Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:56

[1] గానీ నేను దుఃఖంతో మీ దగ్గరకు తిరిగి రానని నా అంతట నేనే నిశ్చయించుకొన్నాను.

[2] ఎందుకంటే నేను మిమ్ములను దుఃఖపెడితే నాకు సంతోషం కలిగించడానికి నావల్ల దుఃఖపడినవారు తప్ప మరింకెవరు?

[3] నేను వచ్చేటప్పుడు ఎవరి విషయం నాకు సంతోషం కలగాలో వారి విషయం నాకు దుఃఖం కలగకుండా ముందు ఇదే రాశాను. నా సంతోషమే మీకు సంతోషమని మీ అందరిని గురించిన నా నమ్మకం.

[4] ఎంతో బాధతో, హృదయ వేదనతో కన్నీళ్ళు విడుస్తూ మీకు రాశాను. మీకు దుఃఖం కలగాలని కాదు గాని మీరంటే నాకున్న అత్యధిక ప్రేమ మీకు తెలియాలనే అలా రాశాను.

[5] దుఃఖం కలిగించినవారెవరైనా ఉంటే, ఆ వ్యక్తి దుఃఖం కలిగించినది నాకు కాదు గాని కొంతమట్టుకు మీకందరికీ (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు).

[6] అలాంటివానిమీద మీలో ఎక్కువమంది కలిగించిన శిక్ష చాలు.

[7] కాబట్టి శిక్షకు బదులుగా మీరు అతణ్ణి క్షమించి ఓదార్చడం మంచిది. లేదా, అతనికి అతి దుఃఖం ముంచుకువస్తుందేమో.

[8] అందుచేత అతనిపట్ల మీ ప్రేమ మళ్ళీ రూఢిపరచండని మిమ్ములను ప్రాధేయపడుతున్నాను.

[9] మీరు అన్నిటిలో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకు కూడా అలా రాశాను.

[10] మీరు ఎవరినైనా దేనిగురించైనా క్షమిస్తే ఆ వ్యక్తిని నేనూ క్షమిస్తాను. నేను దేనినైనా క్షమించి ఉంటే అది మీ కోసం, క్రీస్తు సముఖంలో ఆ వ్యక్తిని క్షమించాను.

[11] సైతాను మనమీద దురుద్దేశం సాధించకూడదని అలా చేశాను. సైతాను తంత్రాలు ఎలాంటివో మనం తెలియనివారం కాము.

[12] క్రీస్తు శుభవార్త ప్రకటించడానికి నేను త్రోయ రేవుకు వచ్చినప్పుడు ప్రభువు నాకు ద్వారం తెరిచాడు.

[13] అయితే నా సోదరుడైన తీతు కనబడకపోవడంచేత నా ఆత్మకు నెమ్మది లేకపోయింది. అప్పుడు వారిదగ్గర సెలవు తీసుకొని మాసిదోనియకు బయలు దేరాను.

[14] దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్ములను ఎప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు, క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మాద్వారా అంతటా గుభాళించేలా చేస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతలు కలుగుతాయి గాక!

[15] రక్షణ పొందుతున్న వారిమధ్య, నశిస్తున్నవారిమధ్య కూడా, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాం.

[16] నశిస్తున్నవారికి మరణకరమైన మరణ వాసనగా ఉన్నాం. రక్షణగలవారికి జీవప్రదమైన జీవ వాసనగా ఉన్నాం. ఇలాంటి విషయాలకు సమర్థులెవరు?

[17] మేము దేవుని వాక్కువల్ల అక్రమలాభం సంపాదించేవారం కాము. అలాంటివారు చాలామంది ఉన్నారు. మేమైతే నిజాయితీపరులం, దేవుడు పంపినవారం, దేవుని ఎదుటే క్రీస్తులో మాట్లాడేవారం.

2 కొరింతువారికి లేఖ — Chapters