Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:39

[1] ఇప్పుడు, సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మీకు తెలియజేస్తాను.

[2] తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఉండి కూడా వారి ఆనంద సమృద్ధినుంచీ వారి అతి దరిద్రంలోనుంచి వారి అధికమైన ఔదార్యం వెల్లువగా ప్రవహించింది.

[3] వారిని గురించి నా సాక్ష్యమేమిటంటే, తమంతట తామే ఇష్టపూర్వకంగానే వారు ఇవ్వగలిగినంతా ఇచ్చారు – అసలు దానికంటే ఎక్కువే ఇచ్చారు.

[4] అక్కరలో ఉన్న పవిత్రులకోసం ఈ ఉదారతను ఈ సేవలో తమ తోడ్పటును మేము స్వీకరించాలని మనసారా మమ్ములను వేడుకొన్నారు.

[5] ఇంతేకాదు. మేము ఆశించినట్టు మాత్రమే కాక, వారు మొదట ప్రభువుకు, దేవుని సంకల్పంవల్ల మాకు కూడా అర్పించుకొన్నారు.

[6] తీతు మీలో ఈ ఉదారత మొదలుపెట్టాడు గనుక మీలో దీనిని సంపూర్తి చేయాలని కూడా మేమతణ్ణి పురికొల్పాం.

[7] మీకు ప్రతి విషయంలో – విశ్వాసంలో, మాటలో, తెలివిలో, సంపూర్ణ ఆసక్తిలో, మాపట్ల మీకున్న ప్రేమలో సమృద్ధి ఉంది. అలాగే ఈ ఉదారతలో కూడా సమృద్ధి ఉండేలా చూచుకోండి.

[8] నేను ఆజ్ఞపూర్వకంగా చెప్పడం లేదు గాని ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమభావం ఎంత వాస్తవమో పరీక్షిస్తున్నాను.

[9] మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తెలుసు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీకోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రంవల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం.

[10] మీరు ఇవ్వడం గురించి నా అభిప్రాయమిది: సంవత్సరం క్రిందటే మీరు ఏ ఉపకారక్రియ చేయాలని కోరి మొదలు పెట్టారో దాన్ని ఇంకా చేయడం మీకు మేలు.

[11] ఇప్పుడు దాన్ని చేస్తూ ముగించాలి. చేయాలని కోరడానికి సంసిద్ధత ఉన్నట్టు మీకున్నదానిలో నుంచి ఇచ్చి సంపూర్తి చేయాలి కూడా.

[12] మొదట సిద్ధమైన మనసు ఉంటే ఇచ్చేది అంగీకారంగా ఉంటుంది. ఈ అంగీకారం ఒక వ్యక్తికి ఉన్నదానినిబట్టే గాని లేనిదానినిబట్టి కాదు.

[13] ఇతరుల విషయంలో శ్రమ నివారణ చేసి మీకు భారం కలిగించాలని కాదు.

[14] గాని సమానత ఉండాలని నా కోరిక. ప్రస్తుతం మీ సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరలకు సహాయకరంగా ఉండాలని నా భావం. అప్పుడు రాసి ఉన్న దానిప్రకారం సమానత ఉంటుంది –

[15] “ఎక్కువగా సేకరించినవారికి ఏమి మిగలలేదు, తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు.”

[16] మీపట్ల నాకున్న శ్రద్ధాసక్తులు దేవుడు తీతు హృదయంలో కూడా పుట్టించాడు. దేవునికి స్తుతులు!

[17] తీతు మా విన్నపం అంగీకరించాడు. అంతేకాక, అతడు ఇంకా శ్రద్ధాసక్తులు కలిగి తనకు తానే మీదగ్గరకు వచ్చాడు.

[18] క్రీస్తు సంఘాలన్నిటిలోనూ శుభవార్త సేవలో ప్రసిద్ధిగాంచిన సోదరుణ్ణి కూడా అతనితోపాటు పంపుతున్నాం.

[19] అంతే కాక ఈ సోదరుడే మాతో కలిసి ఈ చందా తీసుకొని జెరుసలం ప్రయాణం చేయడానికి సంఘాలచేత నిర్ణయమైనవాడు. మేము ప్రభువుకు మహిమ కలిగిద్దామని సహాయం చేయడానికి మీ సిద్ధమైన మనసు చూపుదామనీ, ఈ ఉపకార క్రియ నిర్వహిస్తున్నాం.

[20] సంఘాలిచ్చిన ఈ పెద్ద మొత్తానికి బాధ్యత వహించిన మమ్మల్ని ఎవరూ తప్పు పట్టకుండా ఇలా ప్రయత్నిస్తున్నాం.

[21] ఎందుకంటే, ప్రభు దృష్టిలో మాత్రమే కాకుండా మనుషుల దృష్టిలో కూడా నిజాయితీతో ఏర్పాట్లు చేస్తున్నాం.

[22] వారితోకూడా మా మరో సోదరుణ్ణి పంపుతున్నాం. అనేక విషయాలలో అనేక సార్లు అతణ్ణి పరీక్షించి అతని శ్రద్ధాసక్తులు తెలుసుకొన్నాం. మీ గురించి కుదిరిన విశేషమైన నమ్మకం బట్టి ఇప్పుడు అతనికి మరి ఎక్కువ శ్రద్ధాసక్తులున్నాయి.

[23] తీతు మట్టుకైతే, అతడు నా పాలివాడు, మీ విషయంలో నా సహకారి. అతనితో వస్తున్న మన సోదరుల మట్టుకైతే, వారు సంఘాల దూతలు, క్రీస్తుకు మహిమై ఉన్నారు.

[24] అందుచేత సంఘాల ఎదుట బహిరంగంగా వీరికి మీ ప్రేమభావాన్నీ మీ గురించి మాకున్న అతిశయ కారణాన్నీ రుజువు చేయండి.

2 కొరింతువారికి లేఖ — Chapters