Skip to content
Opens in a new window
Listen to this chapter • 7:10

[1] యేసు ఇంకా వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా చెప్పసాగాడు:

[2] “పరలోక రాజ్యం ఇలా ఉంది: ఒక రాజు తన కుమారుని పెళ్ళి విందు ఏర్పాటు చేశాడు.

[3] పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారిని రమ్మనడానికి అతడు తన దాసులను పంపాడు గాని వారికి రావడం ఇష్టం లేదు.

[4] “మళ్ళీ అతడు వేరే దాసులను పంపుతూ, ‘ఆహ్వానం అందినవారితో ఇలా చెప్పండి: నా విందు సిద్ధం చేశాను. నా ఎద్దులనూ క్రొవ్విన పశువులనూ వధించడం జరిగింది. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందుకు రండి’ అన్నాడు.

[5] “అయినా ఆహ్వానమందిన వారు దాన్ని లెక్క చేయక వెళ్ళిపోయారు. ఒకడు తన పొలానికి వెళ్ళాడు. మరొకడు వ్యాపారానికి వెళ్ళాడు.

[6] మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమానించి చంపారు.

[7] రాజు దాని గురించి విని కోపంతో మండిపడ్డాడు, తన సైన్యాలను పంపి ఆ హంతకులను సంహరించి, వారి నగరాన్ని తగల బెట్టించాడు.

[8] “అప్పుడతడు తన దాసులతో ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గాని ఆహ్వానం అందినవాళ్ళు యోగ్యులు కారు.

[9] గనుక రహదారులలోకి వెళ్ళి మీకు కనిపించినవారందరినీ పెళ్ళి విందుకు పిలవండి’ అన్నాడు.

[10] “అలాగే ఆ దాసులు రహదారులలోకి వెళ్ళి, తమకు కనిపించిన వారందరినీ – మంచివారినీ చెడ్డవారినీ – పోగు చేశారు. ఆ విధంగా పెళ్ళి ఇల్లు విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.

[11] ఆ అతిథులను చూద్దామని రాజు లోపలికి వచ్చాడు. పెళ్ళి వస్త్రం తొడుక్కోకుండా ఉన్న వాడొకడు అక్కడ అతనికి కనబడ్డాడు.

[12] “రాజు అతణ్ణి చూచి, ‘స్నేహితుడా! పెళ్ళి వస్త్రం లేకుండా నీవు లోపలికి ఎలా చేరుకున్నావు?’ అని అడిగాడు. అతనికి నోట మాట లేదు.

[13] అప్పుడు రాజు, ‘ఇతణ్ణి కాళ్ళు చేతులు కట్టి, అవతలికి తీసుకువెళ్ళి బయటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపూ, పండ్లు కొరుకుకోవడమూ ఉంటాయి’ అని ఆ పరిచారకులతో చెప్పాడు.

[14] “అలాగే ఆహ్వానం అందుకొన్నవారు చాలామంది, ఎన్నుకోబడ్డవారు కొద్దిమందే.”

[15] అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను మాటలో చిక్కించుకోవడం ఎలాగా అని సమాలోచన చేశారు.

[16] తరువాత తమ శిష్యులను హేరోదు పక్షంవాళ్ళతోపాటు ఆయనదగ్గరికి పంపారు. వారు ఇలా అన్నారు: “ఉపదేశకా, మీరు యథార్థవంతులనీ, ఎవరినీ లెక్కచేయక దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు ఉపదేశిస్తారనీ, మనుషులను పక్షపాతంతో చూడరనీ మాకు తెలుసు.

[17] గనుక ఒక సంగతిని గురించి మీ ఆలోచన ఏమిటో మాకు చెప్పండి – సీజర్‌కు సుంకం చెల్లించడం న్యాయమా కాదా?”

[18] యేసు వాళ్ళ దుర్మార్గత పసికట్టి “కపట భక్తులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు?

[19] సుంకం నాణెం ఒకటి నాకు చూపెట్టండి” అన్నాడు. వారు ఒక దేనారం ఆయనకు తెచ్చి ఇచ్చారు.

[20] “ఈ బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని ఆయన వారినడిగాడు.

[21] “సీజర్‌వి” అని వారు ఆయనతో అన్నారు. ఆయన వారితో “అలాగైతే సీజర్‌వి సీజర్‌కూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అన్నాడు.

[22] ఇది విని వారు అధికంగా ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.

[23] ఆ రోజే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. చనిపోయినవారు లేవరని వారంటారు. వారు ఆయనను ఇలా ప్రశ్నించారు:

[24] “ఉపదేశకా, మోషే చెప్పినది ఇది: ఒక మనిషి సంతానం లేకుండా చనిపోతే అతడి భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకొని అతడి వంశం నిలబెట్టాలి.

[25] మా మధ్య ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చచ్చి అతడి భార్యను అతడి తమ్ముడికి విడిచిపెట్టాడు.

[26] ఈ రెండోవాడికి, తరువాత మూడోవాడికి, ఏడోవాడి వరకు అందరికీ అలాగే జరిగింది.

[27] అందరి తరువాత ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది.

[28] కాబట్టి చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు ఈ ఏడుగురిలో ఆమె ఎవరి భార్య? ఆమె వాళ్ళందరికీ భార్యగా ఉంది గదా?”

[29] యేసు వాళ్ళకు ఇలా జవాబిచ్చాడు: “లేఖనాలూ, దేవుని బలప్రభావాలూ మీకు తెలియదు గనుక పొరబడుతున్నారు.

[30] చనిపోయినవారు సజీవంగా లేచేటప్పుడు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లాగా ఉంటారు.

[31] చనిపోయినవారు సజీవంగా లేచే విషయమైతే – దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా?

[32] అదేమిటంటే, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.’ ఆయన చనిపోయినవారి దేవుడు కాడు గాని జీవిస్తూవున్న వారి దేవుడు.”

[33] ఇది విని జన సమూహానికి ఆయన ఉపదేశంవల్ల చాలా ఆశ్చర్యం కలిగింది.

[34] ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు సమకూడి వచ్చారు.

[35] వాళ్ళలో ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు ఒకడు ఆయనను పరీక్షించడానికి ఈ ప్రశ్న అడిగాడు:

[36] “ఉపదేశకా, ధర్మశాస్త్రంలో మహా ఆజ్ఞ ఏది?”

[37] యేసు అతనితో అన్నాడు, “హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి.

[38] ఇదే ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా.

[39] రెండో ఆజ్ఞ అలాంటిదే – మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.

[40] ఈ రెండు ఆజ్ఞలమీద ధర్మశాస్త్రమంతా ప్రవక్తల రచనలూ ఆధారపడి ఉన్నాయి.”

[41] పరిసయ్యులు గుమిగూడి ఉన్నప్పుడు యేసు వారిని ఒక ప్రశ్న అడిగాడు –

[42] “అభిషిక్తుని విషయం మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” వారు “దావీదు కుమారుడు” అని ఆయనకు జవాబిచ్చారు.

[43] ఆయన వాళ్ళతో “అలాగైతే దావీదు దేవుని ఆత్మమూలంగా ఎందుకు ఆయనను ప్రభువు అన్నాడు?

[44] దావీదు అన్నాడు గదా, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు – నేను నీ శత్రువులను నీ పాదాలక్రింద ఉంచేవరకు నా కుడిప్రక్కన కూర్చుని ఉండు.’

[45] దావీదు ఆయనను ‘ప్రభువు’ అంటే ఆయన అతనికి కుమారుడుగా ఎలా ఉంటాడు?” అన్నాడు.

[46] ఎవరూ ఒక్క మాట కూడా ఆయనకు జవాబు చెప్పలేకపోయారు. అంతేగాక, ఆ రోజునుంచి మరో ప్రశ్న అడగడానికి ఎవరూ తెగించలేదు.

మత్తయి శుభవార్త — Chapters