Skip to content
Opens in a new window

[1] కొన్ని రోజులైన తరువాత, గోధుమ కోతకాలంలో సమ్సోను ఒక మేకపిల్లను తీసుకొని భార్యను చూద్దామని వెళ్ళాడు. అక్కడ “నా భార్య దగ్గరికి లోపలికి వెళ్తాను” అన్నాడు. కాని, ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.

[2] “మీరు నిజంగా ఆమెను పూర్తిగా అసహ్యించుకొన్నారు అనుకొని నేను ఆమెను మీ స్నేహితుడికి ఇచ్చేశాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందమైనది గదా! ఆమెకు బదులు ఈమెను తీసుకోండి” అని ఆమె తండ్రి చెప్పాడు.

[3] అప్పుడు వాళ్ళతో సమ్సోను “నేనీసారి ఫిలిష్తీయవాళ్ళకు ఏం కీడు చేసినా తప్పు ఉండదు” అన్నాడు.

[4] సమ్సోను బయటికి వెళ్ళి మూడు వందల నక్కలను పట్టుకొన్నాడు. వాటిని జతజతలుగా చేసి వాటి తోకకు తోకను ముడివేసి కాగడాలు తెచ్చి, ఆ రెండు తోకల మధ్యన ఒక్కో కాగడా కట్టాడు.

[5] అప్పుడు కాగడాలు వెలిగించి ఫిలిష్తీయ వాళ్ళ గోధుమ పంటచేలలోకి ఆ నక్కలను వదిలాడు. ఆ విధంగా పనలను, పైరును, ద్రాక్షతోటలను ఆలీవ్‌చెట్ల తోటలను తగలబెట్టాడు.

[6] ఫిలిష్తీయవాళ్ళు “ఎవడురా ఇలా చేసినది? అని అడిగితే, ఎవరో ‘తిమ్నాతువాడి అల్లుడు సమ్సోను’. ఎందుకంటే, అతడి భార్యను అతడి స్నేహితుడికి ఇచ్చారు” అని తెలియజేశారు. అందుచేత ఫిలిష్తీయవాళ్ళు వెళ్ళి ఆమెను, ఆమె తండ్రిని నిప్పంటించి తగలబెట్టారు.

[7] “మీరిలా చేశారు గనుక మీమీద పగతీర్చుకొనేదాకా నేను ఆగను” అని సమ్సోను వాళ్ళతో అన్నాడు.

[8] వెంటనే అతడు వాళ్ళపై విరుచుకుపడి భయంకరంగా వాళ్ళను చాలమందిని హతమార్చాడు. తరువాత అతడు వెళ్ళిపోయి ‘ఏతాం’ బండ గుహలో ఉండిపోయాడు.

[9] అప్పుడు ఫిలిష్తీయవాళ్ళు బయలుదేరి యూదా ప్రదేశంలో లేహీ దగ్గర వ్యాపించి మకాం చేశారు.

[10] “మీరు మా మీదికి దండెత్తి వచ్చారెందుకు?” అని యూదావారు అడిగారు. “మేం సమ్సోనును బంధించి, అతడు మాకు ఎలా చేశాడో మేమూ అతడికి అలాగే చేద్దామని వచ్చాం” అని ఫిలిష్తీయ వాళ్ళు జవాబిచ్చారు.

[11] అప్పుడు మూడు వేలమంది యూదావారు ఏతాం బండ గుహకు వెళ్ళి, సమ్సోనుతో ఇలా అన్నారు: “ఫిలిష్తీయవాళ్ళు మనమీద అధికారులని మీకు తెలీదా? మరి మీరు మా మీదికి ఏం తెచ్చి పెట్టారు?” అందుకతడు “వాళ్ళు నాకెలా చేశారో నేనూ వాళ్ళకలా చేశాను అంతే” అన్నాడు.

[12] “మిమ్మల్ని కట్టి ఫిలిష్తీయవాళ్ళకు అప్పగించడానికి మేం వచ్చాం” అని వారు అతనితో చెప్పారు. సమ్సోను “మీరు మాత్రం నన్ను చంపమని నాకు శపథం చేయండి” అన్నాడు.

[13] వారు “సరే, నిన్ను గట్టిగా బంధించి వాళ్ళకు అప్పగిస్తాం గాని, చంపము” అని జవాబిచ్చారు. అప్పుడు వారు అతణ్ణి రెండు క్రొత్త త్రాళ్ళతో బంధించి బండ దగ్గరనుంచి తీసుకువచ్చారు.

[14] అతడు లేహీ సమీపంగా వచ్చేటప్పటికీ ఫిలిష్తీయవాళ్ళు కేకలు వేస్తూ అతడి దగ్గరికి వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతణ్ణి ఆవరించాడు. అతని చేతులకు ఉన్న త్రాళ్ళు కాలిపోయిన నారలాగా అయి పొయ్యాయి. అతని చేతుల మీదనుంచి కట్లు ఊడిపొయ్యాయి.

[15] అక్కడ అతనికి గాడిద దవడ ఎముక పచ్చిది ఒకటి దొరికింది. అతడు దానిని చేతపట్టుకొని దానితో వెయ్యిమందిని హతమార్చాడు.

[16] అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “గాడిద దవడ ఎముకతో వాళ్ళను కుప్పలుగా కూల్చాను. గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపాను.”

[17] అతడు అలా చెప్పి చేతిలో ఉన్న దవడ ఎముకను అవతల పారవేశాడు. ఆ స్థలానికి ‘రామాత్‌లేహి’ అని పేరు పెట్టాడు.

[18] అప్పుడు అతనికి బాగా దప్పికయింది. “నీ సేవకుడైన నా చేతితో ఈ గొప్ప విడుదల ప్రసాదించావు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతి పొందనివాళ్ళ చేతులకు చిక్కుపడాలా?” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.

[19] అప్పుడు దేవుడు లేహిలో పల్లంగా ఉన్న స్థలాన్ని చీల్చాడు. దానిలోనుంచి నీళ్ళు వచ్చాయి. సమ్సోను త్రాగి నప్పుడు అతనికి ప్రాణం తెప్పరిల్లింది, బలం వచ్చింది. అందుచేత దానికి ‘ఏన్‌హక్కోరె’ అని పేరు వచ్చింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.

[20] ఫిలిష్తీయవాళ్ళ రోజులలో సమ్సోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు.

న్యాయాధిపతులు — Chapters