[1] అబీమెలెకు తరువాత ఇస్రాయేల్‌వారిని విడిపించడానికి ఇశ్శాకారుగోత్రంవాడూ దోదో మనుమడూ పూవ కొడుకూ అయిన తోలా బయలుదేరాడు. అతడు ఎఫ్రాయిం కొండప్రాంతంలో షామీరులో ఉండేవాడు.
[2] అతడు ఇస్రాయేల్ వారికి ఇరవైమూడు సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు. ఆ తరువాత అతడు చనిపోయాడు. వారతణ్ణి షామీరులో పాతిపెట్టారు.
[3] అతని తరువాత గిలాదువాడైన యాయీరు బయలు దేరాడు. అతడు ఇస్రాయేల్‌వారికి ఇరవై రెండు సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు.
[4] అతనికి ముప్ఫయి మంది కొడుకులు ఉండేవారు. వారు ముప్ఫయి గాడిదలమీద స్వారీ చేసేవారు. గిలాదు ప్రదేశంలో వారికి ముప్ఫయి ఊళ్ళు ఉండేవి. ఈనాటికీ వాటిని ‘హవోత్ యాయీరు’ అని పిలుస్తారు.
[5] యాయీరు చనిపోయాడు. వారతణ్ణి కామోనులో పాతిపెట్టారు.
[6] ఇస్రాయేల్‌ప్రజ దేవుని దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. వారు బయల్‌దేవుణ్ణి, అష్తారోతు దేవిని, సిరియావాళ్ళ దేవుళ్ళను, సీదోనువాళ్ళ దేవుళ్ళను, మోయాబువాళ్ళ దేవుళ్ళను, అమ్మోనువాళ్ళ దేవుళ్ళను ఫిలిష్తీయవాళ్ళ దేవుళ్ళను సేవించారు. వారు యెహోవాను విసర్జించి, ఆయనను సేవించకుండా ఉన్నారు.
[7] ఇస్రాయేల్ ప్రజమీద యెహోవా కోపంతో మండిపడ్డాడు. ఆయన వారిని ఫిలిష్తీయవాళ్ళ చేతికి, అమ్మోనువాళ్ళ చేతికి అప్పగించాడు.
[8] ఆ సంవత్సరం ఆ జనాలు వారిని చితగొట్టి అణచివేశాయి. అమోరీవాళ్ళ దేశంలో, యొర్దానుకు అవతల ఉన్న గిలాదు ప్రదేశంలో ఉన్న ఇస్రాయేల్‌వారందరినీ వాళ్ళు అలా పద్ధెనిమిది ఏళ్ళు అణచివేశారు.
[9] అంతేగాక, అమ్మోనువాళ్ళు యొర్దాను దాటి యూదావారి మీద, బెన్యామీనువారి మీద, ఎఫ్రాయిం వంశంవారి మీద యుద్ధం చేశారు. ఇస్రాయేల్ వారికి చాలా ఆపద కలిగింది.
[10] అప్పుడు “మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం. మా దేవుణ్ణి వదిలివేసి బయల్ దేవుళ్ళను సేవించాం” అంటూ ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టుకున్నారు.
[11] అప్పుడు యెహోవా ఇస్రాయేల్‌ప్రజతో ఇలా చెప్పాడు: “ఈజిప్ట్‌వాళ్ళ నుంచి అమోరీ, అమ్మోను, ఫిలిష్తీయ జాతుల వాళ్ళనుంచి నేను మిమ్ములను విడిపించాను గదా.
[12] సీదోనువాళ్ళు అమాలేకువాళ్ళు, మాయోనువాళ్ళు మిమ్ములను బాధించి నప్పుడు మీరు నాకు మొరపెట్టుకొంటే వాళ్ళ చేతులనుంచి మిమ్ములను విడిపించాను గదా.
[13] అయితే మీరు నన్ను వదిలిపెట్టి ఇతర దేవుళ్ళను సేవించారు, గనుక ఇప్పటినుంచి నేను మిమ్ములను విడిపించను.
[14] మీరు ఎన్నుకొన్న దేవుళ్ళకు మొరపెట్టుకోండి. మీ ఆపదలోనుంచి వాళ్ళనే మిమ్ములను విడిపించమనండి.”
[15] అప్పుడు ఇస్రాయేల్‌ప్రజ “మేము పాపం చేశాం. నీకు ఏది మంచిదని తోస్తే అలా మాకు చెయ్యి. గానీ, ఇప్పుడు మమ్ములను మాత్రం విడిపించు” అని యెహోవాతో చెప్పారు.
[16] వారు వారి దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించడం మొదలు పెట్టారు. ఇస్రాయేల్‌వారి దురవస్థను చూచి ఆయన సహించలేకపొయ్యాడు.
[17] అప్పుడు అమ్మోనువాళ్ళు సమకూడి గిలాదులో మకాం చేశారు. ఇస్రాయేల్‌వారు సమకూడి మిస్పాలో మకాం చేశారు.
[18] గిలాదు ప్రజల నాయకులు “అమ్మోనువాళ్ళతో ముందుగా ఎవడు యుద్ధానికి వెళ్తాడో అతడే గిలాదు నివాసులందరికీ నాయకుడు అవుతాడు” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.