[1] పవిత్రులకోసమైన ఈ సేవ విషయం నేను మీకు రాయనక్కరలేదు.
[2] ఇందులో మీ సంసిద్ధత నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు సంవత్సరంనుంచి చందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీ గురించి మాసిదోనియవారితో గొప్పగా చెపుతున్నాను. మీ ఆసక్తి వారిలో ఎక్కువమందికి ప్రోత్సాహం కలిగించింది.
[3] అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పుకొన్న సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ, నేను చెప్పినట్టే మీరు సిద్ధంగా ఉండాలనీ ఈ సోదరులను పంపుతున్నాను.
[4] ఒకవేళ మాసిదోనియవారిలో ఎవరైనా నాతో వచ్చి, మీరు సిద్ధంగా లేకపోతే అది చూస్తారనుకోండి. అలాంటప్పుడు మేము నమ్మకంతో గొప్పగా చెప్పిన దాని గురించి ఈ నమ్మకం వల్ల మాకు సిగ్గు కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందని వేరే చెప్పాలా!
[5] ఈ కారణంచేత సోదరులు ముందుగానే మీ దగ్గరకు వచ్చి, లోగడ ఇస్తామని మీరు చెప్పిన ధారాళమైన చందా జమ చేసేటందుకు వారిని ప్రోత్సహించడం అవసరమనుకొన్నాను. మీ చందా సిద్ధంగా ఉండాలనీ, అది పిసినిగొట్టుతనంగా ఇచ్చినది కాకుండా ధారాళమైనదిగా ఉండాలనీ నా ఉద్దేశం.
[6] ఇందుకు ఒక ఉదాహరణ – కొద్దిగా వెదజల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు.
[7] ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే, ఉల్లాసంతో ఇచ్చే వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు.
[8] అంతే కాదు. అన్నిట్లో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీపట్ల సర్వ కృప సమృద్ధిగా అధికం చేయగలడు.
[9] దీనిగురించి ఇలా రాసి ఉంది: “అతడు నలుదిక్కులకు వెదజల్లాడు. అక్కరలో ఉన్నవారికి ఇచ్చాడు. అతని నీతిన్యాయాలు శాశ్వతంగా నిలుస్తాయి.”
[10] వెదజల్లే వారికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే దేవుడు చల్లడానికి విత్తనాలు మీకిస్తాడు, వృద్ధి చేస్తాడు, మీ న్యాయ ఫలాన్ని అధికం చేస్తాడు గాక.
[11] ఈ విధంగా ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వసమృద్ధి కలుగుతుంది. దీనివల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పే కారణం అవుతుంది.
[12] ఈ సేవ నిర్వహించడం పవిత్రుల అక్కరలను తీర్చడమే కాకుండా, దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు కలిగేలా చేస్తుంది.
[13] ఈ సేవ రుజువైనదనీ మీరు ఒప్పుకొన్న శుభవార్తకు మీ విధేయతనుబట్టీ తమకు, అందరికీ, మీరు ఉదారంగా పంచిపెట్టడం బట్టీ దేవునికి మహిమ కలిగిస్తారు.
[14] అంతేగాక, మీలో ఉన్న దేవుని అత్యధిక కృపను బట్టి వారు మీకోసం ప్రార్థన చేస్తూ, మీ మేలు మనసారా కోరతారు.
[15] వివరించడానికి సాధ్యం కాని ఆయన ఉచితమైన బహుమతి గురించి దేవునికి కృతజ్ఞతలు!