Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:49

[1] యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొన్నాడు.

[2] అప్పుడు కొందరు ఒక పక్షవాతరోగిని పడకమీదే ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి పక్షవాత రోగితో “కుమారా, ధైర్యం తెచ్చుకో! నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.

[3] వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొందరు “ఇతడు దేవదూషణ చేస్తున్నాడు” అని తమలో తాము చెప్పుకొన్నారు.

[4] వారి తలంపులు తెలుసుకొని యేసు ఇలా అన్నాడు: “హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు?

[5] ఏది సులభమంటారు – ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? ‘లేచి నడువు’ అనడమా?

[6] అయితే మానవ పుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి.” అలా చెప్పి ఆయన పక్షవాతరోగితో “లేచి, నీ పడక ఎత్తుకొని ఇంటికి వెళ్ళు” అన్నాడు.

[7] అతడు లేచి ఇంటికి వెళ్ళాడు.

[8] ఇది చూచి జన సమూహాలకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అధికారం మనుషులకు ఇచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.

[9] యేసు అక్కడనుంచి వెళ్తూ, సుంకం వసూళ్ళ స్థానంలో కూర్చుని ఉన్న ఒక మనిషిని చూశాడు. అతని పేరు మత్తయి. ఆయన అతనితో “నా వెంట రా” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.

[10] యేసు ఇంట్లో భోజనానికి బల్ల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు సుంకంవారు, పాపులు అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చున్నారు.

[11] అది చూచి పరిసయ్యులు ఆయన శిష్యులతో “మీ గురువు సుంకంవారితోనూ పాపులతోనూ కలిసి తింటున్నాడేమిటి?” అన్నారు.

[12] అది విని యేసు వారితో ఇలా అన్నాడు: “జబ్బు చేసినవారికే వైద్యుడు అవసరం గాని బాగున్నవారికి కాదు.

[13] నేను పాపులనే పశ్చాత్తాపపడాలని పిలవడానికి వచ్చాను గాని న్యాయవంతులను కాదు. కనుక మీరు వెళ్ళి ‘మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు’ అనే వాక్కు భావం నేర్చుకోండి.”

[14] బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు యేసుదగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “పరిసయ్యులూ, మేమూ తరచుగా ఉపవాసం ఉంటాం గాని మీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకని?”

[15] యేసు వారికిలా జవాబిచ్చాడు: “పెళ్ళికొడుకు తమతో ఉన్నంతకాలం అతని మిత్రులకు దుఃఖం ఎలా ఉండగలదు? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గరనుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.

[16] పాత వస్త్రానికి కొత్త బట్ట ఎవరూ మాసిక వేయరు. వేస్తే ఆ మాసిక వస్త్రం నుంచి చించుకొంటుంది, చినుగు పెద్దదవుతుంది.

[17] అలానే వారు కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోయరు. పోస్తే ఆ తిత్తులు చినిగిపోతాయి, ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోస్తారు. అప్పుడు రెంటిలో ఏదీ చెడిపోకుండా ఉంటుంది.”

[18] ఆయన ఈ సంగతులు వారితో చెపుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా, మీరు వచ్చి ఆమెమీద మీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.

[19] యేసు లేచి అతడివెంట వెళ్ళసాగాడు. శిష్యులు కూడా వచ్చారు.

[20] అప్పుడే, పన్నెండేళ్ళనుంచి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకింది.

[21] ఎందుకంటే, “ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా నయం అవుతుంది” అని ఆమె అనుకొంది.

[22] యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ నమ్మకం నిన్ను బాగు చేసింది” అన్నాడు. ఆ గడియనుంచి ఆమెకు ఆరోగ్యం చేకూరింది.

[23] యేసు ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళినతరువాత అక్కడ పిల్లనగ్రోవులు వాయించేవారినీ గోల చేస్తూ ఉన్న గుంపునూ చూచి వారితో ఇలా అన్నాడు:

[24] “వెళ్ళిపోండి! అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది.” వాళ్ళు నవ్వి ఆయనను వేళాకోళం చేశారు.

[25] గుంపును బయటికి పంపివేసిన తరువాత ఆయన లోపలికి వెళ్ళి ఆ పిల్ల చేయి తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆమె లేచి నిలబడింది.

[26] దీన్ని గురించిన కబురు ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

[27] అక్కడనుంచి యేసు వెళ్తూ ఉన్నప్పుడు గుడ్డివారు ఇద్దరు ఆయనను అనుసరిస్తూ “దావీదు కుమారా! మామీద దయ చూపు” అంటూ కేకలు వేశారు.

[28] ఆయన ఇంట్లో ప్రవేశించాక ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. వారితో యేసు అన్నాడు, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” “అవును, స్వామీ!” అని వారు ఆయనతో అన్నారు.

[29] అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి, “మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది గాక!” అన్నాడు.

[30] వెంటనే వారి కండ్లు తెరచుకొన్నాయి. “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండేం!” అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు.

[31] కానీ వారు బయటికి వెళ్ళి, ఆయన విషయం ఆ ప్రాంతం అంతటా చాటించారు.

[32] వారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.

[33] ఆయన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు. జన సమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. “ఇస్రాయేల్‌లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు” అని వారు చెప్పుకొన్నారు.

[34] అయితే పరిసయ్యులు “దయ్యాల నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడతున్నాడు” అన్నారు.

[35] యేసు అన్ని పట్టణాలకూ గ్రామాలకూ వెళ్తూ, వారి సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ రాజ్య శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజలలో అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగు చేస్తూ ఉన్నాడు.

[36] జన సమూహాలను చూచినప్పుడు ఆయన వారి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే, వారు కాపరి లేని గొర్రెలలాగా అలసిపోయి చెదరిపోయి ఉన్నారు.

[37] అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “నిజంగా కోత చాలా ఎక్కువ, పనివారే తక్కువ,

[38] గనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకోండి.”

మత్తయి శుభవార్త — Chapters