Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్‌ప్రజలకూ కనాను జనాలకూ జరిగిన యుద్ధాలలో దేనినీ అనుభవించని ఇస్రాయేల్‌వారందరినీ పరీక్ష చేయాలని యెహోవా కొన్ని జనాలను ఉండనిచ్చాడు.

[2] మునుపు ఆ యుద్ధాలను అనుభవించని ఇస్రాయేల్ తరాలకు యుద్ధం నేర్పడానికే ఆయన అలా చేశాడు.

[3] ఆయన ఉండనిచ్చిన జనాలేవంటే: ఫిలిష్తీయవాళ్ళలో అయిదుగురు నాయకులు, బయల్‌హర్మోను పర్వతం నుంచి లెబోహెమతు దాకా లెబానోను పర్వతప్రదేశంలో ఉన్న కనానుజాతివాళ్ళంతా, సీదోనువాళ్ళంతా, హివ్వి జాతివాళ్ళంతా.

[4] యెహోవా ఇస్రాయేల్‌వారి పూర్వీకులకు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ఇస్రాయేల్‌ప్రజ పాటిస్తారో లేదో వారిని పరీక్షించి చూడడానికి యెహోవా ఆ జనాలను ఉండనిచ్చాడు.

[5] కనాను, హిత్తి, అమోరీ, పెరిజ్జి, హివ్వి, యెబూసి – ఈ జాతుల మధ్య ఇస్రాయేల్ ప్రజలు కాపురం ఉన్నారు.

[6] వాళ్ళ కూతుళ్ళను పెళ్ళిచేసుకొన్నారు, తమ కూతుళ్ళను వాళ్ళ కొడుకులకు ఇచ్చారు. వాళ్ళ దేవుళ్ళను కొలిచారు.

[7] ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ దేవుడు యెహోవాను మరచిపోయి, బయల్ దేవుళ్ళనూ అషేరాదేవి స్తంభాలనూ పూజించారు.

[8] అందుకని ఇస్రాయేల్ ప్రజమీద యెహోవాకు తీవ్ర కోపం వచ్చింది. ఆయన వారిని అరాంనహరాయిం రాజైన కూషన్‌రిషాతాయిం వశం చేశాడు. కూషన్‌రిషాతాయింకు ఇస్రాయేల్‌ప్రజ ఎనిమిదేళ్ళు సేవ చేయవలసి వచ్చింది.

[9] ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా వారిని విడిపించడానికి ఒక మనిషిని బయలుదేరేలా చేశాడు. అతడు కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒతనీయేల్. అతడు వారిని విడిపించాడు.

[10] యెహోవా ఆత్మ అతణ్ణి ఆవరించాడు గనుక, అతడు ఇస్రాయేల్‌ప్రజకు నాయకుడు అయి యుద్ధానికి వెళ్ళాడు. అరాందేశం రాజైన కూషన్‌రిషాతాయింను యెహోవా ఒతనీయేల్ వశం చేశాడు. అతడు కూషన్‌రిషాతాయిం మీద విజయం సాధించాడు.

[11] ఆ తరువాత కనజు కొడుకు ఒతనీయేల్ చనిపోయేవరకు నలభై ఏళ్ళు దేశం ప్రశాంతంగా ఉంది.

[12] ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. వారలా చెడ్డగా ప్రవర్తించినందుచేత యెహోవా మోయాబుదేశం రాజు ఎగ్లోను వారిని జయించేలా అతణ్ణి బలపరచాడు.

[13] అతడు అమ్మోనువాళ్ళను, అమాలేకు వాళ్ళను కూడగట్టుకొని వెళ్ళి, ఇస్రాయేల్‌ప్రజను ఓడించి ‘ఖర్జూర పట్టణం’ స్వాధీనం చేసుకొన్నాడు.

[14] మోయాబుదేశం రాజు ఎగ్లోనుకు ఇస్రాయేల్‌ప్రజ పద్దెనిమిదేళ్ళు సేవ చేయవలసి వచ్చింది.

[15] ఇస్రాయేల్ ప్రజ యెహోవాకు మళ్ళీ మొరపెట్టారు. యెహోవా వారిని విడిపించడానికి మరొకరిని ఇచ్చాడు. అతడు బెన్యామీను గోత్రంవాడైన గెరా కొడుకు ఏహూదు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. ఇస్రాయేల్ ప్రజ అతణ్ణి కప్పంతో మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి పంపించారు.

[16] ఏహూదు రెండంచుల కత్తిని ఒక దానిని చేయించుకొన్నాడు. దాని పొడుగు ఒక మూర. దానిని బట్టల చాటున కుడిప్రక్క కట్టుకొన్నాడు.

[17] అతడు మోయాబు రాజు ఎగ్లోను దగ్గరికి ఆ కప్పం తెచ్చాడు. ఎగ్లోను చాలా లావైన మనిషి.

[18] ఏహూదు కప్పం ఇచ్చిన తరువాత దానిని మోసుకువచ్చిన వాళ్ళను పంపివేశాడు.

[19] గిల్గాల్‌లో ఉన్న విగ్రహాల దగ్గరనుంచి ఏహూదు ఎగ్లోను దగ్గరికి తిరిగి వెళ్ళి “రాజా! నేను నీతో ఓ మాట రహస్యంగా చెప్పాలి” అన్నాడు. రాజు “ఊరుకోండి” అనడంతో అతడి పరిచారకులంతా బయటికి వెళ్ళారు.

[20] అతడు తన శీతల మేడగదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతణ్ణి సమీపించి “నేను దేవునినుంచి నీకో కబురు తెచ్చాను” అన్నాడు. రాజు తన పీఠంమీదనుంచి లేచాడు.

[21] వెంటనే ఏహూదు తన ఎడమచేతిని తన మొల కుడిప్రక్కగా పోనిచ్చి, కత్తి లాగి, రాజు కడుపులో పొడిచాడు.

[22] కత్తితో పాటు పిడి కూడా అతడి కడుపులోకి దూరిపోయింది. ఏహూదు దానిని బయటికి లాగలేదు. క్రొవ్వు దానిమీద కప్పుకొంది.

[23] ఏహూదు వసారాలోకి వచ్చి, తన వెనుక ఆ మేడ గది తలుపులు మూసి తాళం వేశాడు.

[24] అతడు వెళ్ళిపోయాక రాజ సేవకులు వచ్చి, మేడగది తలుపులు తాళం వేసి ఉండడం చూశారు. అతడు లోపలికి మరుగుదొడ్డికి పోయాడనుకొన్నారు.

[25] వాళ్ళు తత్తరపాటు పడేవరకు చూస్తూ ఉన్నారు గాని, అతడు గది తలుపులు తెరవలేదు. చివరికి వాళ్ళు తాళం చెవి తెచ్చి తెరిచారు. తమ యజమాని చచ్చి నేలమీద పడి ఉండడం వాళ్ళకు కనిపించింది.

[26] వాళ్ళు అలా చూస్తూ ఉండే సమయంలో ఏహూదు తప్పించుకొని ఆ విగ్రహాలను దాటి శెయీరుకు పారిపోయాడు.

[27] అతడు అక్కడ చేరి ఎఫ్రాయిం కొండప్రాంతంలో బూర ఊదాడు. ఆ కొండప్రాంతంనుంచి ఇస్రాయేల్‌ప్రజ అతనితో దిగివచ్చారు. అతడు వారిముందు నడిచాడు.

[28] “మీ శత్రువులైన మోయాబువాళ్ళను యెహోవా మీ వశం చేశాడు గనుక, నా వెంటరండి” అని వారితో చెప్పాడు. వారు అతని వెంట వెళ్ళి, మోయాబుదేశానికెదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించి ఎవరినీ నది దాటనియ్యలేదు.

[29] ఆ సమయాన మోయాబువాళ్ళను పది వేలమంది మంచి బలంగల శూరులను వారు హతమార్చారు. ఒక్కడు కూడా తప్పించుకు పోలేకపోయాడు.

[30] ఆ రోజున ఇస్రాయేల్ వారి చేతిక్రింద మోయాబు అణగారిపోయింది. ఇస్రాయేల్‌దేశం ఎనభైయేళ్ళు ప్రశాంతంగా ఉంది.

[31] ఏహూదు తరువాత అనాతు కొడుకు షమ్గరు నాయకుడుగా ఉన్నాడు. అతడు ములుకోలతో ఆరు వందల మంది ఫిలిష్తీయవాళ్ళను హతం చేశాడు. అతడు కూడా ఇస్రాయేల్‌ప్రజను విడిపించాడు.

న్యాయాధిపతులు — Chapters