Skip to content
Opens in a new window

[1] ఏహుదు చనిపోయాక ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు.

[2] గనుక యెహోవా వాళ్ళను హాసోరు నగరంలో పరిపాలిస్తున్న కనానుజాతివాళ్ళ రాజు యాబీను వశం చేశాడు. హరోషత్‌హగోయింలో నివసించే సీసెరా అతడి సైన్యాధిపతి.

[3] యాబీనుకు తొమ్మిది వందల ఇనుప రథాలుండేవి. అతడు ఇరవైయేళ్ళు ఇస్రాయేల్ వారిని తీవ్రంగా బాధించాడు గనుక సహాయం చెయ్యమని వారు యెహోవాకు మొరపెట్టారు.

[4] ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా ఇస్రాయేల్ ప్రజలకు నాయకురాలుగా ఉండేది. ఆమె దేవుని మూలంగా పలికే స్త్రీ కూడా.

[5] ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో రమాకు బేతేల్‌కు మధ్య ‘దెబోరా ఖర్జూర చెట్టు’ క్రింద న్యాయం తీర్చడానికి ఆమె కూర్చుని ఉండేది. ఇస్రాయేల్‌ప్రజలు వ్యాజ్య పరిష్కారం కోసం ఆమె దగ్గరికి వచ్చేవారు.

[6] ఒకరోజు ఆమె అబీనోయం కొడుకైన బారాకును నఫ్తాలి ప్రదేశంలో కెదెషునుంచి పిలిపించి అతనితో ఇలా చెప్పింది: “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు ‘వెళ్ళు! నఫ్తాలి గోత్రంనుంచి, జెబూలూను గోత్రంనుంచి పదివేల మందిని వెంటబెట్టుకొని తాబోరు కొండకు వెళ్ళు.

[7] యాబీను యొక్క సైన్యాధిపతి సీసెరా తన రథాలతో, సైన్యంతో కీషోను ఏటి దగ్గర నిన్ను ఎదుర్కోవడానికి వచ్చేలా నేను చేస్తాను. అతణ్ణి నీ వశం చేస్తాను.’”

[8] “నీవు నాతో వస్తే నేను వెళ్తాను. నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను” అని బారాకు ఆమెకు జవాబిచ్చాడు.

[9] అందుకామె “నేను మీతో తప్పక వస్తాను. అయినా, మీరు చేసే ఈ దండయాత్రలో మీకు మాత్రం పేరుప్రతిష్ఠలు రావు. యెహోవా సీసెరాను ఓ స్త్రీ చేతికి అప్పగిస్తాడు” అని చెప్పింది. అప్పుడు దెబోరా బారాకుతో కూడా బయలుదేరి కెదెషు వెళ్ళింది.

[10] బారాకు జెబూలూనువారిని నఫ్తాలివారిని కెదెషుకు పిలిపించాడు. అతని వెంట పది వేల మంది వెళ్ళారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది.

[11] హెబెరు కేయిను వంశంవాడు. అంతకు ముందు అతడు మోషే మామ హోబాబు వంశంవారైన ఇతర కేయిను వారినుంచి విడిపోయి కెదెషుకు దగ్గరగా జయనన్నీంలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర తన డేరా వేసుకొన్నాడు.

[12] అబీనోయం కొడుకైన బారాకు తాబోరుకొండకు వెళ్ళాడని సీసెరాకు ఎవరో తెలియజేశారు.

[13] సీసెరా తన తొమ్మిది వందల ఇనుప రథాలను, అతనితో ఉండే వాళ్ళందరినీ హెరోషత్ హాగోయిం నుంచి కీషోను ఏటి దగ్గరికి రప్పించాడు.

[14] అప్పుడు దెబోరా బారాకుతో, “బయలుదేరు! సీసెరాను యెహోవా మీ వశం చేసేది ఈ రోజే! మీకు ముందు యెహోవా వెళ్ళాడు గదా!” అంది. అప్పుడు బారాకు తన వెంట వచ్చిన ఆ పదివేలమందితో తాబోరుకొండ దిగాడు.

[15] బారాకు ఎదుట యెహోవా సీసెరాను, అతడి ఇనుప రథాలన్నిటినీ, అతడి సైన్యమంతటినీ తల్లడిల్లిపోయేలా, కత్తి పాలయ్యేలా చేశాడు. సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు.

[16] హరోషత్‌హాగోయిం వరకు అతడి రథాలను, సైన్యాన్ని బారాకు తరిమాడు. సీసెరా సైన్యమంతా కత్తివాతకు గురి అయి కూలారు. ఒక్కడు కూడా మిగలలేదు.

[17] కాని, సీసెరా కాలినడకన కేయినువాడైన హెబెరు భార్య యాయేల్ డేరాకు పారిపోయాడు. ఎందుకంటే, హాసోరురాజైన యాబీనుకు, కేయినువాడైన హెబెరు కుటుంబానికి స్నేహం ఉండేది.

[18] యాయేల్ సీసెరాను కలుసుకోవడానికి బయటికి వచ్చి “మా యజమానీ! లోపలికి దయచేయండి! భయపడకండి” అంది. అతడప్పుడు ఆమెతో డేరా లోపలికి వెళ్ళాడు. ఆమె అతడికి ఒక దుప్పటి కప్పింది.

[19] “నాకు దప్పికవుతుంది. దయచేసి తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా?” అని అతడు ఆమెను అడిగాడు. ఆమె పాల తిత్తిని విప్పి త్రాగడానికి ఇచ్చి, మళ్ళీ దుప్పటి కప్పింది.

[20] అప్పుడతడు ఆమెతో ఇలా అన్నాడు: “డేరా ముందు తలుపు దగ్గర నిలబడివుండు. ఎవరైనా వచ్చి ‘ఇక్కడ ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు”.

[21] అతడు అలసిపోయి బాగా నిద్రపోయాడు. అప్పుడు హెబెరు భార్య యాయేల్ డేరా మేకు ఒక దానిని, సుత్తెను చేతపట్టుకొని, మెల్లగా అతడి దగ్గరికి వెళ్ళింది. ఆ మేకును అతడి కణతలలోనుంచి నేలలోకి దిగగొట్టింది. దానితో అతడు చచ్చాడు.

[22] బారాకు సీసెరాను తరుముకొంటూ వచ్చాడు. యాయేల్ బారాకును కలుసుకోవడానికి బయటికి వచ్చి, “రండి! మీరు వెదకుతున్నవాణ్ణి మీకు చూపిస్తాను” అంది. అతడు ఆమెతో లోపలికి వెళ్ళాడు. అక్కడ సీసెరా చచ్చి పడి ఉండడం కనిపించింది. అతడి కణతల్లో డేరా మేకు ఉంది.

[23] ఆ రోజున యెహోవా ఇస్రాయేల్‌ప్రజల ముందు కనానుజాతివాళ్ళ రాజు యాబీనును అణగద్రొక్కాడు.

[24] కనానుజాతివాళ్ళ రాజైన యాబీనును నాశనం చేసేవరకు ఇస్రాయేల్‌ప్రజల బలం అతడికి వ్యతిరేకంగా ఎక్కువవుతూ వచ్చింది.

న్యాయాధిపతులు — Chapters