[1] అప్పుడు ఎఫ్రాయిం గోత్రంవారు సమకూడి, ఉత్తర దిక్కు వెళ్ళి, యెఫ్తాను చూచి, “అమ్మోనువాళ్ళతో యుద్ధం చేయడానికి మమ్మల్ని పిలవకుండా నువ్వెందుకు వెళ్ళావు? ఇప్పుడు నీతో పాటు నీ ఇంటిని కాల్చివేస్తాం” అన్నారు.
[2] అందుకు యెఫ్తా “నేను, నా ప్రజలు అమ్మోనువాళ్ళతో పెద్ద తగాదా పడివున్నాం. నేను మిమ్మల్ని పిలిచానుగాని మీరు వాళ్ళ బారినుంచి నన్ను విడిపించడానికి రాలేదు.
[3] మీరు సహకరించరని నేనే ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోను వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వాళ్ళను నా వశం చేశాడు. కాని, ఈ వేళ నామీదికి మీరు కయ్యానికి రావలసిన అవసరం ఏమిటి?” అని వారితో అన్నాడు.
[4] వెంటనే యెఫ్తా గిలాదు మనుషులందరినీ పిలిపించి ఎఫ్రాయింవారితో యుద్ధం చేశాడు. గిలాదువారు ఎఫ్రాయిం వారిని ఓడించారు. ఎందుకంటే, ఎఫ్రాయింవారు “గిలాదు వాళ్ళలారా! ఎఫ్రాయిం, మనష్షే ప్రదేశాల మధ్య ఉన్నా, మీరు ఎఫ్రాయింవారి దగ్గరనుంచి పరారీ అయిన వాళ్ళే!” అన్నారు.
[5] గిలాదువారు ఎఫ్రాయిం ప్రదేశానికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకొన్నారు. ఎఫ్రాయింవారిలో పారిపోయిన వాడెవడైనా వచ్చి “నన్ను రేవు దాటనియ్యండి” అని అడిగితే గిలాదు మనుషులు “నువ్వు ఎఫ్రాయిం వాడివా?” అని అడిగేవారు. “కాదు” అని అతడంటే,
[6] గిలాదు మనుషులు “సరి, షిబ్బోలెత్ అనే మాట పలుకు” అనేవారు. అతడు ఆ పదం సరిగా పలకలేక ‘సిబ్బోలెత్’ అని పలికితే వారతణ్ణి పట్టుకొని యొర్దాను రేవుల దగ్గరే చంపేవారు. ఆ కాలంలో ఆ విధంగా నలభై రెండు వేలమంది ఎఫ్రాయిం మనుషులు కూలారు.
[7] యెఫ్తా ఆరేళ్ళు ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉన్నాడు. తర్వాత గిలాదువాడైన యెఫ్తా చనిపోయాడు. గిలాదులో ఒక పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు.
[8] అతని తరువాత బేత్‌లెహేం గ్రామవాసి ఇబ్సాను ఇస్రాయేల్‌వారికి నాయకుడు అయ్యాడు.
[9] అతనికి ముప్ఫయి మంది కొడుకులు ముప్ఫయిమంది కూతుళ్ళు ఉన్నారు. అతడు తన కూతుళ్ళకు పరాయి వంశంనుంచి పెండ్లి సంబంధాలు అందుకొన్నాడు. తన కొడుకులకు కూడా ముప్ఫయిమంది కోడళ్ళను పరాయి వంశంనుంచే తెచ్చుకొన్నాడు. ఇబ్సాను ఏడేళ్ళు ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉన్నాడు.
[10] ఆ తరువాత ఇబ్సాను చనిపోయాడు. అతణ్ణి బేత్‌లెహేంలో పాతిపెట్టారు.
[11] అతని తరువాత జెబూలూను గోత్రంవాడైన ఏలోను ఇస్రాయేల్ ప్రజకు పది సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు.
[12] అప్పుడు జెబూలూనువాడైన ఏలోను చనిపోయాడు. అతణ్ణి జెబూలూను ప్రదేశంలో అయ్యాలోన్‌లో పాతిపెట్టారు.
[13] అతని తరువాత పిరాతోను గ్రామవాసీ, హిల్లేల్ కొడుకూ అయిన అబ్దోను ఇస్రాయేల్‌వారికి నాయకుడు అయ్యాడు.
[14] అతనికి నలభైమంది కొడుకులు, ముప్ఫయిమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భై గాడిదలమీద స్వారీ చేసేవారు. అతడు ఇస్రాయేల్‌ప్రజకు ఎనిమిది సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు.
[15] అప్పుడు పిరాతోను గ్రామవాసీ హిల్లేల్ కొడుకూ అబ్దోను చనిపోయాడు. అతణ్ణి ఎఫ్రాయిం ప్రదేశంలో పిరాతోనులో పాతిపెట్టారు. అది అమాలేకువాళ్ళ కొండసీమలో ఉంది.