[1] భూమిమీద మన నివాసమైన గుడారం నాశనమైపోతే దేవునివల్ల అయిన కట్టడం, చేతులు చేయని ఒక శాశ్వత గృహం పరలోకంలో మనకు ఉంటుందని మనకు తెలుసు.
[2] పరలోకసంబంధమైన మన నివాసం ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాం.
[3] నిజంగా దానిని ధరించు కొన్నప్పుడు మనం దిగంబరంగా కనబడము.
[4] ఈ “గుడారం”లో ఉన్న మనం భారంక్రింద మూలుగుతూ ఉన్నాం. ఇది తొలగించబడాలని కాదు గాని ఆ నివాసాన్ని ధరించు కోవాలని – చావుకు లోనయ్యేది జీవంవల్ల మింగివేయబడాలని మన ఆశ.
[5] ఈ అవశ్యమైన దానికోసం మనలను తయారు చేసినది దేవుడే. తన ఆత్మను హామీగా మనకు ఇచ్చినది కూడా ఆయనే.
[6] ఈ కారణంచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉన్నాం. మనం శరీరంలో నివాసమున్నంత కాలం ప్రభువుతో లేమని తెలుసు –
[7] కంటికి కనిపించేవాటివల్ల కాదు గాని విశ్వాసంవల్లే నడుచుకొంటున్నాం.
[8] నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటే శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో, ఆయన సమక్షంలో ఉండాలని ఇష్టపడుతున్నాం.
[9] అందుచేత మేము పెట్టుకొన్న లక్ష్యం ఏమిటంటే, శరీరంలో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే.
[10] ఎందుకంటే, మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా నిలబడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో ఉండి చేసిన క్రియలకు – చేసినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే – చేసిన వాటి ప్రకారం పొందాలి.
[11] అందుచేత మేము ప్రభువుపట్ల భయమంటే ఏమిటో తెలిసి మనుషులను ఒప్పిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో అది దేవునికి తేటగా తెలిసిన విషయమే. అది మీ అంతర్వాణికి కూడా తేటగా తెలిసినదని నా ఆశాభావం.
[12] మా యోగ్యతలు మళ్ళీ మీ ముందు పెట్టడం లేదు గాని హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పైరూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయం మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాం.
[13] మాకు మతి తప్పింది అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీకోసమే.
[14] ఎందుకని? క్రీస్తు ప్రేమ మమ్ములను ఒత్తిడి చేస్తూ ఉంది. ఎలాగంటే మాకీ నిశ్చయం ఉంది: అందరికోసమూ ఒకే వ్యక్తి చనిపోయాడు గనుక అందరూ చనిపోయారు.
[15] బ్రతికేవారు ఇకనుంచి తమకోసం బ్రతకకుండా తమ స్థానంలో చనిపోయి మళ్ళీ సజీవంగా లేచినవానికోసమే బ్రతకాలని ఆయన అందరికోసమూ చనిపోయాడు.
[16] కనుక ఇకమీదట మేము ఎవరినీ లోక దృష్టితో చూడము. లోగడ క్రీస్తును లోకదృష్టితో తెలుసుకొన్నా ఇప్పుడు ఆయనను అలా తెలుసుకోవడం లేదు.
[17] కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి కొత్త సృష్టి. పాతవి గతించాయి. ఇవిగో అన్నీ క్రొత్తవి అయ్యాయి.
[18] అంతా దేవునివల్లే అయినది. ఆయన మమ్ములను క్రీస్తుద్వారా తనతో సఖ్యపరచుకొన్నాడు, సఖ్యపరచే పరిచర్య మాకిచ్చాడు.
[19] అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సఖ్యపరచుకొంటూ, వారిమీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు. సఖ్యపరచే సందేశం మాకప్పగించాడు.
[20] అందుచేత మేము క్రీస్తుకు దూతలం. దేవుడు మాద్వారా వేడుకొంటూ ఉన్నట్టుంది. దేవునితో సఖ్యపడండి అంటూ క్రీస్తు పక్షంగా బతిమాలుతున్నాం.
[21] మనం ఆయనలో దేవుని నీతిన్యాయాలయ్యేలా దేవుడే ఏ పాపం లేని ఆయనను మనకోసం పాపంగా చేశాడు.