Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:16

[1] గలతీయ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు క్రీస్తు రాయబారి అయిన పౌలనే నానుంచి, నాతో ఉన్న సోదరులందరి నుంచీ అభివందనాలు.

[2] నేను రాయబారిగా ఉన్నది మనుషులద్వారా కాదు, మానవుడివల్లా కాదు గాని యేసు క్రీస్తువల్లే, ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపిన తండ్రి అయిన దేవునివల్లే.

[3] మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ మీకు అనుగ్రహం, శాంతి కలుగుతాయి గాక!

[4] మన తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు మనలను ఇప్పటి చెడు యుగంనుంచి విడిపించడానికి మన పాపాలకోసం తనను తాను అర్పించుకొన్నాడు.

[5] దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.

[6] మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను. క్రీస్తు కృపవల్ల మిమ్ములను పిలిచినవాని వైపునుంచి మీరు ఇంత త్వరలో వేరొక శుభవార్త వైపు తిరుగుతూ ఉన్నారు!

[7] అది శుభవార్త కానే కాదు. కానీ కొందరు శుభవార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్ములను కలవరపరుస్తున్నారు.

[8] అయితే మేము మీకు ప్రకటించిన శుభవార్త కాక ఒకవేళ వేరేదేదైనా మేము గానీ పరలోకంనుంచి వచ్చిన దేవదూత గానీ మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్థుడవుతాడు గాక!

[9] మునుపు మేము చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను – మీరు స్వీకరించిన శుభవార్త గాక వేరేది ఎవరైనా సరే మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్థుడవుతాడు గాక!

[10] నేనిప్పుడు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నది మనుషులనా? దేవుణ్ణా? మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టాలని చూస్తూ ఉంటే క్రీస్తు దాసుణ్ణయి ఉండేవాణ్ణి కాను!

[11] సోదరులారా, నేను ప్రకటించిన శుభవార్త మనుషుల ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను.

[12] ఈ శుభవార్త మనుషుల ద్వారా నేను అందుకోలేదు. దానిని ఏ మనిషీ నాకు నేర్పలేదు. యేసు క్రీస్తే దానిని నాకు వెల్లడి చేశాడు.

[13] యూద మతంలో నా గత జీవిత విధానాన్ని గురించి మీరు విన్నారు – నేనెలా క్రీస్తు సంఘాన్ని అత్యధికంగా హింసిస్తూ, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాను.

[14] అప్పుడు పూర్వీకుల సాంప్రదాయాలంటే నాకెంతో ఆసక్తి. నా స్వజాతివారిలో నా వయసు గల అనేకులను యూద మతం విషయంలో మించిపోయాను.

[15] అయితే నేను తన కుమారుణ్ణి ఇతర జనాలలో ప్రకటించాలని నన్ను పుట్టుకతోనే ప్రత్యేకించుకొని తరువాత తన కృపచేత పిలిచిన దేవుడు

[16] ఆయనను నాయందు ప్రత్యక్షం చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను మనుషులతో కలిసి ఆలోచించలేదు.

[17] నాకంటే ముందుగా క్రీస్తు రాయబారులైనవారి దగ్గరకు జెరుసలం వెళ్ళలేదు గాని అరేబియాకు వెళ్ళిపోయాను. తరువాత దమస్కు నగరానికి మళ్ళీ వచ్చాను.

[18] మూడు సంవత్సరాల తరువాత, పేతురును దర్శించడానికి జెరుసలం వెళ్ళాను. అక్కడ అతనితో కూడా పదిహేను రోజులున్నాను.

[19] అయితే తక్కిన క్రీస్తు రాయబారులలో ప్రభువు తమ్ముడైన యాకోబును తప్ప మరే ఒక్కరినీ నేను చూడలేదు.

[20] నేను మీకు రాస్తున్న దీనిలో అబద్ధమేమీ లేదని దేవుని ఎదుట రూఢిగా చెపుతున్నాను.

[21] ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వెళ్ళాను.

[22] అప్పుడు, క్రీస్తులో ఉన్న యూదయ సంఘాలకు నా ముఖ పరిచయం కాలేదు.

[23] కానీ ఒక సంగతి మాత్రం వారు వింటూ వచ్చారు. ఏమిటంటే, “మునుపు మమ్ములను హింసించినవాడు ఏ విశ్వాసాన్ని నాశనం చేయాలని చూశాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు.”

[24] వారు నా కారణంగా దేవుణ్ణి స్తుతించారు.

గలతీయవారికి లేఖ — Chapters