[1] ఒకరోజు సమ్సోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూచి ఆమెతో పోయాడు.
[2] సమ్సోను అక్కడే ఉన్నాడని గాజా పట్టణస్తులకు తెలిసింది. గనుక వాళ్ళు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, పట్టణం ద్వారం దగ్గర రాత్రంతా అతని కోసం కాపలా కాశారు. “తెల్లవారేటప్పుడు అతణ్ణి చంపుదాం” అనుకొని వాళ్ళు రాత్రివేళ కదలకుండా ఉన్నారు.
[3] అయితే సమ్సోను మధ్యరాత్రి వరకే పడుకొన్నాడు. అప్పుడు లేచి, పట్టణం ద్వారం తలుపులను, వాటి రెండు స్తంభాలను పట్టుకొని, వాటిని అడ్డకర్రతోపాటు ఊడబీకి, భుజాలమీద వేసుకొని, హెబ్రోనుకు ఎదురుగా ఉండే కొండ కొనకు వాటిని మోసుకుపోయాడు.
[4] ఆ తరువాత శోరేక్ లోయలో ఉన్న ఒకామెను అతడు ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా.
[5] ఫిలిష్తీయవాళ్ళ నాయకులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు: “నువ్వు అతణ్ణి వలలో వేసుకో. అతడి గొప్ప బలం రహస్యమేమిటో, అతణ్ణి మేము గెలిచి కట్టివేసి లొంగదీసు కోవడానికి ఏం చెయ్యాలో తెలుసుకో. అప్పుడు నీకు మేం ఒక్కొక్కరం పన్నెండు వందల వెండి నాణేలు ఇస్తాం”.
[6] అందుచేత దెలీలా “మీ గొప్ప బలానికి రహస్యం ఏమిటో నాకు చెప్పండి. మిమ్మల్ని కట్టివేసి లొంగదీయడం ఎలా?” అని సమ్సోనును అడిగింది.
[7] దానికి సమ్సోను ఇలా బదులు చెప్పాడు: “ఎన్నడూ ఎండని ఏడు పచ్చి నారలతో నన్ను ఎవరైనా కట్టివేస్తే, నా బలం ఉడిగిపోయి మామూలు మనిషిలాగా అయిపోతాను.”
[8] అప్పుడు ఫిలిష్తీయవాళ్ళ నాయకులు ఎన్నడూ ఎండని ఏడు పచ్చి నారలను తెచ్చారు. ఆమె అతణ్ణి వాటితో కట్టివేసింది.
[9] లోపలి గదిలో మనుషులు దాగి ఉన్నారు. ఆమె “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీమీదికి వచ్చేస్తున్నారు!” అని అరచింది. అయితే మంట దగ్గరికి తెచ్చిన నూలుపోగు తెగిపోయినట్లు అతడు ఆ నారలను తెంపివేశాడు. అందుచేత అతని బలరహస్యం వెల్లడి కాలేదు.
[10] అప్పుడు దెలీలా సమ్సోనుతో ఇలా అంది: “మీరు నన్ను మోసపుచ్చి నవ్వులపాలు చేశారు. ఇప్పుడు చెప్పండి – మిమ్మల్ని బంధించడం ఎలా?”
[11] అందుకు సమ్సోను “ఎన్నడూ వాడని క్రొత్త తాళ్ళతో నన్ను కట్టివేస్తే, నా బలం ఉడిగిపోయి మామూలు మనిషిలాగా అయిపోతాను” అని బదులు చెప్పాడు.
[12] దెలీలా కొత్త త్రాళ్ళు తెచ్చి వాటితో అతణ్ణి కట్టివేసింది. “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీమీదికి వచ్చేస్తున్నారు!” అని అరచింది. వాళ్ళు లోపలి గదిలో దాగి ఉన్నారు. కానీ, అతడు చేతులకున్న ఆ త్రాళ్ళు దారాలలాగా తెంపివేశాడు.
[13] అప్పుడు దెలీలా సమ్సోనుతో ఇలా అంది: “ఇప్పటిదాకా నన్ను మోసపుచ్చి నవ్వులపాలు చేశారు. మిమ్మల్ని బంధించడం ఎలా? చెప్పండి!” అతడు “నా తలవెండ్రుకల ఏడు జడలను మగ్గంలో ఉన్న నేతలాగా అల్లితే, నన్ను బంధించవచ్చు” అని ఆమెతో చెప్పాడు.
[14] అతడు నిద్రపోయినప్పుడు ఆమె అలా చేసి మేకుతో గట్టిగా బిగించింది. “సమ్సోను! మీ మీదికి ఫిలిష్తీయవాళ్ళు వచ్చేస్తున్నారు!” అని మళ్ళీ అరచింది. అతడు నిద్ర మేల్కొని మగ్గం మేకును నేతను ఊడలాగి వేశాడు.
[15] అప్పుడు ఆమె “నన్ను ప్రేమిస్తున్నారంటున్నారు, ఏది? మీకు నామీద మక్కువ లేనేలేదు. మీ గొప్ప బలంయొక్క రహస్యం నాకు చెప్పక ఇప్పటికి మూడు సార్లు నన్ను నవ్వులపాలు చేశారు” అని అతనితో చెప్పింది.
[16] రోజు వెంబడి రోజు ఆమె అతణ్ణి సూటిపోటి మాటలతో పీడిస్తూ వచ్చింది. దానితో విసుగు వచ్చి అతనికి చస్తే బావుండు అనిపించింది.
[17] అందుచేత అతడు ఆమెతో అంతా చెప్పాడు. “నేను పుట్టినప్పటి నుంచి దేవునికి నాజీర్‌గా ప్రత్యేకించబడ్డవాణ్ణి. నా తలమీద ఇంతవరకు ఎన్నడూ మంగలికత్తి పెట్టలేదు. నా తల గొరిగితే నా బలం ఉడిగి పోతుంది. నేను బలహీనమై మామూలు మనిషిలాగా అయిపోతాను” అన్నాడు.
[18] అతడు తనతో అంతా చెప్పాడని దెలీలా గ్రహించింది. వెంటనే ఆమె ఫిలిష్తీయ నాయకులకు ఇలా కబురంపింది. “మళ్ళీ ఒకసారి రండి. అతడు నాకంతా చెప్పాడు”. ఫిలిష్తీయ నాయకులు చెప్పిన ఆ వెండి చేతపట్టుకొని ఆమె దగ్గరికి వచ్చారు.
[19] ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్రపోయేలా చేసి, ఒక మనిషిని పిలిపించి, సమ్సోను తలమీద ఉన్న ఏడు జడలు గొరిగించింది. అప్పుడామె అతణ్ణి బాధించడం మొదలు పెట్టింది. అతని బలం ఉడిగిపోయింది.
[20] “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీ మీదికి వచ్చేస్తున్నారు” అని ఆమె అరచింది. అతడు నిద్ర మేల్కొని “మునుపులాగే బయటికి వెళ్ళి దులుపుకొని విజృంభిస్తాను” అనుకొన్నాడు. యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు.
[21] వెంటనే ఫిలిష్తీయవాళ్ళు అతణ్ణి పట్టుకొన్నారు. అతని కళ్ళు ఊడబీకారు. అతణ్ణి గాజాకు తీసుకుపొయ్యారు. అక్కడ అతణ్ణి కంచు గొలుసులతో కట్టివేసి, ఖైదులో తిరగలి విసిరేవాడుగా చేశారు.
[22] అయితే గొరిగిన అతని తలవెండ్రుకలు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి.
[23] ఫిలిష్తీయ నాయకులు “మన దేవుడు మన శత్రువు సమ్సోనును మన వశం చేశాడు” అని చెప్పి, తమ దేవుడు దాగోనుకు గొప్ప బలి చేయడానికీ, మహోత్సవం జరుపు కోవడానికీ సమకూడారు.
[24] సమ్సోనును చూచి ప్రజలు తమ దేవుళ్ళను ఇలా స్తుతించారు: “మన శత్రువు మన దేశాన్ని పాడు చేసి, మన వారిలో చాలామందిని చంపాడు. ఇప్పుడు మన శత్రువును మన దేవుడు మన వశం చేశాడు.”
[25] వాళ్ళ హృదయాలు సంతోషంతో నిండిపోయి “మన వినోదానికి సమ్సోనును బయటికి తీసుకురండి” అని అరిచారు. అలాగే సమ్సోనును ఖైదునుంచి రప్పించారు. అతడు వాళ్ళ పరిహాసానికి గురి అయ్యాడు. వాళ్ళు అతణ్ణి స్తంభాలమధ్య నిలబెట్టినప్పుడు.
[26] తన చెయ్యి పట్టుకొన్న దాసుడితో సమ్సోను, “గుడికి ఆధారమైన స్తంభాలపై ఆనుకొంటాను. నన్ను వాటిని తాకనియ్యి” అన్నాడు.
[27] గుడి స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయ నాయకులంతా అక్కడ ఉన్నారు. అలా సమ్సోను వాళ్ళ పరిహాసానికి గురి అవుతూ ఉంటే పైకప్పు మీద కూడా దాదాపు మూడు వేలమంది స్త్రీ పురుషులు చూస్తూ ఉన్నారు.
[28] అప్పుడు సమ్సోను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవాప్రభూ! నన్ను తలచుకో! దేవా! దయవుంచి ఈ ఒక్కసారి నన్ను బలపరచు. నా రెండు కండ్లకోసం ఫిలిష్తీయవాళ్ళమీద ఒక్క దెబ్బతో ప్రతీకారం తీర్చుకోనియ్యి.”
[29] అప్పుడు సమ్సోను గుడికి ఆధారమైన రెండు మధ్య స్తంభాలను ఒక దానిని కుడిచేతితో, మరొక దానిని ఎడమ చేతితో పట్టుకొన్నాడు.
[30] సమ్సోను “ఫిలిష్తీయ వాళ్ళతో కూడా నేనూ చస్తాను” అని చెప్పి బలమంతటితో వంగాడు. గుడి ఆ నాయకులమీద, దానిలో వున్న ప్రజలందరిమీదా కూలింది. ఆ విధంగా సమ్సోను బ్రతికి ఉన్నప్పుడు చంపినవాళ్ళకంటే, చనిపోయేటప్పుడు చంపినవాళ్ళు ఎక్కువమంది.
[31] అప్పుడు అతని అన్నదమ్ములు, అతని తండ్రి కుటుంబం వారంతా వచ్చి అతని మృతదేహాన్ని తీసుకుపొయ్యారు. జోర్యాకు ఎష్‌తాయోల్‌కు మధ్య ఉన్న అతని తండ్రి సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. సమ్సోను ఇస్రాయేల్‌ప్రజకు ఇరవై సంవత్సరాలు నాయకుడుగా ఉన్నారు.