Skip to content
Opens in a new window

[1] యెహోవా దూత గిల్గాల్ నుంచి బోకీంకు వచ్చి ఇలా అన్నాడు: “నేను మిమ్ములను ఈజిప్ట్ నుంచి తీసుకు వచ్చాను. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఈ దేశానికి మిమ్ములను చేర్చాను. నేను మీతో చేసిన ఒడంబడిక ఎన్నడూ మీరనని,

[2] మీరు ఈ దేశస్తులతో ఏ విధమైన ఒడంబడికా చేసుకోకూడదని, వారి బలిపీఠాలను పడగొట్టాలని మీతో చెప్పాను. అయినా మీరు నా మాట లెక్కచెయ్యలేదు. మీరు అలా ఎందుకు ప్రవర్తించారు?

[3] కనుక నేను వాళ్ళను మీ ఎదుటనుంచి వెళ్లగొట్టనని, వాళ్ళు మీ ప్రక్కలో బల్లేలుగా ఉంటారని, వాళ్ళ దేవుళ్ళు మీకు ఉచ్చుగా ఉంటారని ఇప్పుడు చెపుతున్నాను”.

[4] ఇస్రాయేల్ ప్రజలందరితో యెహోవా దూత ఈ మాటలు చెప్పినప్పుడు వారు బోరున ఏడ్చారు.

[5] అందుకే ఆ స్థలాన్ని వారు ‘బోకీం’ అన్నారు. అక్కడ వారు యెహోవాకు బలులర్పించారు.

[6] యెహోషువ ప్రజలను పంపివేసిన తరువాత, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారి వారి వారసత్వం భూములకు వారు వెళ్ళారు.

[7] యెహోషువ బ్రతికినన్నాళ్ళూ ఇస్రాయేల్ ప్రజకోసం యెహోవా చేసిన గొప్ప పనులు చూచి, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన పెద్దల జీవిత కాలంలోనూ ప్రజలు యెహోవాను సేవించారు.

[8] నూను కొడుకూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ తన నూట పదో ఏట చనిపోయాడు.

[9] వారు అతణ్ణి అతడి వారసత్వ భూమిలో తిమ్నత్‌సెరహులో సమాధి చేశారు. అది ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.

[10] ఆ తరం వారంతా వారి పూర్వీకుల దగ్గరికి చేరారు. ఆ తరువాత తరంవారు యెహోవాను తెలుసుకొన్నవారు కాదు. ఆయన ఇస్రాయేల్‌ప్రజ కోసం చేసిన చర్యలు కూడా తెలిసినవారు కాదు.

[11] అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి బయల్‌దేవుళ్ళను పూజించారు.

[12] ఈజిప్ట్‌నుంచి తమ పూర్వీకులను తీసుకువచ్చిన తమ పూర్వీకుల దేవుడు యెహోవాను విడిచిపెట్టారు. వారి చుట్టూరా ఉన్న జనాలు వేరు వేరు దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, యెహోవాకు కోపం రేపారు.

[13] వారు యెహోవాను విడిచిపెట్టి బయల్‌దేవుణ్ణి అష్తారోతుదేవిని కొలిచినందుచేత

[14] ఇస్రాయేల్ ప్రజల మీద యెహోవా కోపంతో మండిపడ్డాడు, వారిని దోపిడీదారుల గుంపుల వశం చేశాడు. వాళ్లు ఇస్రాయేల్ ప్రజలను దోచుకొన్నారు. యెహోవా వారిని తమ చుట్టూ ఉన్న శత్రువుల వశం చేశాడు. వారి పగవారి ముందు వారు నిలవలేకపోయారు.

[15] వారెక్కడికి వెళ్ళినా పూర్వం తాను వారికి శపథం చేసి చెప్పినట్టే యెహోవా హస్తం వారికి వ్యతిరేకం అయి వారికి అపజయం కలిగించింది. అందువల్ల వారు చాలా కష్టాలు అనుభవించారు.

[16] అప్పుడు యెహోవా నాయకులను లేపాడు. వారు దోపిడీదారుల బారినుంచి వారిని రక్షించారు.

[17] అయినా వారు తమ నాయకుల మాట వినలేదు. వారు ఇతర దేవుళ్ళకు నమస్కారం చేసి వేశ్యలలాగా ప్రవర్తించారు. వారు తమ పూర్వీకుల మాదిరిని అనుసరించ లేదు. వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు లోబడి బ్రతికిన మార్గం నుంచి వారు త్వరలోనే తొలగిపోయారు.

[18] వారి కోసం యెహోవా నాయకుణ్ణి లేపినప్పుడెల్లా ఆ నాయకుడితో యెహోవా ఉండేవాడు. ఆ నాయకుడు బ్రతికినన్నాళ్ళు శత్రువుల చేతులనుంచి ఆయన వారిని రక్షించాడు. ఎందుకంటే వారిని అణగద్రొక్కి బాధిస్తూ ఉన్న వాళ్ళవల్ల వారు మూలుగుతూ ఉంటే ఆయన జాలిపడేవాడు.

[19] కానీ, ఆ నాయకుడు చనిపోయాక వారు యెహోవా నుంచి తొలగి పోయి, తమ పూర్వీకులకంటే ఎక్కువ చెడ్డగా ప్రవర్తించేవారు. ఇతర దేవుళ్ళను అనుసరించి, సేవించి, పూజించేవారు. వారలా తమ దురాచారాలను గానీ, మూర్ఖత్వాన్ని గానీ విడిచిపెట్టలేదు.

[20] అందుచేత ఇస్రాయేల్‌ప్రజ మీద యెహోవా తీవ్ర కోపంతో మండిపడి ఇలా అన్నాడు: “ఈ ప్రజ వీరి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడిక మీరి, నా మాట వినలేదు.

[21] గనుక యెహోషువ చనిపోయినప్పుడు ఈ దేశంలో మిగిలిన జనాలలో ఏ జనాన్నీ వారి ముందునుంచి నేనిక తోలివేయను.

[22] ఇస్రాయేల్‌వారు వారి పూర్వీకులు నడిచినట్టు యెహోవా మార్గంలో నడుస్తారో లేదో ఆ జనాల ద్వారా పరీక్షించి చూస్తాను.”

[23] అంతకు ముందు యెహోవా ఆ జనాలను యెహోషువ వశం చేయక వెంటనే వెళ్ళగొట్టక వాటిని ఉండనిచ్చాడు.

న్యాయాధిపతులు — Chapters