[1] ఇప్పుడు నేను – పౌలును – క్రీస్తు సాత్వికం, శాంతం బట్టి మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నప్పుడు “దీనుణ్ణి”, లేనప్పుడు మీపట్ల “ధైర్యశాలిని” గదా!
[2] మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరు అనుకొంటున్నారు గదా. నేను అలాంటివారిపట్ల ధైర్యంతో వ్యవహరించాలని నా ఉద్దేశం. అయితే నేను మీ మధ్య ఉన్నప్పుడు అలా జరగకుండా చేయండని మిమ్ములను వేడుకొంటున్నాను.
[3] మేము శరీరంలో ఉండి నడుచుకొంటూ ఉన్నా మేము శరీరానుసారంగా యుద్ధం చేయడం లేదు.
[4] ఎందుకంటే మా యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు గాని కోటలను పడదోయడానికి దేవుని ద్వారా బలప్రభావాలు గలవి.
[5] మేము దేవుని గురించిన జ్ఞానానికి విరుద్ధంగా వివాదాలనూ తనను హెచ్చించుకొనే ప్రతిదానినీ పడగొట్టేస్తున్నాం. ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
[6] మీ విధేయత పూర్తి అయినప్పుడు సమస్త అవిధేయతను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా.
[7] మీరు పైరూపం మాత్రమే చూస్తున్నారా? ఎవరైనా తాను క్రీస్తు మనిషినని నమ్ముకొంటే, అతడు మళ్ళీ తలచవలసిన విషయమేమిటంటే, అతడు ఎలా క్రీస్తు మనిషో అలాగే మేమూ క్రీస్తు మనుషులం.
[8] మీ నాశనంకోసం కాక మీ అభివృద్ధి కోసమే ప్రభువు మాకిచ్చిన అధికారాన్ని గురించి ఒకవేళ నేను కొంత అతిశయంగా చెప్పుకొన్నా నాకు సిగ్గు కలగదు.
[9] నా ఉత్తరాలవల్ల మిమ్ములను భయపెట్టేవాడిలాగా ఉండకూడదని ఇలా చెపుతున్నాను.
[10] ఎవరో అన్నారు గదా “అతడి ఉత్తరాలు బలీయమైనవి గాని అతడు మన మధ్య ఉన్నప్పుడు శరీరరీత్యా దుర్బలుడు, మాట్లాడే విధానం కొరగానిది.”
[11] అలా చెప్పే వ్యక్తి ఈ సంగతి ఆలోచించాలి: మేము లేనప్పుడు ఉత్తరాలలో మా మాటల ప్రకారం ఎలాంటివారమో ఉన్నప్పుడు క్రియల ప్రకారం అలాంటివారమై ఉంటాం.
[12] అయినా తమను మెప్పించుకొనేవారి లెక్కలో ఉన్నామని చెప్పడానికి గానీ వారితో మమ్ములను మేమే పోల్చుకోవడానికి గానీ తెగించము. వారేమో తమలో ఒకణ్ణి బట్టి ఒకడు ఎన్నిక చేసుకొంటారు. ఒకడితో ఒకడు పోల్చుకొంటారు. ఇందులో వారికి తెలివి లేదు.
[13] మేమైతే మా విషయం మితి మీరి గొప్పగా చెప్పుకోము గాని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన సరిహద్దులలోనే ఉంటాం. ఈ సరిహద్దులలో మీరూ ఉన్నారు.
[14] మీరు మా సరిహద్దులలో లేనట్టు మేము మీ విషయంలో మా హద్దు మీరడం లేదు. క్రీస్తు శుభవార్తతో మీ దగ్గరకు వచ్చినది మేమే గదా?
[15] మేము మా సరిహద్దు దాటి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు గొప్పలు చెప్పుకోము. మీ విశ్వాసం పెరుగుతూ ఉంటే మీవల్ల మా సరిహద్దులలో మా సేవకు అభివృద్ధి కలుగుతుందనీ,
[16] మీకు అవతల ఉన్న ప్రాంతాలలో కూడా శుభవార్త ప్రకటించగలమనీ మా ఆశాభావం. అయితే మరొకరు తన సరిహద్దులలో చేసిన పని గురించి గొప్పగా చెప్పుకోవడం మా ఆశ కాదు.
[17] “అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలి.”
[18] తనను తాను మెచ్చుకొనేవాడు కాదు గాని ప్రభువు మెచ్చుకొనేవాడే ఆమోదయోగ్యుడు.