[1] ఆ రోజున దెబోరా, అబీనోయం కొడుకు బారాకు ఈ పాట పాడారు:
[2] “ఇస్రాయేల్‌లో నాయకులు యుద్ధానికి సంసిద్ధులయ్యారు. ప్రజలు స్వేచ్ఛగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించండి!
[3] రాజులారా, వినండి! పరిపాలకులారా, ఆలకించండి! నేను యెహోవాకు పాడుతాను. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాను సంకీర్తనం చేస్తాను.
[4] యెహోవా! నీవు శేయీరు పర్వతంనుంచి బయలుదేరితే, ఎదోం ప్రాంతం నుంచి నీవు తరలివచ్చినప్పుడు, భూమి కంపించింది. ఆకాశాలు నీళ్ళను కుమ్మరించాయి, మేఘాలు వర్షించాయి.
[5] యెహోవా ఎదుట పర్వతాలు నీరుగారిపోయాయి. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఎదుట ఈ సీనాయి నీరుగారిపోయింది.
[6] అనాతు కొడుకు షమ్గరు రోజుల్లో, యాయేల్ రోజుల్లో రహదారులు నిర్మానుష్యం అయ్యాయి. బాటసారులు ప్రక్కదారులు పట్టి చుట్టు తిరిగి పోయారు.
[7] ఇస్రాయేల్‌లో అధిపతులు లేకపోయారు. దెబోరా అనే నేను బయలుదేరేదాకా, ఇస్రాయేల్‌లో నేను మాతృమూర్తిగా వచ్చేదాకా, అంతా అలాగే ఉండిపోయింది.
[8] ఇస్రాయేల్‌ప్రజలు కొత్త దేవుళ్ళను కోరుకొన్నప్పుడు, యుద్ధం నగర ద్వారాలకు వచ్చింది. ఇస్రాయేల్‌లో నలభై వేలమంది దగ్గర ఒక్క డాలు గానీ ఈటె గానీ కనిపించలేదు.
[9] ఇస్రాయేల్‌ప్రజల నాయకులంటే, స్వేచ్ఛగా ముందుకు వచ్చిన ప్రజలంటే, నాకు ఎంతో అభిమానం. యెహోవాను స్తుతించండి!
[10] తెల్ల గాడిదలమీద స్వారీ చేసేవారలారా! జీనుమీద కూచునివున్నవారలారా! దారిన పయనించే వారలారా! మీరంతా పాడండి!
[11] నీళ్ళు చేదుకొనే స్థలాలలో విలుకాండ్రు చేసే గానం వినండి. యెహోవా ధర్మకార్యాలను ఇస్రాయేల్ పల్లెటూళ్ళవారికోసం యెహోవా జరిగించే ధర్మకార్యాలను వారు ప్రకటిస్తున్నారు. యెహోవా ప్రజ అప్పుడు నగర ద్వారాలకు వెళ్ళారు.
[12] మేల్కో! మేల్కో! దెబోరా! మేల్కో! మేల్కో! ఓ పాట పాడు! బారాకు! లే! అబీనోయం కుమారా! నీ బందీలను వశం చేసుకో!
[13] మిగిలిన ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చారు. యుద్ధశూరులలాగా యెహోవా ప్రజ నా దగ్గరికి వచ్చారు.
[14] అమాలేకువాళ్ళమధ్య ఉంటున్న ఎఫ్రాయింవారు వచ్చారు. నిన్ను అనుసరించిన ప్రజలలో బెన్యామీనువారు ఉన్నారు. మాకీరునుంచి సైన్యాధిపతులు, జెబూలూనునుంచి నాయకత్వం వహించేవారు వచ్చారు.
[15] ఇశ్శాకారువారి నాయకులు దెబోరాకు తోడుగా ఉన్నారు. ఇశ్శాకారువారు బారాకుతో అతని వెనకాలే లోయలోకి పరుగెత్తిపోయారు. రూబేను ప్రదేశం కాలువల దగ్గర హృదయాలలో గొప్ప పరీక్షలు కలిగాయి.
[16] మందల చప్పుడు వినడానికి మీరు గొర్రెల దొడ్లలో ఎందుకు ఉండిపోయారు? రూబేను ప్రదేశం కాలువల దగ్గర గొప్ప హృదయ పరిశీలన జరిగింది.
[17] గిలాదువారు యొర్దాను ఆవల ఉండిపోయారు. దానువారు ఎందుకు ఓడల్లో ఆగిపోయినట్టు? ఆషేరువారు సముద్రం ఒడ్డున, తమ రేవుల దగ్గర ఉండిపోయారు.
[18] అయితే జెబూలూనువారు ప్రాణాలకు తెగించారు. మెట్ట భూములమీద నఫ్తాలివారు కూడా అలాగే చేశారు.
[19] వచ్చారు రాజులు. యుద్ధం జరిగించారు. కనాను రాజులు తానాకులో మెగిద్దో నీళ్ళ దగ్గర యుద్ధం చేశారు. కానీ, వాళ్ళు వెండిని దోచుకోలేకపోయారు.
[20] ఆకాశాలనుంచి పోరాడాయి నక్షత్రాలు. వాటి త్రోవలలో అవి పోతూనే పోరాడాయి సీసెరాతో.
[21] కీషోను ఏరు, ఆ పురాతన ఏరు కీషోను వాళ్ళను కొట్టుకుపోయింది. నా ప్రాణమా! బలం పుంజుకొని ముందుకు సాగు.
[22] అప్పుడు గుర్రాలు కదం త్రొక్కాయి. అతడి బలమైన గుర్రాలు వేగంగా ఎగసిపోయాయి.
[23] యెహోవా దూత ‘మేరోజును శపించు’ అన్నాడు, ‘దాని కాపురస్తులను బాగా శపించు. ఎందుకని? యెహోవాకు సహాయం రాలేదు వాళ్ళు, బలాఢ్యులను ఎదిరించడానికి యెహోవాకు సహాయం రాలేదు.’
[24] స్త్రీలందరిలో యాయేల్ ధన్యజీవి. కేయీనువాడైన హెబెరు భార్య ఆమె. డేరాలలో కాపురం ఉంటున్న స్త్రీలందరిలో ఆమె ధన్యజీవి.
[25] అతడు నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. నాయకులకు తగిన పాత్రలో మీగడ తెచ్చి ఇచ్చిందామె.
[26] డేరా మేకును చేతపట్టుకొంది. పనివాడి సుత్తెను కుడిచేత్తో పట్టుకొంది. సీసెరాను కొట్టిందామె. వాడి తలను చితగ్గొట్టింది. వాడి కణత చీల్చి చెండాడింది.
[27] ఆమె కాళ్ళదగ్గర వాడు వంగాడు, కూలాడు. అక్కడ పడివున్నాడు. ఆమె కాళ్ళదగ్గర వాడు వంగి కూలిపోయాడు. వంగి కూలిన దగ్గరే ప్రాణం విడిచాడు.
[28] సీసెరా తల్లి కిటికీలో నుంచి చూచింది. అల్లికలో నుంచి చూస్తూ ఇలా కేక వేసింది: ‘ఇంత సేపున్నదేం ఇతడి రథం? ఇతడి రథాల చప్పుడు ఇంత సేపు వినబడలేదేం?’
[29] ఆమె దగ్గర తెలివైన రాకుమార్తెలు ఆమెకు బదులు చెప్పారు– తన మాటలు తనే నెమరు వేసుకొంది–
[30] ‘వాళ్ళకు దోపిడీ దొరికింది గదా! పంచుకొంటున్నారు గదా! ఒక్కో సైనికుడికి ఒకరిద్దరు పడుచులు దొరికివుండాలి. రంగురంగుల బట్టలు సీసెరాకోసం దోచుకొంటూ ఉండాలి. బుట్టాలు వేసిన రంగురంగుల బట్టలు అతడికోసం! దోచుకొన్న వాళ్ళ మెడలకోసం, విచిత్రంగా బుట్టాలు వేసిన రంగురంగుల బట్టలు దొరికివుంటాయి!’
[31] యెహోవా, ఆ విధంగానే నీ శత్రువులంతా అంతం అవుతారు గాక! కానీ, నిన్ను ప్రేమించేవారు బలంతో ఎగసివచ్చే ప్రొద్దులాగా ఉంటారు గాక!” ఆ తరువాత నలభైయేళ్ళు దేశం ప్రశాంతంగా ఉంది.