[1] ఇందువల్ల మేము ఈ సేవ కలిగి ఉండి దేవుని కరుణ పొందినందుకు నిరుత్సాహపడం.
[2] అయితే కుయుక్తిగా ప్రవర్తించకుండా, దేవుని వాక్కును కల్తీ చేయకుండా అవమానకరమైన రహస్య విషయాలు నిరాకరించాం. సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉండడంవల్ల, దేవుని సముఖంలో ప్రతి మనిషి అంతర్వాణికీ మా యోగ్యతలు కనపరుస్తున్నాం.
[3] ఒక వేళ మా శుభవార్త మరుగై ఉందీ అంటే, అది నశిస్తున్నవారికే మరుగై ఉంది.
[4] విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను గురించిన శుభవార్త వెలుగు వారి మీద ప్రకాశించకుండా అలా చేశాడు.
[5] కాబట్టి మేము మమ్ములను ప్రకటించుకోకుండా, ప్రభువైన క్రీస్తు యేసునూ మమ్మల్ని యేసుకోసం మీ దాసులుగానూ ప్రకటిస్తున్నాం.
[6] క్రీస్తు ముఖంలో ఉన్న దేవుని మహిమను గురించిన జ్ఞాన కాంతి మనకు ప్రసాదించడానికి, చీకటిలో నుంచి వెలుగును ప్రకాశించమని ఆజ్ఞాపించిన దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు.
[7] అయితే అత్యధిక బలప్రభావం మావల్ల కాక దేవుని వల్ల అయి ఉండేలా ఈ ఐశ్వర్యం మాకు మట్టి పాత్రలలో ఉంది.
[8] అన్ని వైపులా ఒత్తిడి మామీదికి వస్తూ ఉంది గాని మేము ఇరుక్కొనిపోవడం లేదు. ఆందోళన పడుతున్నాం గాని నిరాశ చెందడం లేదు.
[9] హింసలకు గురి అవుతూ ఉన్నాం గాని విడిచిపెట్టబడ్డవారం కాము. మమ్ములను పడద్రోయడం జరుగుతూ ఉంది గాని మేము నాశనం కావడం లేదు.
[10] యేసు జీవం మా శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణం కూడా మా శరీరంలో ఎప్పుడూ భరిస్తూ ఉన్నాం.
[11] ఎలాగంటే, చావుకు లోనయ్యే మా శరీరాలలో యేసు జీవం వెల్లడి అయ్యేలా సజీవులమైన మమ్ములను యేసుకోసం మరణానికి అప్పగించడం ఎప్పుడూ జరుగుతూ ఉంది.
[12] అందుచేత మాలో మరణం, మీలో జీవం పని చేస్తూ ఉన్నాయి.
[13] “నేను నమ్ముకొన్నాను గనుక మాట్లాడాను” అని రాసి ఉంది. అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాం గనుక మాట్లాడుతున్నాం.
[14] ప్రభువైన యేసును సజీవంగా లేపినవాడు యేసుతో మమ్ములను కూడా సజీవంగా లేపి మీతోపాటు తన ముందు నిలబెట్టుకొంటాడని మాకు తెలుసు.
[15] అనేకులకు వ్యాపించిన దేవుని కృప, ఆయన మహిమకు కృతజ్ఞతలు సమృద్ధిగా కలిగించేలా అంతా మీ కోసమే ఉంది.
[16] అందుచేత మేము నిరుత్సాహం చెందము. శారీరకంగా క్షీణించిపోతూ ఉన్నా ఆంతర్యంలో మాకు రోజు రోజుకూ కొత్తదనం కలుగుతూ ఉంది.
[17] మేము కనిపించేవాటిమీద దృష్టి ఉంచకుండా కనిపించనివాటిమీదే దృష్టి ఉంచు కొంటున్నాం
[18] గనుక క్షణికమైన, చులకనైన మా బాధ దానికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమభారాన్ని మా కోసం కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనిపిస్తున్నవి కొంత కాలమే ఉంటాయి గాని కనిపించనివి శాశ్వతమైనవి.