[1] ప్రియ సోదరులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని మీద భయభక్తులతో పవిత్రతను సంపూర్తి చేసుకొంటూ శరీరానికీ ఆత్మకూ అంటి ఉన్న మురికి అంతటినుంచీ శుభ్రం చేసుకొందాం.
[2] మీ హృదయాలలో మాకు చోటివ్వండి. మేమెవరికీ కీడు చేయలేదు, ఎవరినీ భ్రష్టులను చేయలేదు, ఎవరినుంచీ దేనినీ మోసంగా తీసుకోలేదు.
[3] మీమీద నింద మోపాలని నేనిలా మాట్లాడడం లేదు. మీరు మా హృదయాలలో ఉన్నారు. మీ దగ్గర బ్రతకడానికీ చనిపోవడానికీ మాకిష్టమని లోగడ చెప్పాను గదా.
[4] మీతో నేను అధిక ధైర్యంతో మాట్లాడుతున్నాను. మిమ్ములను బట్టి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను, మా బాధలన్నిటిలో అత్యధిక ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నాను.
[5] మేము మాసిదోనియకు వచ్చినప్పుడు కూడా మా శరీరాలకు విశ్రాంతి అంటూ లేకపోయింది. అన్ని వైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు.
[6] అయినప్పటికీ అణగారిపోయినవారిని దేవుడు ఓదార్చేవాడు. తీతు రాకడవల్ల ఆయన మమ్ములను ఓదార్చాడు.
[7] అతని రాకడవల్ల మాత్రమే కాదు గాని అతనికి మీ విషయంలో కలిగిన ఆదరణవల్ల కూడా మమ్ములను ఓదార్చాడు. ఎలాగంటే మీ హృదయాభిలాష, మీ శోకం, నేనంటే మీకుండే ఆసక్తి మాకు తెలియజేశాడు. అందుకు నేను మరి ఎక్కువగా ఆనందించాను.
[8] నా ఉత్తరంవల్ల నేను మిమ్ములను దుఃఖపెట్టినా నాకు విచారం లేదు. ఆ ఉత్తరం మీకు కొద్ది కాలం దుఃఖం కలిగించిందని తెలిసి విచారపడ్డాను.
[9] ఇప్పుడైతే సంతోషిస్తున్నాను – మీకు దుఃఖం కలిగినందుచేత కాదు గాని మీరు పశ్చాత్తాపపడేటంతగా దుఃఖం కలిగినందుచేతనే. మీకు మావల్ల ఏ విషయంలోనూ నష్టం కాకుండా ఆ దుఃఖం కలిగింది దేవుని వల్ల అయింది.
[10] దేవునివల్ల అయిన దుఃఖం విముక్తికి దారితీసే పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. ఆ విషయంవల్ల విచారం కలగదు. కానీ లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది.
[11] ఈ విషయం ఆలోచించండి: దేవునివల్ల అయిన దుఃఖం మీకు కలిగింది. అది మీలో ఎంత శ్రద్ధ కలిగించిందో! ఎంత ప్రతివాదం! ఎంత కోపం! ఎంత భయం! ఎంత హృదయాభిలాష! ఎంత ఆసక్తి! ఎంత ప్రతిక్రియ! ఆ విషయంలో మీరు నిర్దోషులని అన్ని విధాలుగా రుజువు చేసుకొన్నారు.
[12] నేను మీకు రాసినా, ఎవడు ఆ దుర్మార్గం చేశాడో, ఆ దుర్మార్గం ఎవరిపట్ల జరిగిందో వారికోసం విశేషంగా రాయలేదు గాని దేవుని ఎదుట మీపట్ల మాకున్న శ్రద్ధాసక్తులు మీకు స్పష్టం కావాలని రాశాను.
[13] అలా అయిందని మాకు మీ ఓదార్పులో ఓదార్పు కలిగింది. అంతేకాక తీతుకు కలిగిన ఆనందం ద్వారా మాకు మరి అత్యధికంగా సంతోషం కలిగింది, మీ అందరివల్ల అతని ఆత్మకు ఊరట కలిగింది.
[14] మీ గురించి ఏ విషయంలోనైనా అతనితో గొప్పగా మాట్లాడినా నేనేమీ సిగ్గుపాలు కావడం లేదు. మేము మీతో చెప్పినదంతా ఎలా నిజమో అలాగే తీతుతో మేము మీ గురించి గొప్పగా మాట్లాడినది నిజమని తేలింది.
[15] మీరు తనను భయాందోళనతో స్వీకరించి విధేయత చూపిన సంగతి అతడు జ్ఞాపకం చేసుకొన్నప్పుడు మీపట్ల అతని వాత్సల్యం అధికమై ఉంది.
[16] ప్రతి విషయంలో మీ గురించి నాకు నమ్మకం ఉంది గనుక ఆనందిస్తూ ఉన్నాను.