఎద్దు బలైవుంది!

[29] “ఈ పని చేసినవాడెవడా” అని ఒకరినొకరు అడిగారు. వాళ్ళు శ్రద్ధగా విచారణ చేస్తూ ఉంటే యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేశాడని ఎవరో చెప్పారు.

[30] అప్పుడు ఆ ఊరివాళ్ళు యోవాషును పిలిచి, “నీ కొడుకును బయటికి తీసుకురా! వాడు బయల్‌దేవుడి బలిపీఠాన్ని పడగొట్టాడు, దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివేశాడు, గనుక అతడు చావాలి” అని చెప్పారు.

[31] అప్పుడు యోవాషు తన మీదికి వచ్చినవాళ్ళతో ఇలా అన్నాడు: “మీరు బయల్‌దేవుడి పక్షంగా పోరాడుతారా? మీరతణ్ణి రక్షిస్తారా? అతడి పక్షంగా ఎవడైతే పోరాడుతాడో వాడే తెల్లవారేటప్పటికి చావాలి. ఎవరో అతడి బలిపీఠాన్ని పడవేశారు గదా. అతడొక దేవుడు గనుక అయివుంటే తన పక్షంగా తానే పోరాడగలడు.”

[32] అందుకని, ఆ రోజున గిద్యోనును ‘యెరుబ్బయల్’ అన్నారు. బయల్‌దేవుడి బలిపీఠం అతడు పడగొట్టాడు గనుక “బయల్‌దేవుణ్ణి అతడితో పోరాడనియ్యి” అని వాళ్ళు చెప్పారు.

[33] ఆ తరువాత మిద్యానువాళ్ళు, అమాలేకువాళ్ళు, ఇతర తూర్పుజనాలు కలిసి, యొర్దాను దాటివచ్చి యెజ్రేల్‌లోయలో మకాం చేశారు.

[34] అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించాడు. అతడు బూర ఊది తనతో రమ్మని అబీయెజ్రా వారిని సమకూర్చాడు.

[35] మనష్షే ప్రదేశమంతటా వార్తాహరులను పంపాడు. అతణ్ణి అనుసరించడానికి వారు కూడా సమకూడారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాల వారిదగ్గరికి కూడా అతడు వార్తాహరులను పంపాడు. వచ్చిన శత్రువులను ఎదిరించడానికి వారు కూడా వచ్చారు.

[36] అప్పుడు గిద్యోను దేవునితో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్‌వారిని నా చేతిమీదుగా నీవు విడిపిస్తానన్నావు గదా. అలాగైతే,

[37] ఇదిగో! కళ్ళంమీద గొర్రెబొచ్చు పరుస్తాను. ఆ బొచ్చుమీదే మంచు పడి మిగతా నేలంతా పొడిగా వుంటే నీవు చెప్పినట్లుగా ఇస్రాయేల్‌వారిని నా చేతులమీదుగా నీవు విడిపిస్తావని నేను తెలుసుకొంటాను.”

[38] అలాగే జరిగింది. అతడు మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి ఆ గొర్రెబొచ్చు పిండాడు. అలా మెలిపెడితే గిన్నెడు నీరు వచ్చింది.

[39] అప్పుడు గిద్యోను “మరోసారి మాట్లాడుతాను. నామీద కోపగించవద్దు. ఇంకోసారి ఈ గొర్రె బొచ్చుతో పరీక్ష చేయనియ్యి. బొచ్చు పొడిగా ఉండి, నేలంతా మంచు ఉండేలా చెయ్యి” అని దేవునితో అన్నాడు.

[40] ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉంది. నేలంతా మంచుపడి ఉంది.

న్యాయాధిపతులు — Chapters