Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:06

[1] ఈ మూడోసారి నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం రూఢి కావాలి.

[2] మునుపు నేనొక మాట చెప్పాను. మీమధ్య రెండో సారి ఉన్నట్టు ముందుగా చెపుతున్నాను – ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా రాస్తున్నాను. ఏమంటే, నా ద్వారా క్రీస్తు పలుకుతున్నాడని మీకు రుజువు కావాలి గదా. సరే, ఇదివరకు అపరాధం చేస్తున్నవారితో, తక్కిన వారందరితో నేను అంటున్నాను, నేను తిరిగి వచ్చినప్పుడు మీ పట్ల మృదువుగా ఉండను.

[3] క్రీస్తు మీపట్ల బలహీనుడు కాడు, మీలో బలాఢ్యుడే.

[4] “బలహీనత” కారణంగా ఆయన సిలువ మరణానికి గురి అయ్యాడు, గాని దేవుని బలప్రభావాలను బట్టి జీవిస్తూ ఉన్నాడు. ఆయనతో ఐక్యత కలిగిన మేము కూడా బలహీనులమైనా మీపట్ల ఆయనతోపాటు దేవుని బలప్రభావాలనుబట్టి జీవిస్తాం.

[5] మీరు క్రీస్తు విశ్వాసంలో ఉన్నారో లేరో మిమ్ములను మీరే పరిశోధించుకోండి. మిమ్ములను మీరే పరీక్షించుకొని చూడండి. మీరు ఆ పరీక్షలో ఓడిపోయి నిరాకరణకు గురి కాకపోతే, యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీ గురించి మీకు తెలియదా?

[6] మేము అలాంటి పరీక్షలో ఓడిపోయి నిరాకరణకు గురైనవారం కామని మీరు గుర్తిస్తారని నా ఆశాభావం.

[7] మీరు ఎలాంటి దుర్మార్గతనూ చేయకూడదని దేవునికి ప్రార్థన చేస్తున్నాను – మేము యోగ్యులుగా కనిపించాలని కాదు గాని మేము అయోగ్యులుగా కనిపించినా మీరు మంచినే చేయాలని మా కోరిక.

[8] మేము సత్యంకోసమే గాని సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేము.

[9] మేము బలహీనులమై ఉన్నప్పుడు మీరు బలవంతులై ఉంటే ఆనందిస్తాం. మీరు పరిపూర్ణులు కావాలని కూడా మా ప్రార్థన.

[10] ఈ కారణం చేత నేను మీ మధ్య హాజరు కాకపోయిన ఈ సమయాన ఈ సంగతులు రాస్తున్నాను – మీ దగ్గర ఉన్నప్పుడు, ప్రభువు నాకిచ్చిన అధికారం ప్రయోగించి కాఠిన్యం చూపకూడదని. ఈ అధికారం కట్టడానికే గాని పడద్రోయడానికి కాదు.

[11] తుదకు, సోదరులారా, ఆనందించండి. పరిపూర్ణులు కండి. ఆదరణ పొందండి. ఏక మనస్సుతో ఉండండి. సమాధానంగా బ్రతకండి. అప్పుడు ప్రేమ సమాధానాల దేవుడు మీకు తోడై ఉంటాడు.

[12] పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు అభినందనలు చేసుకోండి.

[13] పవిత్రులందరూ మీకు వందనాలు చెపుతున్నారు.

[14] ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీకందరికీ తోడై ఉంటాయి గాక! తథాస్తు.

2 కొరింతువారికి లేఖ — Chapters